నిజం చెప్పు జగన్....  వ్యతిరేకత మాపైన్నేనా..
x
కంట నీరు పెట్టుకున్న మల్లాదిని ఓదార్చుతున్న కేశినేని నాని.

నిజం చెప్పు జగన్.... వ్యతిరేకత మాపైన్నేనా..

ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ఎవరికైనా.. ఒక్కసారి రంగం నుంచి నిష్క్రమించాల్సి వస్తే చాలా కష్టంగా ఉంటుంది. జగన్ కు ఈ విషయం తెలియదనుకోవాలా?


‘అధికార పార్టీలో ఐదేళ్లు శాసనసభ్యులుగా ఉన్న వాళ్లను మార్చాలంటే చాలా అనుభవం, నైపుణ్యం ఉండాలి. అదంత సులభ సాధ్యమయ్యే పని కాదు. చాలా అనుభవం ఉండాలి’ అన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీలో తలపండిన నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 59 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ఎవరికైనా.. ఒక్కసారి రంగం నుంచి నిష్క్రమించాల్సివస్తే చాలా కష్టంగా ఉంటుంది.

రాజకీయ వ్యసనమే అంత కదా...

రాజకీయ అధికార వ్యసనమే అలాంటిది. ఈ పరిస్థితుల్లో.. తనను కాదని, వేరేవారికి టికెట్‌ కేటాయిస్తే... ఆ కొత్త అభ్యర్థి విజయం కోసం పనిచేయాలన్న వినయ విధేయతలు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న రాజకీయ నేతలు ఎందరు ఉన్నారు ఈ కాలంలో!? ఇక, ఇప్పటివరకు నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తి వచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబడితే, తనను కాదని వచ్చిన వారి విజయం కోసం పనిచేయాలన్న విశాల దృక్పథం ఉన్న నాయకులు ఎందరు ఉన్నారు ఈ కాలంలో!? తనదే అనుకున్న సీటు, తనదే అనుకున్న అధికారాన్ని.. తన కళ్ల ముందే వేరొకరికి దక్కే అవకాశం ఉంటే.. వారికి ఆ అవకాశం ఇచ్చే పరిస్థితి నిజంగా నేటి రాజకీయ నాయకుల్లో ఉందా? ఈ కారణాల వల్లే... టికెట్‌ తమకు రాదని భావిస్తున్న నాయకుల్లో... కొందరు పక్క పార్టీల వైపు చూస్తుంటే, మరికొందరు పరిస్థితిని గమనిస్తూ.. భవిష్యత్‌ కార్యాచరణ వ్యూహంలో సిద్ధమవుతున్నారు. ఇందువల్లే.. మార్పులు జరిగిన పలుచోట్ల రచ్చ జరుగుతోంది.

జగన్ మీద నిప్పులు చెరుగుతున్న తీరు...

కొందరు సిట్టింగులైతే అధినేత జగన్ మీద విమర్శలు మొదలుపెట్టారు. తమపట్ల నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందన్న విమర్శను ఎదుర్కొంటున్న వారంతా చెబుతున్న ఒక ముఖ్య అంశం కూడా విస్మరించలేనిదిగా కనిపిస్తోంది. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ, తమ చేతిలో పెద్దగా అధికారం లేదని.. దాంతో నియోజకవర్గంలోని జనానికీ, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకూ తాము పెద్దగా ఉపయోగ పడలేకపోయామని, అందువల్లే తమ పట్ల వ్యతిరేక భావం ఉన్నట్లు కనిపిస్తోందని.. ఈ పాపం తమది కాదని టికెట్‌ దొరకని పలువురు నాయకులు అంటున్నారు.

మా గతేమిటని ద్వితీయ శ్రేణి ఆవేదన..

సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు నేరుగా జగన్‌ ఓటుబ్యాంకుగా మారారని అనుకుంటే.. అధికారంలో ఉన్న పార్టీ వల్ల ప్రయోజనం పొందలేని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని... వారు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తమకు మేలు జరుగుతుందని 2019 ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ద్వితీయశ్రేణి నాయకుల్లో పలువురు ప్రస్తుతం నిరాశతో ఉన్నారని అంటున్నారు. వాస్తవానికి.. ద్వితీయ శ్రేణి నాయకులే కాదు.. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రధానమైన నేతలు కూడా ఇదేరకమైన విమర్శలు చేస్తున్నారు.

మార్పుల ఎఫెక్ట్ తో రాజీనామాలు...

కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మార్పుల ఎఫెక్ట్‌తో పార్టీకి రాజీనామా చేశారు. ఈ ముగ్గురిలో బాలశౌరికి సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పేవారు. ఇక లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా అధిష్టానంతో సత్సంబంధాలే నెరిపేవారు. ఇలాంటి వారు ఆకస్మికంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, అంతకుముందే వారికి ప్రత్యామ్నాయంగా కొత్త నేతలను సీఎం జగన్‌ సిద్ధం చేయడం చూస్తుంటే.. ఆయన వ్యూహం ఏ ఒక్కరికీ అంతుచిక్కడం లేదు. మార్పులతో ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు కనిపిస్తున్నా.. ఎక్కడా చలించడం లేదు సీఎం జగన్‌. ఇంకా మరిన్ని మార్పులు ఉన్నాయంటూ సంకేతాలివ్వడంతోపాటు, మార్చిన వారికి టికెట్‌ గ్యారెంటీ లేదని చెబుతుండటంతో పార్టీపై పూర్తిస్థాయిలో పట్టునిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

వ్యతిరేకత మాపై కాదు సుమా...

మరోవైపు సీఎం చేపట్టిన మార్పులను జీర్ణించుకోలేని సిట్టింగ్‌లు కొందరు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. వ్యతిరేకత తమపై కాదని.. రోడ్ల నిర్వహణ, విద్యుత్‌ చార్జీల పెంపు, ఇసుక, లిక్కర్‌ పాలసీ వల్ల సాధారణ జనంలో వ్యతిరేక భావం వచ్చిందని వారంతా చెబుతున్నారు. సంక్షేమం విషయంలో బాగానే ఉన్నా.. అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందనే అభిప్రాయం మధ్యతరగతి ప్రజల్లో ఏర్పడిందని.. సీట్లు రాని పలువురు సిట్టింగు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే వైసీసీ పార్టీ వ్యూహకర్తలు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు. 'వోకల్‌ సెక్షన్స్‌' తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా... నిజమైన 'ఓటు బ్యాంకు' తమవైపు ఉందని, ఇదే తమకు విజయం చేకూర్చుతుందని వారు అంటున్నారు. జగన్‌ పట్ల పేద ప్రజల్లో ఉన్న అభిమానమే ఆయన్ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందని, ఈ లక్ష్యంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థుల పట్ల జనంలో వ్యతిరేకత లేకుండా చూడాల్సిన పరిస్థితి వల్లే... తప్పనిసరి పరిస్థితుల్లోనే.. జగన్‌ పలుచోట్ల అభ్యర్థులను మార్చక తప్పడం లేదని, ఆ పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు. ఏది ఏమైనా భారీ సంఖ్యలో అభ్యర్థుల మార్పులు-చేర్పులు ద్వారా జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మాత్రం ఆయన పలు పార్టీలకు 'రోల్‌ మోడల్‌' అవుతారు. లేకపోతే మాత్రం 'లెర్నింగ్‌ మోడల్‌' అవుతారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో తేలాలంటే మరో మూడు నెలలు వేచిచూడాల్సిందే.

Read More
Next Story