ఆంధ్రప్రదేశ్‌లో 30 రోజుల రాజకీయం.. ప్రశ్నలు సంధించిన షర్మిల
x

ఆంధ్రప్రదేశ్‌లో 30 రోజుల రాజకీయం.. ప్రశ్నలు సంధించిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ మాస రాజకీయాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ముప్పు రోజులు గడిచిన సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? అసలు ఏం చేస్తానని చెప్పింది? అన్న అంశాలు కీలకంగా మారాయి.


ఆంధ్రప్రదేశ్ మాస రాజకీయాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ముప్పు రోజులు గడిచిన సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? అసలు ఏం చేస్తానని చెప్పింది? అన్న అంశాలు కీలకంగా మారాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తమ 30 రోజుల ప్రోగ్రెస్ కార్డును ‘30 రోజుల్లో చేసిన 30 కార్యక్రమాలు’ పేరిట ప్రకటించింది. దీనిపై వైసీపీ కౌంటర్లే వేస్తుండగా.. కూటమి ప్రభుత్వం చెప్పిందేమైనా చేసిందా అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అదే విధంగా టీడీపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న సంబంధంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. టీడీపీకి కాంగ్రెస్ తోక పార్టీ అని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, కాంగ్రెస్ ఎవరికీ తోక పార్టీ కాదని, ఎన్నటికీ అవ్వదని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరు ఏమన్నారంటే..

30 రోజులు 30 కార్యక్రమాలు

1. 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్

2. వృద్ధాప్య, వితంతు పెన్షన్ రూ.4000 కి పెంపు

3. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6000 కి పెంపు

4. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ

5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు

6. ఉచిత ఇసుక అమలు (కేవలం లోడింగ్, రవాణా చార్జీలు చెల్లిస్తే చాలు)

7. ఆగస్టు 15 నుంచి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం

8. గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు

9. ఎర్ర చందనంపై ఉక్కుపాదం

10. రాజధాని అమరావతి పనులు ప్రారంభం

11. పోలవరం నిర్మాణం పునః ప్రారంభం

12. స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం

13. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి, తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల

14. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు

15. పట్టిసీమ మొదలు పెట్టి, కృష్ణా డెల్టాకి నీరు విడుదల

16. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్

17. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలించి, 2026కి పూర్తి చేయాలని ఆదేశం

18. తిరుమల ప్రక్షాళన ప్రారంభం

19.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి

20. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు

21. ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్

22. రాజధానిలో XLRI విద్యా సంస్థ

23. 5 ఏళ్ళ తరువాత పలాసకు సాగు నీరు

24. 5 ఏళ్ళ తరువాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్ళు

25. ఒక్క వాట్సప్ కాల్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్ధులకు అండగా లోకేష్

26. ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు

27. తెలంగాణాతో విభజన సమస్యలపై ముందడుగు

28. విజయవాడ తూర్పు బైపాస్‌కి కేంద్రం ఆమోదం

29. నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు. రైతు బజార్లలో బియ్యం, కంది పప్పు తక్కువ రేట్లకే

30. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో, ఏడుగురు మంత్రులు, ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం

ఈ కార్యక్రమాలతో పాటు మరెన్నో కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేసింది. పలు జిల్లాల్లో అక్కడి స్థితిగతులు, ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి కూడా సారించిందని, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అన్న అంశాలపై మంత్రులే నేరుగా రంగంలోకి దిగి మరీ ఆరా తీస్తున్నారని, అవకతవకలు ఉంటే ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ చెప్పుకొచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎంలు సైతం ప్రజల్లోకి వెళ్తూ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పాలన చేస్తున్నారని కూడా రాసుకొచ్చింది.

కౌంటర్ ఇచ్చిన వైసీపీ

టీడీపీ వారు ప్రకంటించుకున్న 30 కార్యక్రమాల జాబితా నేపథ్యంలో ప్రభుత్వానికి వైసీపీ శ్రేణులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాయి. ‘‘ఇవి సరే బాబు.. వాలంటీర్లకు ఇస్తానన్న ఉద్యోగాలు ఏవి? అసలు వాలంటీర్ వ్యవస్థ ఏది? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏది? ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ఏది? సూపర్ సిక్స్ అని చెప్పనవన్నీ సూపర్ డూప్‌గానే మారిపోయాయి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. ఇది వరకు ప్రభుత్వం అందించే ప్రతి సౌకర్యాన్ని ఇంటి దగ్గరే కూర్చుని అందుకే ప్రజలు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా చేసిన ఘనత మాత్రం మీకే దక్కుతుందిలేండి చంద్రబాబు అంటూ చురకలంటించాయి కూడా.

ప్రశ్నలు గుప్పించిన షర్మిల

కూటమి ప్రభుత్వం 30 రోజుల పాలనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్నా దీనిని అమలు చేయలేదు. సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీలు పేపర్లకే పరిమితయ్యాయి. ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా మంచి పథకం. కర్ణాటక, తెలంగాణలో ఇది విజయవంతమైంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే ఈ పథకం అమల్లోకి వచ్చింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మూడు వారాల్లోనే ఈ పథకాన్ని మహిళలకు అందించడం జరిగింది. కానీ కేవలం చంద్రబాబుకు మాత్రం ఈ పథకం అమలు చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందో ప్రభుత్వం చెప్పాలి’’ అని నిలదీశారు.

ఎందుకింత ఆలస్యం

‘‘మహిళలు భద్రమైన ప్రయాణం కోసం ఆర్‌టీసీని ఆశ్రయిస్తారు. అర్థరాత్రి అయినా నిర్భయంగా ఆర్‌టీసీలో ప్రయాణించగలరు. అలాంటి ఈ భద్రతను ఉచితంగా చెప్పిన చంద్రబాబు అమలుకు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు. రాష్ట్ర మహిళలు ఈ పథకం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ పథకం అమలు ఆలస్యం అవుతుందా? చేస్తున్నారా? ఈ పథకం విధివిధానాలు ఏంటో కూడా ఇప్పటివరకు తెలియదు. ఉన్న బస్సు సౌకర్యంలో మహిళలకు ఉచితం అందించడానికి ఇంత ఆలస్యమా? ఈ పథకం అమలుకు ఎందుకింత సమయం పడుతుందో ప్రజలకు ప్రభుత్వం వివరించాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.

తల్లికి వందనంలో క్లారిటీ కావాలి

‘‘సూపర్ సిక్స్ అంటూ ప్రకటించిన వాటిలో మిగిలిన పథకాలు వెంటనే అమలు చేయాలి. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ పథకం విషయంలో చాలా గందరగోళం ఉంది. దీనిపై వెంటనే క్లారిటీ ఇవ్వలేదు. దాంతో పాటుగా ఈ పథకంపై విడుదల చేసిన జీఓపై కూడా స్పష్టతనివ్వాలి. డబ్బును తల్లికి ఇస్తారా? బిడ్డకు ఇస్తారా? ఉత్తర్వుల్లో మాత్రం తల్లికి రూ.15 వేలు అని ఉంది. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది’’ అని తెలిపారు. అంతేకాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

జగన్ కూడా అదే చేశారు

‘‘2019 ఎన్నికల సమయంలో జగన్ కూడా ఇంట్లో ఎంతమంది చిన్నారులు ఉంటే అంతమందికీ అమ్మఒడి పథకం అందిస్తామని చెప్పారు. అధికారం వచ్చిన తర్వాత మాత్రం జగన్ ప్రభుత్వం కూడా ఇంట్లో ఒక్క బిడ్డకు మాత్రమే పథకాన్ని అందించింది. ఎన్నికల్లో గెలవడానికి మాట ఇచ్చి.. ఆ తర్వాత అధికారం రావడంతో జగన్.. ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు జగన్‌కు చెందిన సాక్షి పత్రికా ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాలి. ఇది షర్మిలగా కాదు కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.

విశాఖ ఉక్కుపైనా గందరగోళమే

‘‘విశాఖ ఉక్కుపై కూడా గందరగోళం సృష్టించారు. అమ్ముకుంటున్నామంటారు.. మళ్ళీ అలాంటిదేమీ లేదు.. భయం అక్కర్లేదంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ కోసం ఎంతో కృషి చేసిన నేత వైఎస్ఆర్ ఒక్కరే. కానీ ఇప్పటి సీఎం ఎవరూ కూడా విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. ఇంకేమైనా అంటే విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా మోదీ మాట్లాడానంటూ విచిత్రంగా మాట్లాడతారు. మోదీతో మాట్లాడేదేంటి? నిజంగా ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నారా? దీనిపై సీఎంగా చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

Read More
Next Story