దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ. పోటీ చేసిన రెండు సార్లు చవి చూసిన ఓటమి. రెండు పార్టీలు మారి మూడో సారి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన అవినాష్‌.


జి. విజయ కుమార్

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దేవినేని రాజశేఖర్‌(నెహ్రూ) రాజకీయ వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన దేవినేని అవినాష్‌ భవితవ్యం ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నుంచి ఇంకా ఎలాంటి హామీ రాక పోవడంతో అవినాష్‌తో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జీగా ఉన్నా టికెట్‌ ఖరారు కాకపోవడంతో ఆందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు సిఎం జగన్‌ పలు మార్లు అభ్యర్థులను మారుస్తుండటంతో అవినాష్‌కు విజయవాడ తూర్పు స్థానం ఖరారు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
దేవినేని నెహ్రూ వారసుడిగా ఎంట్రీ
మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ వారసుడిగా దేవినేని అవినాష్‌రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత కాంగ్రెస్‌ పార్టీ వేదికగానే ఆయన ఎంట్రీ జరిగింది. పార్లమెంట్‌ ఎన్నికల ద్వారా ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్‌ ఎన్నికల బరీలోకి దిగారు. 2014లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులే ప్రధాన పోటీ దారులయ్యారు. వారి మధ్యనే పోటీ నెలకొంది. దేవినేని అవినాష్‌ పోటీ ఇవ్వలేకపోయారు. ఎలాంటి ప్రభావం చూప లేకపోయారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఆదరణ తగ్గినా ఆయన తండ్రి దేవినేని నెహ్రూ చరిష్మా, అనుచరులు, శ్రేయోభిలాషులు ఆదరిస్తారని భావించారు. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. దీంతో దేవినేని అవినాష్‌కి మూడో స్థానంలో కూర్చోవలసి వచ్చింది. ఈ ఎన్నికల్లో అవినాష్‌కు దాదాపు 39,751 ఓట్లు మాత్రమే లభించాయి.
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా
కాంగ్రెస్‌లో పరాభవం తర్వాత తెలుగుదేశం పార్టీవైపు చూశారు. ఆయన తండ్రి రాజకీయ రంగం ప్రవేశం ఎన్టీఆర్‌తో తెలుగుదేశం పార్టీతో జరిగింది. దీంతో టీడీపీలో నెహ్రూకి కూడా మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీలోకి వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుడివాడ వెళ్లి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో 2019లో గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కొడాలి నానిపై పోటీకి దిగారు. అక్కడా పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కొడాలి నానికి 89,833 ఓట్లు రాగా దేవినేని అవినాష్‌కు 70,354 ఓట్లు మాత్రమే లభించాయి. సుమారు 19వేల పైచిలుకు ఓట్ల తేడాతో అవినాష్‌ ఓటమిని చవి చూశారు.
వైఎస్‌ఆర్‌సీపీలోకి..
గుడివాడలో ఓటమిని మూట గట్టుకున్న అవినాష్‌ మరో సారి పార్టీ మారాలనే ఆలోచనలు చేశారు. 2019లో విజయవాడ తూర్పు కానీ పెనమలూరు కానీ చంద్రబాబు అవకాశం కల్పిస్తారని ఆశించిన అవినాష్‌కు గుడివాడ కేటాంచడంతో అసంతృప్తి గురయ్యారు. కానీ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని అక్కడకు వెళ్లాల్సి వచ్చింది. విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాలకు అప్పటికే ఉద్దండులై టీడీపీ అభ్యర్థులు ఉండటంతో ఇక ఇక్కడ తనకు స్పేస్‌ లేక పోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
విజయవాడ తూర్పు ఇన్‌చార్జీ
2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి బొప్పన భవకుమార్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. 2014లో వంగవీటి రాధాకృష్ణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ గెలుపొందారు. 2019 ఎన్నికల సమయంలో నెలకొన్న పరిణాల్లో వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి వెళ్లారు. రెండు సార్లు ఇక్కడ వైఎస్‌ఆర్‌సీపీ ఓటమిపాలు కావడంతో ఇన్‌చార్జీగా నేతను మార్చాలని సిఎం జగన్‌ భావించారు. దీంతో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జీగా దేవినేని అవినాష్‌ను నియమించారు.
Next Story