
జగన్ తప్పిదాలపై దండెత్తండి, కూటమి అంటే ఏమిటో జనానికి చెప్పండి!
ఇక, జగన్ తప్పిదాలపై చంద్రబాబు డైరెక్ట్ ఎటాక్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరించి ఎండగట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు మంగళవారం వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
విద్యుత్ సంస్కరణలకు నాంది పలికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది తమ ప్రభుత్వమేనని చంద్రబాబు చెప్పారు. అనైతిక విధానాలతో వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజలపై జగన్ 18వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. జగన్ పాపాలను ఈనాటికీ భరిస్తూనే చార్జీలు తగ్గించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. జగన్ పీపీఏ రద్దు చేయటం వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వాడుకోలేకపోయామని... అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవటంతో రూ.9వేల కోట్లు పెనాల్టీ కట్టాల్సి వచ్చిందనని అన్నారు. జగన్ దెబ్బకు పారిపోయిన పెట్టుబడిదారుల్లో తిరిగి నమ్మకం పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని స్పష్టం చేశారు.
‘చేసిన పనులు చెబితేనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుంది. ప్రజలతో మమేకమే కాదు.. మంచి పేరు తెచ్చుకోవాలి. పార్టీకి ప్రజాప్రతినిధులు, నేతలే ప్రతినిధులు. వ్యవహారశైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. గత ప్రభుత్వం ట్రూ అప్ పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచింది. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో తగ్గించింది. సోలార్, విండ్ సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టిపెట్టాం. సమర్థ పాలనకు.. అసమర్థ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించాలి. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు తెలపాలి. ప్రజలు మనవైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కూటమిగా ఉన్నాం.. అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. అంతకుమించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలి’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
శాసనసభ సమావేశాలు ముగిసినందున ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలలో ఉండి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలేమిటో, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏమిటో వివరించాలని సూచించారు.
గత ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా షార్ట్ టర్మ్ పవర్ కొనుగోళ్లతో ప్రజలపై భారం మోపిందని వ్యాఖ్యానించారు. 17 శాతం ఉన్న షార్ట్ టర్మ్ పవర్ కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం 6.8 శాతానికి తెచ్చిందన్నారు.
Next Story