బిసిలపై టిడిపి, వైసిపిలు గురి

వైసిపి 46 మంది బిసిలకు సీట్లు, ఇప్పటి వరకు టిడిపి,జనసేన కూటమి 18 స్థానాలు కేటాయింపు


బిసిలపై టిడిపి, వైసిపిలు గురి
x
Chandrababu, Pavan kalyan, YS Jagan mohanreddy

G. Vijaya Kumar

ఆంధ్రప్రదేశ్‌లో బిసిల చుట్టూ రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ వర్గాలకు ఎంత మందికి స్థానాలు కేటాయించారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. బిసిలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 2014 ఎన్నికల్లో బిసి వర్గాలకు మంచి ప్రాధాన్యత కల్పించారని చెప్పొచ్చు. బిసి నినాదంతో వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో 18 మంది బిసిలకు సీట్లు కేటాయించారు. వీరుకూడా బాగానే బిసిలకు ప్రాధాన్యత కల్పించారని చెప్పొచ్చు. మిగిలిన సీట్లలో ఎంతమంది బీసీలకు సీట్లు ఇస్తారో వేచి చూడాల్సిందే.

టీడీపీ కూటమి ప్రకటించిన స్థానాల్లో 18 మంది బీసీలు
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఇటీవల విడుదల చేసిన టిడిపి జనసేన కూటమి జాబితాలో 18 మంది బిసి అభ్యర్థులకు స్థానాలు కేటాయించారు. వీరిలో ఒకరు జనసేన నేత కొణతాల సత్యనారాయణ కాగా తక్కిన 17 మంది టిడిపికి చెందిన అభ్యర్థులు.
తెలుగుదేశం పార్టీ తొలి నాటి నుంచి బిసిలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు ప్రకటించిన వాటిల్లో కేవలం 18 మంది ఉన్నందున తక్కిన 76 స్థానాల్లో ఎంత మందికి బిసిలకు సీట్లు కేటాయిస్తారనే దానిపై చర్చ సాగుతోంది.
వైసీపీ జాబితాలో 46 మంది బీసీలు
ఇప్పటికే వైసిపి అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఖరారు చేసినట్లు ఇటీవల సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం జరిగిన పార్టీ ముఖ్య కార్యక్తల, నాయకుల సమావేశంలో స్పష్టం చేశారు. అంటే ఇక కొత్త అభ్యర్థులు లేనట్టే. గతంలో బిసి సామాజిక వర్గానికి చెందిన వారు 41 మంది ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో కానీ ఇది వరకే ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కానీ కలుపుకుంటే దాదాపు 46 మంది బిసి అభ్యర్థులు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉంటారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎలక్షన్‌లో మరో ఐదుగురు బిసి అభ్యర్థులకు ఎక్కువుగా సీట్లు కేటాయించారు.
ఎప్పటి నుంచో బిసిలు తమ వెంటే అంటున్న టిడిపి
వైసిపి జాబితా చూసిన తర్వాత ఏ విధమైన ఆలోచన చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. టిడిపి, జనసేన కూటమి త్వరలో ప్రకటించే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటే వైసిపి అభ్యర్థుల కంటే పెరుగుతారా లేదా తగ్గుతారా అనేది ప్రస్తుతం బిసి వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.
Next Story