టీడీపీ ‘వసంత’ గానం.. మైలవరంలో అసమ్మతి రాగం

నిన్న మొన్నటి వరకు మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మాజీ మంత్రి దేవినేని ఉమానే దిక్కు. తాజాగా టీడీపీ వసంత గానం ఆలపించడం మైలవరంలో అసమ్మతి రాగం తారా స్థాయికి చేరింది. మైలవరంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రం టీడీపీకి సవాలుగా మారింది.


టీడీపీ ‘వసంత’ గానం.. మైలవరంలో అసమ్మతి రాగం
x
Vasanta Krishna Prasad, MLA

జి. విజయ కుమార్

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి కమ్మ సామాజికవర్గానికే పట్టాభిషేకం జరుగుతూ వచ్చింది. టీడీపీ తొలి నుంచి కమ్మ సామాజికవర్గ ప్రతినిధినే ఇక్కడ పోటీ పెడుతూ వచ్చింది. అయితే దీనిని బద్దలు కొట్టాలని వైఎస్సార్‌సీపీ యోచన చేసింది. ఈ నియెజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా జోగి రమేష్‌ (బీసీ)ని 2014 ఎన్నికల్లో ప్రయోగించినా సానుకూల ఫలితం రాలేదు. గత అనుభవం నుంచి పాఠం నేర్చుకున్న వైఎస్సార్‌సీపీ కూడా కమ్మ బాటే పట్టింది. 2019లో అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్‌ను బరిలో నిలిపింది. కృష్ణప్రసాద్‌ విజయం సాధించడంతో నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా(టీడీపీ) ఓటమి పాలు కాక తప్ప లేదు. ఐదేళ్లపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఏలుబడిలో మైలవరం నియోజక వర్గంలో రాజకీయ సమీకరణలు సైతం మారాయి.
మైలవరంలో ‘వపంత’గానం..
వైఎస్సార్‌సీపీ తరపున 2019లో ఎమ్మెల్యే అయిన వసంత కృష్ణప్రసాద్‌ 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగేందుకు అభ్యర్థిత్వం ఖరారైంది. వసంతకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్‌సీపీని వీడి.. టీడీపీలో చేరి అభ్యర్థిత్వం దక్కించుకోవడానికి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను చెప్పినా వినకుండా మూడు రాజధానుల పేరుతో అమరావతిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్లక్ష్యం చేశారని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల్లో ఇబ్బందులు పెట్టారని, అభివృద్ధి లేదని వైఎస్సార్‌సీపీని వీడే సమయంలో వసంత ఆరోపణలు గుప్పించారు. వాస్తవానికి ఆయన పార్టీని వీడటానికి వేరే కారణాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. 2014లో మైలవరంలో పోటీ చేసి ఓటమి పాలైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జోగి రమేష్‌ 2019లో పెడన నుంచి గెలుపొంది మంత్రి అయ్యారు. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పాత పరిచయాలను ఉపయోగించుకుని జోగి రమేష్‌ ఆ నియోజకవర్గ రాజకీయాలు, పనుల్లో వేలు పెట్టడాన్ని వసంత తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. అదే నియోజకవర్గంలోని గొల్లపూడిలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సైతం ఉండటంతో ఆయన కూడా మైలవరం రాజకీయాల్లో జోక్యం చేసుకునేవారని వసంత వాపోయేవారు. అనేక సందర్భాల్లో జోగి, తలశిల విషయాలపై పార్టీ అధిష్టానానికి వసంత ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం. సొంత పార్టీలోనే బహునాయత్వంతో గ్రూపులు తలనొప్పిగా మారడంతో వసంత పక్క చూపులు చూశారు. ఇదే సమాచారం సైతం వైఎస్సార్‌సీపీ అధిష్టానం దృష్టిలో ఉండటంతో పొమ్మనకుండా పొగబెట్టినట్టు మైలవరంలో ప్రత్యామ్నాయ అభ్యర్థిని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. వసంత అప్పటికే టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలకు టచ్‌లోకి వెళ్లడంతో అభ్యర్థిత్వంపై హామీ రాగానే వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పేశారు.
సొంతపార్టీలోనే ఉమాకు ఎదురు దెబ్బ
ఎప్పటికీ మైలవరమే తన అడ్డా అనుకున్న దేవినేని ఉమామహేశ్వరరావుకు తొలిసారిగా సొంత పార్టీలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2019లో ఓటమిపాలైన ఉమకు వ్యతిరేకవర్గం బలపడింది. తాజా ఎన్నికల్లోను ఆయనకు మైలవరం టిక్కెట్‌ ఇస్తే ఓడిస్తామని బొమ్మసాని సుబ్బారావుతోపాటు అనేక మంది అసమ్మతి సమావేశాలు నిర్వహించి అధిష్టానానికి అల్టిమేటం ఇస్తూ వచ్చారు. మారిన పరిణామాల నేపథ్యంలో నారా లోకేశ్‌ అక్కడ దేవినేని ఉమాను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వసంతకు బెర్త్‌ కన్ఫార్మ్‌ చేశారు. దీంతో ఉమా తీవ్ర మనస్తాపానికి గురై వసంతకు వ్యతిరేకంగా గళమెత్తారు. అప్పటి వరకు ఉమాను వ్యతిరేకించిన బొమ్మసాని సుబ్బారావు సైతం కలిసి రావడంతో వసంతకు కాకుండా తమలో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలనే వాదనను తెరపైకి తెచ్చారు. తనకు వీర విధేయుడైన ఉమాను వదులుకోవడానికి ఇష్టపడని చంద్రబాబు సైతం ఏదో ఒక చోట సీటు ఇవ్వాలనే ప్రతిపాదనకు వచ్చారు. పెనమలూరు నుంచి ఉమాను పోటీ చేయిస్తే ఫలితం ఎలా ఉంటుందనే దానిపై చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారు. మొత్తానికి మైలవరంలో వసంత రాకతో మొదలైన అసమ్మతి రాగం టీడీపీకి ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.
Next Story