తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అనేది సమాజంలో ఒక గుర్తింపు. టీడీపీ ఐడీ కార్డు వేసుకోవడమే ఒక స్టేటస్ అని సీఎం చంద్రబాబు అన్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసం రూ. 1తో ప్రారంభమై నేడు రూ. 100లకు చేరిందని, సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు రూ. 5లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాతూ తొలుత రూ.1తో ప్రారంభమైన టీడీపీ సభ్యత్వం తర్వాత రూ. 5లకు పెంచామని, దానిని నేడు రూ. 100లకు పెంచుతున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉండటమే గొప్ప గౌరవమని, టీడీపీ ఐడీ కార్డును వేసుకోవడం సమాజంలో ఒక స్టేటస్ సింబల్‌కు గుర్తని అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా సీఎం చంద్రబాబు తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. రెన్యువల్ కార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. అంజిరెడ్డి అనే కార్యకర్త ఎన్నికల నామినేషన్ వేయనీకుండా వైఎస్‌ఆర్‌సీపీ రౌడీలను ప్రాణాలకు తెగించి ఎదిరించి నిలబడి టీడీపీ శ్రేణుల్లో మనో ధైర్యాన్ని నింపారని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును కొనసాగించలేక పోతున్న కార్యకర్తల కుమార్తెలకు పార్టీ అండగా ఉంటుందని, వారు ఎంత వరకు చదివితే అంత వరకు పార్టీ తరపున చదివిస్తామని భరోసా ఇచ్చారు.