‘నాలుక కోసుకుంటా’.. బుద్దా వెంకన్న మళ్లీ ఛాలెంజ్ చేశాడబ్బా..
x

‘నాలుక కోసుకుంటా’.. బుద్దా వెంకన్న మళ్లీ ఛాలెంజ్ చేశాడబ్బా..

‘రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే నా నాలుక కోసుకుంటా’ అని టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.


మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. ఆరా మస్తాన్ పోస్ట్ పోల్ సర్వే ఫలితాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఛాలెంజ్ కూడా చేశారు. ఆరా మస్తాన్ తన ఛాలెంజ్‌కు ముందుకు రావాలని సవాలు విసిరారు. "రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. నా నాలుక కోసుకుంటా. కూటమి అధికారంలోకి వస్తే ఆరా మస్తాన్ నాలిక కోసుకోవడానికి సిద్ధమా?" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. విజయవాడ టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సవాల్ విసిరారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శనివారంతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని కొన్ని సంస్థలు, జాతీయ మీడియాతో పాటు ఎన్నికల ప్రక్రియపై పోస్ట్ పోల్ సర్వేలను ప్రకటించాయి. ఇందులో ప్రధానంగా దాదాపు 40 సంస్థలు ఏ పార్టీ దేశంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రానున్నది. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేవి ప్రకటించారు. వాటిలో ఐదు సర్వే సంస్థలు మినహా 35 సర్వేలు ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. ఆ ఐదు సంస్థలు వైఎస్ఆర్సిపి అధికంగా సీట్లు సాధిస్తుందని వివరించాయి. అందులో ఆరా సంస్థ మస్తాన్ వెల్లడించిన పోస్ట్ పోల్ వివరాల్లో.. 94 నుంచి 104 సీట్లు వైఎస్ఆర్సిపి గెలుచుకుంటుందని, టిడిపి కూటమికి 71 నుంచి 81 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆరా మస్తాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆరా మస్తాన్ వైసీపీకి అనుకూలంగా ఫలితాలు చెబుతున్నారని టిడిపి ఆరోపిస్తోంది. అధికార పార్టీకి ఆయన వంత పాడే విధంగా సర్వే ఫలితాలు చెబుతున్నారని కూడా నిరసిస్తున్నారు. దీనిపై స్పందించిన టిడిపి నేత బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నాలుక కోసుకుంటా..

ఆరా సంస్థ అధిపతి మస్తాన్ పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా తప్పు పట్టారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఆరా సంస్థతో సర్వే చేయించారని ఆరోపించారు. "మస్తాన్ చేసింది ఫేక్ సర్వే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టిడిపి కూటమే" అని జోస్యం చెప్పారు. "కూటమి అధికారంలోకి రాకపోతే నా నాలుక కోసుకుంటా. ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడను. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే, ప్రజలను తప్పుదారి పట్టించకుండా నువ్వు (మస్తాన్)నాలుక కోసుకుంటావా"? ధమ్ము ఉంటే ఈ ఛాలెంజ్‌కు ముందుకు రావాలి’’ అని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.

రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి- జనసేన- బిజెపి కూటమి పార్టీల మధ్య 2024 ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత, అభివృద్ధి లేకపోవడం, ఉపాధి అవకాశాలు మందగించడం వంటి ప్రతికూలత అంశాలు కూటమికి లాబిస్తాయని అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని విద్యావంతులు, తటస్థులు అధికంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. దీంతో గతంలో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగి, అంచనాలను మించి 81 శాతం నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అధికారికంగా ప్రకటించింది. ఓటింగ్ శాతం పెరగడం అనేది అధికారంలో ఉన్న పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా పోస్ట్ పోల్ సర్వేలో కూడా అనేక సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని కూడా తేల్చి చెప్పాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడం తథ్యమని అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, పోస్ట్ పోల్ సర్వే అంచనాలు పార్టీలో ఎవరికివారు లెక్కలు వేసుకొని ధీమాతో ఉన్నారు. వాటన్నిటిలోకి ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష కూటమి ఆరా మస్తాన్ పోస్ట్ పోల్స్ సర్వే ఫలితాలపై మండిపడుతుంది. ఈ సర్వే ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని అభిప్రాయపడుతున్నాయి దీంతో బుద్ధా వెంకన్న సీరియస్‌గా స్పందించినట్లు కనిపిస్తోంది.

అప్పుడు తొడగొట్టి..

2019 ఎన్నికల్లో అప్పట్లో అధికారంలోని టిడిపితో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సారాజ్యంలోని వైయస్ఆర్సీపీ గట్టిగా తలపడింది. కడప జిల్లా ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు వైఎస్. జగన్మోహన్ రెడ్డి అవిశ్రాంతంగా పాదయాత్ర సాగించారు. అనంతరం జరిగిన పోలింగ్ తర్వాత కౌంటింగ్ కు మధ్యలో ఎక్కువ రోజులు గడువు వచ్చింది. ఆ సందర్భంలో కూడా బుద్దా వెంకన్న విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొడగొట్టి మరీ సవాల్ చేశారు. రెండోసారి కూడా వరుసగా టిడిపి అధికారంలోకి వస్తుందని తొడగొట్టిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దీమాగా చెప్పారు. ఓట్ల లెక్కింపులో వైయస్ఆర్సీపీకి ఊహించని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు విజయవాడ కార్యాలయంలోనే మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం తగ్గకూడదని తొడగొట్టినట్లు మీడియాకు చమత్కారంగా వివరణ ఇవ్వడం గమనార్హం.

2024 ఎన్నికల్లో ఉద్యోగ వర్గాలతో పాటు ఇతర సంస్థల సిబ్బంది కూడా అధికార వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఆ విషయం స్పష్టమైంది. అధికార ప్రతిపక్ష కూటమి మధ్య హోరాహోరీగానే పోటీ జరిగింది. గతం కంటే అధిక సీట్లతో అధికారంలోకి వస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘంటాపథంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తమకు అనుకూలంగా ఉందని, అనేక సంస్థల పోస్ట్ పోల్ సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని టిడిపి ధీమాతో ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బుద్ధా వెంకన్న సవాల్ సహకారం అవుతుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఈ సవాల్ ఆరా మస్తాన్ స్వీకరిస్తారా లేదా అనేది పక్కకు ఉంచితే.. " తన పోస్ట్ పోల్ సర్వే తప్పు అని నిర్ధారణ అయితే, ఇకపై ఆ సర్వేల జోలికి వెళ్లనని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు. టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సవాల్‌కు ఏ విధంగా ఆరా మస్తాన్ స్పందిస్తారనేది వేచి చూద్దాం.

Read More
Next Story