ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడే విధంగా పార్లమెంట్‌లో వ్యవహరించారు.
భారత పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన కొంత మంది ఎంపీలు స్పెషల్‌గా నిలచారు. ఎన్డీఏ కూటమి ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీలు కూడా ఆంధ్రప్రదేశ్ స్పెషల్‌ను ప్రదర్శించారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఇంత మంది ఎంపీలు పార్లమెంట్‌లో తెలుగు జాతి గౌరవాన్ని పెంచారు. హిందీలోనో, ఇంగ్లీషులోనో కాకుండా స్వచ్ఛమైన తెలుగులో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసి అబ్బురపచారు.
సహజంగా ఢిల్లీ పార్లమెంట్‌లో తెలుగు భాష వినపడటం అరుదు. అలాంటిది ఎంపీలుగా ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్లమెంట్‌లో తెలుగు భాషను వినిపించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి అదరగొట్టారు. కేంద్ర మంత్రులుగా ఉన్న ఏపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వంటి పలువురు ఎంపీలు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. తక్కిన ఎంపీలు ఇంగ్లీషులోను, హిందీలోను ప్రమాణ స్వీకారం చేశారు.
భారత పార్లమెంట్‌లో తెలుగులో మాట్లాడటమే కాకుండా తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా వస్త్రాలు ధరించి పార్లమెంటులో అడుగు పెట్టారు. విశాఖ ఎంపీ భరత్ తెల్ల చొక్కా, పంచ కట్టుకొని పార్లమెంట్‌లోకి అడుగు పెట్టగా, కలిశెట్టి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ రంగు అయిన పసుపు రంగు కుర్తా, పసుపు రంగు కండువా, తెలుపు రంగు దోతీ కట్టుకొని పార్లమెంట్‌లో అడుగు పెట్టారు.
గతంలో పార్లమెంట్ చర్చల్లో నందమూరి హరికృష్ట తెలుగులో మాట్లాడి చరిత్ర సృష్టించారు. సహజంగా పార్లమెంట్‌లో చర్చలు, సమావేశాలు, ఇతర కరస్పాండెన్స్ అంతా ఇంగ్లీషులోనో, హిందీలోనో జరుగుతుంటుంది. వారి వారి సొంత భాషల్లో ప్రసంగించడం, పార్లమెంట్‌లో జరిగే చర్చల్లో సొంత భాషల్లో పాల్గొనడం వంటివి చాలా అరుదు. అలాంటిది నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నప్పుడు రాజ్య సభలో జరిగిన ఒక డిబేట్‌లో తెలుగులో మాట్లాడి సంచలం సృష్టించారు.
Next Story