Damodaram Sanjeevaiah ex CM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అంటే ఆయన తప్ప అందరూ గుర్తొస్తారు. ఆయన అత్యంత నిరాడంబరుడు. కేంద్ర రాజకీయాల్లోను తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు.
జి. విజయ కుమార్
రాజకీయాల్లో గోరంత చేసి కొండంత ప్రచారం కోరుకునే నాయకులకు కొదువ లేదు. కొండ చేసినా గోరంత పబ్లిసిటీ కోరుకోని నేతలు కూడా ఉన్నారు. సరిగ్గా ఈ కోవకు చెందిన వారే దామోదరం సంజీవయ్య. అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులంటే ఆయన అంతగా గుర్తింపునకు నోచుకోక పోవడం బాధాకరం. ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగిడినా అద్బుతమైన కార్యక్రమాలు చేపిట్టి చిరస్థాయిగా చరిత్రలో నిలచి పోయారు.
ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చిందంటే..
అనూహ్య పరిణామాల్లో సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి రాజీనామా అనంతరం ఆ పదవికి బ్రహ్మనంద రెడ్డి, అల్లూరి సీతారామరాజుల మధ్య పోటీ నెలకొంది. బలంగా ఉన్న ప్రత్యర్థి రెడ్డి వర్గాన్ని దెబ్బ కొట్టేందుకు సీతారామరాజు సంజీవయ్యను తెరపైకి తెచ్చారు. దీనికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అంగీకారం తెలిపారు. దీంతో దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రిగాను, తొలి దళిత సిఎంగాను చరిత్రకెక్కారు.
కాంగ్రెస్‌లోనే అనేక అవమానాలు
దామోదరం సంజీవయ్య సిఎం అయిన తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. నాడు బలంగా ఉన్న రెడ్డి వర్గం కాంగ్రెస్ నేతలు ఆయనను అడుగడుగునా అవమానించారు. కుల పరంగా కూడా చీత్కారాలు ఫేస్ చేశారు. ఎలాగైనా సంజీవయ్యను సిఎం కుర్చీ నుంచి దింపేయాలని ఏసి సుబ్బారెడ్డి, అయన వర్గీయులు కులం పేరుతో ఎగతాళి చేశారు. అలాంటి అవమానాలు అధిక మవడంతో సంజీవయ్య సిఎం పదవి రాజీనామా చేసి ఢిల్లీ వెళ్లి పోయారు.
నిజాయతీకి మారు పేరు
సంజీవయ్య వ్యతిరేక వర్గం అంతా కలసి అవినీతి పరుడని అతని మీద కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. అయితే అప్పటికే సంజీవయ్యపై నెహ్రూకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కానీ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నెహ్రూ విచారించాలని నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్రానికి చెందిన చక్రపాణితో కలిసి సంజీవయ్య ఇంటికెళ్లిన హిమాచ్‌ప్రదేశ్‌కు చందిన కాంగ్రెస్ నేత ఒకరు సంజీవయ్య ఇంటిని, తల్లిని చూసి అవాక్కయ్యారు. సంజీవయ్యకు మంచి ఉద్యోగమేమైనా వచ్చిందా, జీతమేమైనా పెగుతుందా అని సంజీవయ్య తల్లి వచ్చిన కాంగ్రెస్ నేతను అడగడంతో నిశ్చేష్టులయ్యారు.
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం
దామోదరం సంజీవయ్య అత్యంత నిరాడంబరుడు. ఎంతగా అంటే ఆయన తన సిఎం పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజు తన భార్యను వెంటబెట్టుకొని సికిందరాబాద్‌లోని అజెంతా సినిమా టాకీస్‌కు రిక్షాలో వెళ్లారు. మాజీ సిఎంగా ఆయనకు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించుకుని హంగూ ఆర్భాటాలతో వెళ్లే అవకాశం ఉన్నా వాటిని పక్కన పెట్టి ఒక సామాన్యుడిలా వెళ్లడం నాడు అందరి దృష్టిని ఆకర్షించింది.
పేదలకు పెన్షన్ పథకం సృష్టి కర్త
ప్రస్తుతం పేరు గాంచిన పెన్షన్ పథకానికి సంజీవయ్యే ఆద్యుడు. ఆయన మైండ్ నుంచి పుట్టింది. సిఎంగా ఉండగా కర్నూలు జిల్లాలోని సొంతూరుకెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఖర్చుల కోసం ఆయన తల్లికి రూ.100 ఇచ్చారు. ఆ సందర్భంలో ఆమె మాట్లాడిన మాటలు పెన్షన్ పథకానికి సూర్పిగా తీసుకున్నారు. ఈ నెలకు సరి పోతాయి, వచ్చే నెల నుంచి ఖర్చులకు ఎవరు ఇస్తారు నాయనా అని సంజీవయ్యను అడిగిన మాటలు ఆయన గుండెను పిండి చేశాయి. తన తల్లిలా ఎంతమంది ఇలా ఇబ్బందులు పడుతున్నారో అని ఆలోచన చేసిన సంజీవయ్య పెన్షన్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
ఆరు లక్షల ఎకరాలు పంపిణీ
దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సయమంలో హైదరబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోను, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేదలకు పంపిణీ చేశారు. భూములు కొంత మంది చేతుల్లోనే ఎందుకు ఉండాలి, భూస్వాములు, జమిందారుల చేతుల్లో ఎందుకు ఉండాలని ఆలోచనలు చేసిన సంజీవయ్య పేదలకు భూమి ఉంటే సాగు చేసుకొని జీవిస్తారని భావించి పంపిణీకి నడుం బిగించారు. ఊరందరికీ ఉమ్మడి ఆస్తులు ఉండాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ ల్యాండ్‌లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కింది భాగంలో దోమలగూడ, లోయర్ ట్యాంక్ బండ్ వంటి చోట్ల రజకులకు చాకిరేవులు కట్టించి ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉండాలని వాటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తొలి సారి పారిశ్రామిక వాడల ఏర్పాటు ఆయన చేసిన ఆలోచనే. చెరుకు మొలాసిస్‌తో సారా కాకుండా పేపర్‌ను తయారు చేసే వినూత్న ఆలోచనకు తెర తీశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. అనేకం ఉన్నాయి.
అలంకరించిన పదవులు
నాటి మద్రాసు రాష్ట్రంలో ఆయన ఎంపిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. సి రాజగోపాలచారి(రాజాజీ) మంత్రి వర్గంలోను, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు మంత్రి వర్గంలోను, తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన బెజవాడ గోపాల్ రెడ్డి క్యాబినెట్‌లోను మంత్రిగా పని చేశారు. తర్వాత 1956 నవంబరు1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో కూడా సంజీవయ్య మంత్రిగా చేశారు. అనంతరం ఏర్పడిన పరిణామాల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రిగాను, తొలి దళిత ముఖ్యమంత్రిగాను చరిత్ర సృష్టించారు. 1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు దాదాపు 2 సంవత్సరాల 60 రోజుల పాటు సిఎంగా ఉన్నారు. అనంతరం జరిగిన కుల రాజకీయాలకు ఆయన బలయ్యారు. తర్వాత నెహ్రూ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లారు. రెండు పర్యాయాలు తొలి దళిత ఏఐసిసి అధ్యక్షులుగాను, కేంద్ర మంత్రిగాను పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 1962 జూన్ నుంచి 1964 మార్చి వరకు, 1971 మార్చి నుంచి 1972 మే వరకు రెండో సారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసిసి) అధ్యక్షులుగా ఉన్నారు. ప్రధానులు నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రీ, ఇందిరా గాంధీ మంత్రి వర్గాల్లో కేంద్ర మంత్రిగా పని చేశారు.
కుటుంబ నేపధ్యం
దామోదరం సంజీవయ్యది కర్నూలు జిల్లా పెద్దపాడు. మునియ్య, సుంకులమ్మ దంపతులకు 1921 ఫిబ్రవరి 14న పేద కుంటుంబంలో జన్మించారు. మూడేళ్లకే తండ్రి చనిపోవడంతో మేనమామల సంరక్షణలో పెరిగారు. కర్నూలు మునిసిపల్ స్కూల్, అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నారు. లా కోసం మద్రాసు వెళ్లారు. ఫీజు ఎక్కువ ఉండటంతో ట్యూషన్‌లు చెప్పగా వచ్చిన డబ్బుతో లా పూర్తి చేశారు. సికిందరాబాద్‌కు చెందిన కృష్ణ వేణిని వివాహం చేసుకున్నారు. ఆమె ఉపాధ్యాయురాలు. పైగా సంఘ సేవకురాలు కూడా. 1972 మే 7న సంజీవయ్య గుండెపోటుతో ఢిల్లీలో మరణించారు.
Next Story