‘ప్రజల జేబులు నింపేలా కూటమి పాలన’.. వైసీపీకి యనమల స్ట్రాంగ్ కౌంటర్
x

‘ప్రజల జేబులు నింపేలా కూటమి పాలన’.. వైసీపీకి యనమల స్ట్రాంగ్ కౌంటర్

ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌పై ఏపీ సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్‌పై వైసీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వాటికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఘాటుగా బదులిచ్చారు.


ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌పై ఏపీ సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్‌పై వైసీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వాటికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఘాటుగా బదులిచ్చారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో తప్పేముందని వైసీపీని నిలదీశారాయన. ఆర్డినెన్స్‌పై అవగాహన లేకే వైసీపీ ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఓటాన్ అకౌంట్‌పై సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ భారత రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియామలకు లోబడే ఉందని, అలాంటప్పుడు ఈ ఆర్డినెన్స్‌ చట్ట విరుద్దం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలకు అవగాహన ఉండి ఉంటే ఇలాంటి విమర్శలు చేసే వారు కాదని, అసలు ఐదేళ్ల వైసీపీ పాలనలో వారు పాల్పడిన ఆర్థిక అరాచకత్వం వల్లే ఈ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన దుస్తితి పట్టిందని ఆయన మండిపడ్డారు. 2019-2024లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పన్నులు, ఛార్జీల రూపంలో ఒక్కో కుటుంబంపై రూ.7లక్షల అధిక భారం మోపిందని, ప్రజల రక్తాన్ని పీల్చి ప్రజలకు పిప్పి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో జగన్ ముఠా తప్ప రాష్ట్రంలో బాగుపడిన వాళ్లు ఎవరూ లేరని విమర్శించారు. జగన్ ముఠా ఆదాయం మూడు లక్షల కోట్లకు పెరిగిందని, ఎక్కడపడితే అక్కడ భూములను కూడా కబ్జాచేసేశారంటూ ధ్వజమెత్తారు.

తేలాల్సిన అప్పులు ఇంకా ఉన్నాయ్..

రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన వైసీపీ.. ఖనిజ, సమజ వనరులను లూఠీ చేసేసిందని, రాష్ట్రాన్ని డొల్లగా మార్చేసిందని విమర్శించారు. ఐదేళ్లలో దాదాపు రూ.19వేల కోట్లను స్వాహా చేశారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. ప్రజలకు అదనపు ఆర్థిక భారం మోపకుండా పాలన కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. ‘‘కూటమి అందిస్తున్న సుభిక్ష పాలనను చూసి జీర్ణించుకోలేక ప్రభుత్వం తెచ్చే సంక్షేమ కార్యక్రమాలపై విషం చిమ్మడానికి కుట్రలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం వైసీపీ తెచ్చిన అప్పులు రూ.10 లక్షల కోట్లు. తేలాల్సిన లెక్కలు ఇంకా ఉన్నాయి. ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ ప్రభుత్వం.. ఐదేళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేయలేదు. మరి ఆ డబ్బంతా ఏమైంది. ఇవన్నీ తేలాల్సిన లెక్కలే. రుషికొండపై ప్యాలెస్ కట్టించడానికి అయిన రూ.600 కోట్లు ఎక్కడివి? ఎవరివి? వీటన్నింటిని నిగ్గు త్వరలోనే తేలనుంది’’ అని హెచ్చరించారు.

వైసీపీ చేసిన విమర్శలేంటంటే..!

అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై వైసీపీ ఘాటైన విమర్శలే చేసింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎగ్గొట్టడానికే కూటమి సర్కార్ ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సంకల్పించింది. పైగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వాటిలో కూడా బడ్జెట్ ప్రస్తావన తీసుకురాలేదని ఎద్దేవా చేసింది. ఇంకేమైనా అంటే శ్వేతపత్రాల పేరుతో ఆత్మస్తుతి చేసుకోవడం, పరనిందలతో వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికే ఈ అసెంబ్లీ సమావేశాలు సరిపోయాయని వైసీపీ నిష్టూరం ప్రకటించింది. వీటికి సమాధానంగానే యనమల కృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read More
Next Story