సిక్కోలులో మామ అల్లుళ్ళ సవాల్....
x
కోన రవి, తమ్మినేని సీతారాం

సిక్కోలులో మామ అల్లుళ్ళ సవాల్....

సిక్కోలు ఎన్నికల బరిలో రెండుసార్లు పోటీపడి చెరొకసారి విజయం సాధించిన మామా అల్లుళ్లు... మూడోసారి నువ్వా నేనా అంటూ బరిలోకి దిగారు. ఎవరా మామ అల్లుళ్లు...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: మామ అల్లుళ్లు అంటేనే గమ్మత్తైన బంధం... వెటకారానికి గాని... పౌరుషానికి గాని....ఇద్దరికి ఇద్దరు సమఉజ్జీలే... అందుకే మామ అల్లుళ్ళపై వచ్చిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. సిక్కోలు జిల్లాలో కూడా ఓ మామ అల్లుళ్ళ స్టోరీ నడుస్తోంది. సీనియర్ రాజకీయ నాయకులు, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మామ కాగా... తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కోన రవి అల్లుడు. వీరిరువురు స్వయానా మేనమామ, మేనల్లుడు... అయితేనేమి ఎక్కడైనా మామ గాని వంగతోట కాడ కానట్టు… అమ్మ అన్నయ్యపైనే మేనల్లుడు పోటీకి దిగుతూ వస్తున్నాడు.
తమ్మినేని రాజకీయ నేపథ్యం...
తమ్మినేని సీతారాం... ఈయన ఉత్తరాంధ్రలో తెలియని వారు ఉండరు. అసెంబ్లీ స్పీకర్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. 1980లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా పని చేశారు. 1983లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీలో శ్రీకాకుళం నుంచి చేరారు. అప్పట్నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగాను.. తొమ్మిదేళ్లు మంత్రిగాను... ప్రభుత్వ విప్ గాను, అసెంబ్లీ స్పీకర్ గాను పలు పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చారు. తెలుగుదేశం పార్టీలో బలమైన నేతగా ఉన్న ఆయన చిరంజీవి ప్రోద్బలంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
ఆ పార్టీ కాంగ్రెస్ పంచన చేరడంతో తిరిగి సొంత గూడు టిడిపికి వచ్చేశారు. 2009 ఎన్నికల్లో ఆమదాలవలస టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి చేతిలో ఓడిపోయారు. 2013లో వైసీపీలో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి తన మేనల్లుడు, టిడిపి అభ్యర్థి కోన రవి చేతుల్లో పరాజయం పాలయ్యారు. 2019లో తిరిగి వైసీపీ నుంచి పోటీ చేసి తన మేనల్లుడిపై విజయం సాధించారు. తిరిగి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీ తరఫున తమ్మినేని సీతారాం, టిడిపి అభ్యర్థి, తన మేనల్లుడు కోన రవితో తలపడుతున్నారు.
కోన రవి నేపథ్యం...
కోన రవి స్వయాన తమ్మినేని సీతారాం మేనల్లుడు... రాజకీయ పాఠాలు ఆయన వద్దే నేర్చుకున్నారు. 1994లో రాజకీయ అరంగేట్రం చేశారు. పొందూరు ఎంపీపీ, జడ్పీటీసీగా గెలుపొందారు. మామ తమ్మినేని ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో అల్లుడికి టిడిపిలో ప్రాధాన్యం పెరిగింది. 2014 ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తమ్మినేని సీతారాం పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ నుంచి మేనల్లుడు కోన రవి పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2019లో ఇద్దరూ తలపడగా...ఈసారి మామ తమ్మినేని అల్లుడిని ఓడించారు.
నువ్వా... నేనా....
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో మామ అల్లుళ్ళ మధ్య పోరు జోరుగా సాగుతోంది. ఓవైపు మామ మరోవైపు రాజకీయ గురువు తమ్మినేని సీతారాంకు పోటీగా మేనల్లుడు, శిష్యుడు అయిన కోన రవి టిడిపి నుంచి పోటీ పడుతున్నారు. గెలుపు కోసం ఇరువురు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ప్రచారంలో ఎవరికి వారు జోరుగా ముందుకు సాగుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఎవరికి ఓటు వేయాలో అన్న మీమాంసలో పడిపోయారు.
Read More
Next Story