తొలి విడతగా 110 మందికి శిక్షణ. ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పన. త్వరలో అమరావతిలో శాశ్వత బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం.
ఆంధ్రప్రదేశ్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే బీసీ అభ్యర్థుల కోసం తాత్కాలిక బీసీ స్డడీ సర్కిల్‌ను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడకు సమీపంలోని గొల్లడపూడిలో తాత్కాలిక బీసీ స్టడీ సర్కిల్ భవనంతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాస్‌తో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా బీసీ యువతకు సివిల్ సర్వీసెస్ శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అమరావతిలో శాశ్వత బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు.
600 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హత పరీక్ష నిర్వహించగా 110 మంది సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కు ఎంపికైనట్లు మంత్రి తెలిపారు. బీసీ–ఏ17, బీసీ–బీ24, బీసీ–సీ2, బీసీ–డీ18, బీసీ–ఈ5, ఎస్సీ–20, ఎస్టీ–14, ఈడబ్ల్యూఎస్ కింద 10 మందిని ఎంపిక చేశామన్నారు. వారందరికీ రెసిడెన్షియల్ పద్ధతిలో భోజన, ఇతర వసతి సదుపాయాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో శిక్షణా తరగతులు ప్రారంభించామని, వచ్చే ఏడాది శిక్షణ నాటికి రాజధాని అమరావతి ప్రాంతంలో 5 ఎకరాల విస్తీర్ణంలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించనున్నట్లు తెలిపారు. 500ల మంది అభ్యర్థులకు శిక్షణిచ్చేలా ఈ భవన నిర్మాణం చేపడుతామన్నారు. రెండేళ్లలో ఈ భవనం అందుబాటులోకి తెస్తామన్నారు. దీని కోసం ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశామని, సీఎం చంద్రబాబు నాయుడు నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతామని మంత్రి సవిత వెల్లడించారు.