రోజుకో విందు భోజనంతో విద్యా బోధన!
x

రోజుకో విందు భోజనంతో విద్యా బోధన!

పిల్లల కోసం అయ్యవార్లు, అమ్మానాన్నల తపన. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం ఆరాటం. విద్యార్థుల బోధనకు అదనంగా శ్రమిస్తున్న టీచర్లు.

తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని తల్లిదండ్రులు.. ప్రతిభావంతులై తమ స్కూలుకు మంచి పేరు తేవాలని టీచర్లు కోరుకుంటారు. అయితే అందుకు ఆ పాఠశాల పిల్లల కోసం వీరు విభిన్నంగా తపిస్తున్నారు. రోజుకో విందు భోజనంతో పదో తరగతి పిల్లలకు అదనపు విద్యా బోధన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశలో మరెక్కడా లేనివిధంగా అయ్యవార్లూ, అమ్మానాన్నలు ఏకమై సమన్వయంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరెన్నో సర్కారీ బడులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి ఆశయానికి తగ్గట్టే ఈ పిల్లలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రభుత్వ పాఠశాల ఎక్కడుంది? అక్కడ ఏం జరుగుతోంది? తెలుసుకోవలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవండి..!

విద్యార్థికి వడ్డిస్తూ ..

విశాఖ నగరంలోని ప్రకాశరావుపేట జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్) హైస్కూలు మిగతా హైస్కూళ్లకంటే ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే అక్కడ పదో తరగతి విద్యార్థుల కోసం టీచర్లు పడుతున్న తపన, వారికి మేము సైతం అంటూ తల్లిదండ్రులు అందిస్తున్న సహకారం ఆ స్కూలుకు అలాంటి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఏ బడిలోనైనా పదో తరగతి పరీక్షల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తమ స్కూలు పిల్లలు టెన్త్ ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించాలని ఉపాధ్యాయులు కోరుకుంటారు. తమ బిడ్డలు మంచి మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు ఆశ పడతారు.

వడ్డనకు సిద్దం చేసిన అల్పాహారం

సాధారణంగా ప్రైవేటు స్కూళ్లలోనే కాదు.. సర్కారీ బడుల్లోనూ పదో తరగతి పరీక్షలకు ముందు వంద రోజుల ప్రణాళికను రూపొందించుకుంటారు. అందుకనుగుణంగా అదనపు/ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే పాఠశాల సమయం అయిన కొంతసేపటి వరకు టెన్త్ విద్యార్థినీ విద్యార్థులకు బోధనా సమయాన్ని వెచ్చిస్తారు. ఆపై వీరిని ఇళ్లకు పంపించేస్తారు. ప్రైవేటు స్కూళ్లలో ఒకింత ఎక్కువ సమయం కేటాయిస్తారు.

విందు భోజనంతో విద్యా బోధన

జీవీఎంసీ ప్రకాశరావుపేట స్కూల్లో ఏం జరుగుతోందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. అక్కడ అన్ని ప్రభుత్వ స్కూళ్లలా కాదు.. సాయంత్రం బడి సమయం అయ్యాక పదో తరగతి చదువుతున్న పిల్లలకు కాసేపు విశ్రాంతినిస్తారు. ఆ తర్వాత అదనపు క్లాసులు ప్రారంభిస్తారు. మధ్యాహ్న భోజనం వీరికి అప్పటికే జీర్ణమై ఆకలేస్తుంది. అలాంటి వారికి మళ్లీ భోజనమో, అల్పాహారమో అవసరమవుతుంది. మధ్యాహ్నమైతే ప్రభుత్వం ఇస్తున్న మధ్యాహ్న భోజనం పెడతారు. సాయంత్రం అలాంటి సదుపాయం లేదు.

ప్రకాశరావుపేట జీవీఎంసీ హైస్కూలు

అందువల్ల తొలుత 2022 కోవిడ్ సమయంలో ఓ దాత టెన్త్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ అందించారు. 2023లో అన్నమ్మ అనే మరో దాత, టీచర్లు కలిసి పండ్లు, బిస్కట్లు, అప్పుడప్పుడు అల్పాహారం ఇచ్చేవారు. 2024లో కొంతమంది తల్లిదండ్రులు అల్పాహారం అందించారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షల (మార్చి 30) వరకు సాయంత్రం/ రాత్రి వేళ వంద రోజుల పాటు తామే భోజనం సమకూరుస్తామని తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఈ స్కూలులో ఈ ఏడాది 88 మంది టెన్త్ పరీక్షలకు సిద్దమవుతున్నారు. రోజుకొకరు చొప్పున ఈ పిల్లలకు సాదాసీదా భోజనం కాదు.. విందు భోజనం అందిస్తున్నారు.

ఇందులో వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ రైస్, కచంబరి, కూరలు, పెరుగు, స్వీట్లు, అరటి పండ్లు వంటివి ఉంటాయి. అప్పుడప్పుడు భోజనానికి బదులు అల్పాహారం కింద ఇడ్లీ, దోస, వడ, పూరీ, చపాతీ, మైసూర్ బోండా వగైరాలు పెడుతున్నారు. విద్యార్థులు వీటిని లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఆపై రాత్రి ఎనిమిది గంటల వరకు చదువుకుని ఇంటికి వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే వారు దిగువ మధ్య తరగతి వారే ఉంటారు. అయినప్పటికీ విందును తలపించే బోజనాలు పెట్టడానికి తగ్గేదే లే! అంటున్నారు.

కలెక్టర్ హరేందిర ప్రసాద్ నుంచి ప్రశంసా పత్రం అందుకుంటున్న బాల శాస్త్రవేత్త భరద్వాజ్

ఫలనా రోజు మేం భోజనం పెడ్తామని తల్లిదండ్రులు పోటీ పడుతుంటే.. 'ఆ రోజు ఖాళీ లేదు.. మరో రోజు పెట్టండి' అని అంటున్నారు అయ్యవార్లు. ఆ రోజున తల్లిదండ్రులే స్వయంగా ఈ పిల్లలకు వడ్డించి ఆనందిస్తున్నారు. 'ఆదివారాలు సహా ప్రతి రోజూ సాయంత్రం మా స్కూలులో ఓ ఫంక్షన్ వాతావరణం కనిపిస్తోంది. తల్లిదండ్రులు పెట్టే విందు భోజనాన్ని ఆరగించి పిల్లలు క్రమశిక్షణతో చదువుకుంటుంటే మా టీచర్లకెంతో సంతోషంగా ఉంటోంది' అని మ్యాథ్స్ టీచర్ దధిరావు శ్రీనివాసరావు పట్నాయక్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

జీవీఎంసీలో అత్యుత్తమ ఫలితాలే..

ఉపాధ్యాయుల శ్రమ, తల్లిదండ్రుల సహకారం వెరసి ప్రకాశరావుపేట హైస్కూలు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలే సాధిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 27 హైస్కూళ్లున్నాయి. వీటన్నిటికంటే ఈ స్కూలు ఫలితాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. పైగా ఇక్కడ చదివిన వారు ట్రిపుల్ ఐటీకి ఎంపికవుతున్నారు. బాల శాస్త్రవేత్తలుగానూ తయారవుతున్నారు. ఇటీవల రెడ్డి భరద్వాజ్ అనే టెన్త్ విద్యార్థి 31 నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్-2025లో బాల శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఈ ప్రభుత్వోన్నత పాఠశాలలో చేరడానికి విద్యార్థులు పోటెత్తుతుంటారు. అన్ని తరగతుల సామర్థ్యం 400 ఉంటే ప్రస్తుతం 542 మంది పిల్లలు చదువుతున్నారంటే ఈ స్కూలుకున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో 60-70 శాతం సీట్లు నిండడమే గగనమై పోతున్న తరుణంలో ఇక్కడ 135 శాతానికి పైగా ప్రవేశాలు జరుగుతుండడం విశేషం! ఇంతమంది చదువుకునేందుకు తగినన్ని తరగతులు లేకపోవడంతో ఉన్న గదుల్లోనే సర్దుబాటు చేస్తున్నారు.

ఈ హైస్కూల్ టెన్త్ ఫలితాలు

సంవత్సరం

ఉత్తీర్ణత

2018

99 శాతం

2019

84.5 శాతం

2020

100 శాతం

2021

100 శాతం

2022

79.5 శాతం

2023

88 శాతం

2024

100 శాతం

టీచర్లు చాలా శ్రద్ధగా బోధిస్తున్నారు..

'మా బాబు సంతోషన్ను ఒకటో తరగతిలో ఈ స్కూలులో చేర్చాం. ఇప్పుడు టెన్త్ కొచ్చాడు. టెన్త్ లో పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవడానికి టీచర్లు ఎక్కువగా కష్టపడి చదివిస్తున్నారు. మాకంటే బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. తెల్లవారు జామున కూడా ఫోన్ చేసి లేపి మరీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఈనెల ఐదున పదో తరగతి పిల్లలకు మావంతు అల్పాహారం పెట్టాం' అని నగరంలోని పితానిదిబ్బకు చెందిన పాతర్లపల్లి పార్వతి చెప్పింది.

ఆషినీ బీబీ

భోజనం పెడ్తున్నందుకు సంతోషంగా ఉంది..

మాది డాబాగార్డెన్స్. నా కుమార్తె అనీషా ఇక్కడ టెన్త్ చదువుతోంది. టీచర్లు ఈ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బడి అయిపోయాక రాత్రి వరకు స్కూలులోనే ఉంచి దగ్గరుండి చదివిస్తున్నారు. మరే స్కూలులోనూ ఇలా బోధించడం లేదు. రాత్రికి ఇంటికి వచ్చాక కూడా హోం వర్క్ గురించి ఆరా తీస్తున్నారు. మా కుమార్తెతో చదువుతున్న టెన్త్ పిల్లలకు ఈనెల 17న విందు భోజనం పెడుతున్నాను. ఇలా పెడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది' అని అనీషా తల్లి ఆషినీ బీబీ తెలిపింది.

ప్రసాదరావు, నాగమణి దంపతులు

ప్రైవేటు స్కూలులో మాన్పించి..

మా బాబు భరద్వాజ్ను ఏడో తరగతి వరకు ఓ ప్రైవేటు స్కూలులో చదివించాం. ప్రకాశరావుపేట స్కూలులో బాగా చదువు చెబుతున్నారని తెలిసి ఇక్కడ 8వ తరగతిలో చేర్చాం. భరద్వాజ్ ప్రతిభావంతుడై బాల శాస్త్రవేత్తగా జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. ప్రైవేటు స్కూల్లో వేలకు వేలు ఫీజులు కట్టినా విద్యా ప్రమాణాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ స్కూల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణతో బోధన చేస్తున్నారు. ఇక్కడ టెన్త్ పిల్లలకు భోజనం పెట్టడానికి ముందుకొస్తే ఇంకా డేట్ ఇవ్వలేదు. ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నాం' ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్న రెడ్డి ప్రసాదరావు, నాగమణి దంపతులు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

హెడ్మాస్టర్ శ్రీనివాసరావు

టీచర్లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..

మా హైస్కూలులో ఉత్తమ విద్యా ప్రమాణాలకు కారణం సాటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే కారణం. టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి అదనపు క్లాసులు చెబుతున్నాం. టీచర్లు వీరి కోసం అదనపు సమయం కేటాయించడం కష్టంగా భావించడం లేదు. ఏటా అత్యుత్తమ ఫలితాలు వస్తున్నందునే ఈ స్కూల్లో ప్రవేశాలకు పోటీ పడుతున్నారు. ఇది మాకు గర్వకారణంగా అనిపిస్తుంటుంది. టెన్త్ పిల్లలు అదనపు క్లాసుల్లో శ్రద్ధగా ఒంటబట్టించుకోవాలంటే సాయంత్రం వేళ కూడా భోజనం అవసరమని ఆలోచన కలిగింది. మూడేళ్ల క్రితం ఓ దాత ముందుకు వచ్చి స్నాక్స్తో శ్రీకారం చుట్టారు. అప్పట్నుంచి అది కొనసాగుతూ ఇప్పుడు తల్లిదండ్రులే నేరుగా దాతలుగా మారారు. మున్ముందు మేం ఈ స్కూలులో లేకున్నా ఈ ప్రక్రియ కొనసాగుతుందన్న నమ్మకం ఉంది. మా ఉపాధ్యాయ వృత్తిలో ఈ స్కూలులో పనిచేయడం ఒక స్వర్ణయుగంలా భావిస్తున్నాం' అని ప్రకాశరావుపేట హైస్కూల్ హెడ్మాస్టర్ కె.శ్రీనివాసరావు 'ద ఫెడరల్ ఆఃద్రప్రదేశ్' ప్రతినిధితో తన ఆనందాన్ని పంచుకున్నారు.

Read More
Next Story