టీడీపీ శాసన సభ ఎన్నికల్లోనే కాదు మొదటి నుంచీ పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా ప్రభంజనం సృష్టించింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను బద్దలు కొట్టింది.


జి. విజయ కుమార్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా జాతీయ స్థాయిలోను చక్రం తిప్పింది. టిడిపి ఏర్పడిన అనంతరం వచ్చిన తొలి ఎన్నికల్లో ఏకంగా 30 ఎంపి స్థానాలు కొల్లగొట్టి సంచలం సృష్టించింది. 1999లో 29 లోక్‌ సభ స్థానాలు గెలుచుకొని దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించింది.

టిడిపి ఆవిర్భావం
టిడిపి ఏర్పడిన నాటి నుంచి 2019 వరకు 10 సార్లు లోక్‌ సభ ఎన్నికలు జరిగాయి. 1982 మార్చి 29న ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. 1984లో 8వ లోక్‌ సభ ఎన్నికల నుంచి 1991లో జరిగిన 10వ పార్లమెంట్‌ ఎన్నికల వరకు ఎన్టీఆర్‌ నేతృత్వంలో ఎన్నికల్లో పాల్గొనగా 1996 నుంచి 2019లో జరిగిన 17వ లోక్‌ సభ ఎన్నికల వరకు చంద్రబాబు సారధ్యంలో ఎన్నికలకు వెళ్లారు.
టిడిపి ఏర్పాటు చేసిన తర్వాత 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను 201 సీట్లల్లో టిడిపి జెండాను రెపరెపలాడించింది. మరుసటి ఏడాదిలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. నాటి 42 పార్లమెంట్‌ స్థానాలకు గాను ఏకంగా 30 స్థానాలు సొంతం చేసుకొని కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
రెండే సీట్లు
తర్వాత 1989లో జరిగిన 9వ పార్లమెంట్‌ ఎన్నికల్లో చతికల పడింది. కేవలం రెండు ఎంపి సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో 39 స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఒక స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో నర్సాపూర్‌ నుంచి భూపతిరాజు విజయకుమార్‌రాజు, బొబ్బిలి నుంచి కొంబూరి రామ్మోహన్‌రావు టిడిపి నుంచి విజయం సాధించారు. తర్వాత టిడిపి క్రమంగా పుంజుకుంది. 1991లో జరిగిన 10వ పార్లమెంట్‌ ఎన్నికల్లో 13 సీట్లను గెలుచుకొని ఊపిరి పీల్చుకుంది. అప్పుడు జిఎంసి బాలయోగి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బోళ్ల బుల్లిరామయ్య, లాల్‌జాన్‌ బాషా, తోట సుబ్బారావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కేవిఆర్‌ చౌదరీ, ఎంవివిఎస్‌ మూర్తి వంటి నేతలు ఎంపిలుగా గెలుపొందారు. సీఎంసీ బాలయోగి స్పీకర్‌గా పనిచేశారు. 1996లో జరిగిన 11వ పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 స్థనాలను సొంతం చేసుకుంది. తర్వాత జరిగిన 12వ లోక్‌ సభ ఎన్నికల్లో రెండు సీట్లు తగ్గాయి. ఈ ఎన్నికల్లో 14 సీట్లకే పరిమితమైంది.
దేశంలోనే నాల్గవ పెద్ద పార్టీగా టిడిపి
1999లో జరిగిన 12వ పార్లమెంట్‌ ఎన్నికల్లో అయితే తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంది. తొలి సారి గెలుచుకున్న సీట్లకు చేరువైంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 29 స్థానాలను సొంతం చేసుకుంది. ఉత్తరాంధ్రతో పాటు తక్కిన ప్రాంతాల్లో కూడా ఆధిక్యతను ప్రదర్శించింది. ఏలూరు నుంచి బాపట్ల వరకు కాంగ్రెస్‌ తుడిచి పెట్టుకొని పోయింది. శ్రీకాకుళం నుంచి ఎర్రన్నాయుడు, పార్వతీపురం నుంచి గౌరీ శంకరరావు, విశాఖ నుంచి ఎంవివిఎస్‌ మూర్తి, అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు, కాకినాడ నుంచి ముద్రగడ పద్మనాభం, అమలాపురం నుంచి జిఎంసి బాలయోగి, ఏలూరు నుంచి బోళ్ల బుల్లిరామయ్య, మచిలీపట్నం నుంచి అంబటి బ్రహ్మయ్య, విజయవాడ నుంచి గద్దె రామ్మోహన్, తెనాలి నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బాపట్ల నుంచి దగ్గుపాటి రామానాయుడు, ఒంగోలు నుంచి కరణం బలరాం, నెల్లూరు నుంచి ఉక్కాల రాజేశ్వరమ్మ వంటి నేతలు గెలుపొందారు. హిందూపూర్, అనంతపూర్, కర్నూలు, నంద్యాల వంటి స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. తర్వాత నుంచి టిడిపి ప్రాభవాన్ని కోల్పోయి 2014లో మళ్లీ పుంజుకుంది. 2004లో 5, 2009లో 6 స్థానాలకు టిడిపి పరిమితమైంది. విభజిత రాష్ట్రంలో 2014లో తొలి సారి జరిగిన 16వ లోక్‌ సభ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది. 25 స్థానాలకు గాను 16 సీట్లలో టిడిపి విజయకేతనం ఎగుర వేసింది. 2019లో జరిగిన 17వ లోక్‌ సభ ఎన్నికల్లో మూడు స్థానాలకు పరిమితమైంది.
Next Story