వాళ్లకి పట్టిన గతే వైసీపీ సర్కార్‌కి కూడా..
x
Source: Facebook

వాళ్లకి పట్టిన గతే వైసీపీ సర్కార్‌కి కూడా..

వైసీపీ చేతకాని తనం వల్లే పెన్షన్లు ఆగాయని టీడీపీ నేత పట్టాభి రాం మండిపడ్డారు.దమ్ముంటే ఒక్కరోజు సీఎం సీటు నుంచి తప్పుకోవాలని సీఎం జగన్‌ను ఛాలెంజ్ చేశారు.


పెన్షన్లు రాలేదని వృద్ధులు నిలదీస్తే టీడీపీ వల్లే అని చెప్పండన్న వైసీపీ సర్కార్ వ్యాఖ్యలపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రాం మండిపడ్డారు. పెన్షన్లు పంపిణీ చేయడానికి సర్కార్ దగ్గర వాలంటీర్లు తప్ప మరే ఇతరులు లేరా అని నిలదీశారు. తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ సర్కార్ ఇతరులపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని, ఈ పెన్షన్ల వ్యవహారం కూడా అటువంటిదేనంటూ వైసీపీపై ధ్వజమెత్తారు. అనంతరం లబ్దిదారులకు పెన్షన్‌లు ఇవ్వొద్దని ఎవరూ చెప్పలేదని, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు తర్వాతే పెన్షన్లపై కొన్ని ఆంక్షలు విధించారని, తాజాగా వాటిని కూడా సడలిస్తూ అధికారులు కీలక సూచనలు చేసిన విషయం సర్కార్‌కు తెలియదా అని నిలదీశారు.

వాలంటీర్లను అందుకే దూరం పెట్టారు

ఫించన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్‌ కన్నా ముందే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పట్టాభి గుర్తు చేశారు. కానీ ఎన్నికల సంఘం కానీ, ఉన్నత న్యాయస్థానం కానీ పెన్షన్ల పంపిణీని ఆపేయాలని చెప్పలేదని అన్నారు. ‘‘రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలైన కారణంగానే ఎన్నికల విధుల నుంచి కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిని తొలగించాలని ఎన్నికల సంఘం నిశ్చయించింది. అందులో భాగంగానే అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం జరిగింది. ఇది టీడీపీ కుట్ర ఎలా అవుతుంది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయమే. దీనికి కుట్ర రంగు పులుముతుంది వైసీపీ పార్టీనే’’అని ఆయన ఆగ్రహించారు. అంతేకాకుండా 29,30,31 తేదీల్లోనే ఎంతో తెలివిగా వైసీపీ సర్కార్.. కోట్ల రూపాయలను తారుమారు చేసిందని, ఖాజానాను ఖాళీ చేసి కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని, ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేకనే వాళ్లు డ్రామాలు ఆడుతున్నారని, దీనిని ప్రతి పెన్షన్ దారుడు గుర్తించాలని వ్యాఖ్యానించారు పట్టాభి..

పెన్షన్ ఇవ్వాలంటే అప్పు తేవాల్సిందే

రాష్ట్ర ఆర్థిక స్థితి అత్యంత దుర్భరంగా తయారైందని పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం అప్పు తెస్తే కానీ రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వలేని దుస్థితి నెలకొని ఉంది. 60 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలంటే కనీసం రూ.1958 కోట్లు అప్పు తీసుకురావాలి. అంతేకాకుండా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ మొదలవుతుందని, ఈ ప్రక్రియకు చంద్రబాబు నాయకుడు విఘాతం కలుగజేయకుండా ఆదేశాలు జారీ చేయాలని సీఎం జగన్ కోరారు. నాకు ఒకే ఒక సందేహం కలుగుతోంది. రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేయాలంటే వైసీపీ సర్కార్ దగ్గర వాలంటీర్లు తప్ప మరెవరూ లేరా? రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు 1.35 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి 40-45 పెన్షన్లు ఇవ్వాలి. అలా చూసుకున్నా వాళ్లు రోజుకు 15 మందికే ఇచ్చినా మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ముగుస్తుంది. అయినా సచివాలయం దగ్గరకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి ఎందుకు ఆదేశాలు ఇచ్చారు’’అని పట్టాభి ప్రశ్నించారు.

అయితే ఈ సందర్భంగానే సీఎం జగన్‌కు పట్టాభిరాం బహిరంగ సవాల్ విసిరారు. సీఎం సీటు నుంచి ఒక్కరోజు తప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు. ‘‘సీఎం సీటు నుంచి ఒక్కరోజు తప్పుకో.. చంద్రబాబు సారథ్యంలో ఒకే రోజులో రాష్ట్రమంతా పెన్షన్ల పంపిణీ చేసిన చూపిస్తాం’’అని అన్నారు. అంతేకాకుండా ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందా అని సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నానని ప్రశ్నించారు. సర్కార్ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్లు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా వైసీపీ తన విధానాలు మార్చుకుంటే మంచిదని, లేకుండా కరడుగట్టిన వాళ్లు కూడా కాలగర్భంలో కలిసి పోయారని, వైసీపీకి అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు.

Read More
Next Story