టీడీపీలో కొత్త తరం జోష్! చినబాబుకి అడ్డుకాకూడదనే వారిని తప్పిస్తున్నారా?
యనమల, కళా వెంకట్రావు, బుచ్చయ్య, ప్రత్తిపాటి పుల్లారావు వంటి వాళ్ల శకం ఇక ముగిసినట్టేనా?సీనియర్లను పక్కన పెట్టి, కొత్త వారికి పట్టం కట్టడం వెనుక స్కెచ్ అదేనా?
ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వ మార్పు ఆసక్తిగా ఉంటుంది. వారసుడికి పట్టాభిషేకం చేయాలని ఆశిస్తున్న సమయంలో కొన్ని కీలక మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులోనూ యువరాజుకి సంస్థాగతంగా ఎటువంటి చిక్కులు ఎదురుకాకుండా చూసే బాధ్యతను రాజు నెత్తినపెట్టుకోవడం ఆనవాయితీ. గతంలోనూ అదే జరిగింది. వర్తమానంలోనూ అదే జరుగుతోంది. అందుకు ఏపీలో పాలక టీడీపీ పరిణామాలు సాక్షం.
టీడీపీలో తొలితరం ఎన్టీఆర్ తో మొదలయ్యింది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన వెంట నడిచిన తొలితరం నేతల్లో అనేక మంది 1995లో జరిగిన నాయకత్వ మార్పు తర్వాత క్రమంగా తెరమరుగయ్యారు. చంద్రబాబు కోటరీలో చేరిన పలువురు కీలకంగా మారిపోయాయి. దేవేందర్ గౌడ్, ఎలిమినేటి మాధవరెడ్డి, యనమల రామకృష్ణుడు, కోటగిరి విద్యాధర్ రావు, అశోక్ గజపతిరాజు వంటి వారు ఆ జాబితాలో ముందువరుసలో నిలిచారు. అందుకు తగ్గట్టుగానే వారందరికీ చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ పెద్దపీట వేసింది. కీలక బాధ్యతలు కట్టబెట్టింది.
ఇప్పుడు మరోసారి టీడీపీలో తరం మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే మూడోతరం నాయకత్వం ఆపార్టీని చేజిక్కించుకోబోతోంది. నారా చంద్రబాబు వారసుడిగా నారా లోకేశ్ ఇప్పటికే తానేంటో నిరూపించుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోనూ కొంత గుర్తింపు సాధించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో టీడీపీ వ్యవహారాల్లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. తద్వారా అటు పార్టీలో, ఇటు ప్రజల్లో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు అనుగుణంగా తన సొంత టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు.
పాత నేతల తెరమరుగు
ఇటీవల టీడీపీలో పలువురు సీనియర్లు తెరమరుగవుతున్న తీరు అందుకు తార్కాణం. ఉదాహరణకు యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వర రావు వంటి వారిని చూడొచ్చు. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా యనమలకి ఎన్నడూ క్యాబినెట్ హోదాకి తగ్గని పదవులు కట్టబెట్టారు. అధికారంలో ఉంటే తొలుత స్పీకర్, ఆ తర్వాత మంత్రి.. విపక్షంలో ఉంటే పీఏసీ చైర్మన్ లేదా మండలిలో విపక్ష నేత హోదా ఇలాంటి వివిధ పదవులు ఆయనకు దక్కాయి. కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి ఆయన ఎటువంటి ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లోనూ కనిపించడం లేదు. ఇక మార్చిలో ముగియబోతున్న ఎమ్మెల్సీ పదవిని కొనసాగిస్తారా లేదా అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
ఉత్తరాంధ్ర నేతల్లో
కిమిడి కళా వెంకట్రావు పరిస్థితి కూడా దాదాపు అంతే. ఆయన మధ్యలో ప్రజారాజ్యంలోకి వెళ్లినప్పటికీ తిరిగి టీడీపీలో చేరగానే ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అలాంటి కళావెంకట్రావుకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా చివరి వరకూ ఊగిసలాటగానే కనిపించింది. ఆఖరికి సొంత సీటు ఎచ్చెర్లను త్యాగం చేసి, చీపురుపల్లిలో బొత్సా సత్యన్నారాయణను ఢీకొట్టాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వీచిన పెనుగాలిలో బొత్సా కోటను బద్ధలు కొట్టి గట్టెక్కినప్పటికీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఓవైపు చంద్రబాబు క్యాబినెట్లో, మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన నాయకుడికి ఇప్పుడు ప్రాధాన్యత కనిపించడం లేదు.
గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా అంతే. ఎప్పుడూ క్రియాశీలకంగా వ్యవహరించే ఆయన ప్రస్తుతం ప్రాధాన్యత లేకపోవడంతో పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా చివరి నిమిషం వరకూ ఊరించి, ఆఖరి విడతలో కట్టబెట్టిన వైనం గమనార్హం.
గోదావరి జిల్లాల నేతల్లో..
ఎన్టీఆర్ పాలనా కాలంలో చక్రం తిప్పిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యే. రాష్ట్ర విభజన తర్వాత గడిచిన మూడు దఫాలుగా రాజమండ్రి రూరల్ స్థానంలో గెలుస్తూ వస్తున్నారు. కానీ ఆయన ఆశలు పండడం లేదు. అమాత్య హోదా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. రాజమండ్రి రూరల్ సీటు త్యాగం చేసి నిడదవోలుకి బదిలీ మీద వెళ్లిన కందుల దుర్గేశ్ జనసేన కోటాలో మంత్రి హోదా దక్కించుకోగా, బుచ్చయ్యకి మాత్రం ఎదురుచూపులతోనే సరిపోతోంది.
ఉప ముఖ్యమంత్రిగా, హోం శాఖ బాధ్యతలు నిర్వహించిన మరో సీనియర్ నిమ్మకాయల చినరాజప్ప పరిస్థితి కూడా అంతే. ఆయన కూడా పెద్దాపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అయినా 2014-19 వరకూ డీసీఎంగా ఉన్న ఆయనకు ఈసారి ఛాన్స్ రాలేదు.
కృష్ణా, గుంటూరు నేతల్లో
దేవినేని ఉమా అయితే 2014-19 మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా నిత్యం వార్తల్లో ఉండేవారు. అలాంటి నేతకు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కలేదు. ఇప్పటి వరకూ ఎటువంటి పదవీ లభించలేదంటే పార్టీలో ఆయనకు తగ్గుతున్న ప్రాధాన్యతకి సంకేతంగా భావించాల్సి ఉంటుంది.
ప్రత్తిపాటి పుల్లారావు లాంటి సీనియర్ నేతల సంగతి కూడా అంతే. ఆయన కూడా మరోసారి మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా కోరిక నెరవేరలేదు.
వీరే గాకుండా ఇతర పలువురు సీనియర్లు పితాని సత్యన్నారాయణ, అమర్నాథ్ రెడ్డి, దూళిపాళ నరేంద్ర సహా పలువురికి తగినంత గుర్తింపు కనిపించడం లేదు.
యువనేత ఇలాకాలో అంతే..
ఇదంతా నారా లోకేశ్ జమానా కారణంగానే జరుగుతున్న పరిణామాలుగా స్పష్టమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల విషయంలో గానీ, ఇతర ముఖ్య వ్యవహారాల్లో గానీ నారా లోకేశ్ మాటకే ప్రాధాన్యత దక్కుతోంది. దానికి తగ్గట్టుగానే ఆయన తనకు సన్నిహితులైన వారికే అవకాశం ఇస్తున్నారు. చివరికి క్యాబినెట్లో సీనియర్లను కాదని వాసంశెట్టి సుభాష్, మడిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ వంటి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారికి అవకాశం ఇవ్వడంలో అదే కీలకాంశంగా ఉంది. తన టీమ్ ను తయారుచేసుకునే పనిలో చినబాబు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇది టీడీపీలో సినీయర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నాలుగుసార్లు, ఐదు సార్లు అసెంబ్లీకి గెలిచిన నేతలను కూడా క్యాబినెట్ లో తీసుకోకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా టీడీపీలో తరం మారుతుందన్న విషయాన్ని చాటుతున్నారు.
టీడీపీలో తొలితరం నుంచి రెండోతరానికి అధికారం మార్పిడి అంత సులువుగా సాగలేదు. ఆగష్టు సంక్షోభంగా పేర్కొనే ఆనాటి పరిణామాలు టీడీపీ చరిత్రలోనే కీలక ఘట్టంగా మిగులుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో అన్ని చోట్లా టీమ్ లోకేశ్ తయారయిపోతోంది. వారిదే పైచేయిగా మారుతోంది. కాబట్టి మూడోతరం ముఖచిత్రం ఆవిష్కరణకు పెద్దగా ఆటంకాలు ఉండబోవనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇది టీడీపీ రాజకీయాలను ప్రభావితం చేసే అంశం. కొత్త సారధ్యంలో ఆపార్టీ పయనం మరింత ఆసక్తికరం.