
ఆ ఐఎఎస్ ఓ ఆధునిక రజియా సుల్తానా, తాటకీ
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టాయా?
గత ప్రభుత్వంలో కీలక శాఖకు అధికారిగా వ్యవహరించిన ఓ మహిళా ఐఎఎస్ పై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె అవినీతి అనకొండని, లంకిణి, పిశాచి, తాటకి అని విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే ఆమె అవినీతిపై నోరు విప్పాలనుకున్నానని, అయితే అప్పుడు కుదరలేదని, ఇప్పుడు అసలు విషయం చెబుతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె అవినీతి విషయమై గత ప్రభుత్వ హయాంలో సీఎంఓలోని ఓ సీనియర్ ఐఎఎస్ తో కూడా మాట్లాడానని చెప్పారు. టీడీఆర్ (Transferable Development Rights) బాండ్ల విషయమై తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూనే ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
ఆయన ఏమన్నారంటే...
'ఇవాళ నేను చెప్పే మాటల్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అంగీకరించనూ వచ్చు, లేకపోనూ వచ్చు. కాని ఆ అధికారిణి మాత్రం అవినీతి అనకొండ. ఆమె మంత్రులను సైతం లెక్కచేయదు. తన శాఖకు తానే మోనార్క్. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీకి తాము అంగీకరించక పోవడంతో మా పక్క జిల్లాలోని తెలుగుదేశం నాయకులకు సమాచార ఇచ్చి నేనోదో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేయించింది. ఆ అవినీతి అధికారిణి గతంలో మంత్రులను సైతం పూచికపుల్లలా చూసేది. కనీసం తన శాఖకు సంబంధించిన మంత్రులను కూడా లెక్క చేయదు. ఆమెకు డబ్బులు సంపాదించడమే తప్ప ఎలాంటి నైతిక విలువలు లేని అధికారిణి. ఆమె ఓ తాటకీలాంటిది. కింది స్థాయి అధికారుల పట్ల కీచకి.
తిరుపతిలో తాము రోడ్లు వేస్తున్న సమయంలో అ అధికారిణి టీడీఆర్ బాండ్ల ద్వారా వందల కోట్లు కొట్టేయాలనే ప్లాన్ వేస్తే దానిని తాము అడ్డుకున్నాం.. ఇది తట్టుకోలేక ఆమె నెల్లూరు జిల్లా నేతలకు తాము రెండు వేల కోట్లు దోచుకున్నామంటూ ప్రచారం చేయించింది. ఆ అధికారిణి గత 35 ఏళ్లుగా ఎక్కడ పనిచేసినా అవినీతికి పాల్పడుతూ వందల కోట్లు దోచుకుంది. ఆమె నిజాయితీ గురించి మాకు బాగా తెలుసు అని అత్యున్నత న్యాయస్థానం సైతం ఆమె గురించి వెటకారంగా వ్యాఖ్యానించింది. రోజూ ఆమె ధరించే చీర లక్షన్నర రూపాయలు.. ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలకంటే విలువైన 11 విగ్గులు ఆవిడకు ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో విగ్గుతో దర్శనమిస్తుంటారు. ఆమెకు వచ్చే జీతం ఎంత? ఆమె కట్టుకునే చీర ఖరీదు ఎంత?
35 ఏళ్లుగా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసింది. లంకిణి వంటి చేష్టలున్న మనిషి. ఆమె కోట్లాది విలువైన భూమినే కొల్లగొట్టింది. నా మీద కక్షతో నాపై లేని పోని ఆరోపణలు చేశారు. గతించిన తెలుగుదేశం నాయకుడుతో అంటకాగిన ఆమె ఓ ఆధునిక రజియా సుల్తానా.. ఇలాంటి నీచపు అధికారుల వల్ల సమస్యలు వస్తాయి. ఇంతకాలం నా బాధను వ్యక్తీకరించడం కుదర్లేదు. ఇప్పుడు నా బాధను వ్యక్తీకరిస్తున్నా. ఇలాంటి అధికారుల పట్ల రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని తెలియజేస్తున్నా' అని ఆయన అన్నారు.
టీడీఆర్ బాండ్లు అంటే...
టీడీఆర్ బాండ్లు (TDR Bonds) అంటే బదిలీకి అవకాశం ఉన్న అభివృద్ధి హక్కులు (Transferable Development Rights). ఇవి రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవి. అభివృద్ధి కోసం వీటిని ప్రభుత్వం జారీ చేస్తుంది. వీటి ద్వారా ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు రోడ్ల విస్తరణ వంటి ప్రజా ప్రయోజనాల కోసం భూములను సేకరించినప్పుడు, ఆ భూమి యజమానులకు పరిహారంగా ఈ బాండ్లను జారీ చేస్తాయి. ఈ బాండ్లను ఉపయోగించి, ఆ భూమి యజమానులు తాము కోల్పోయిన భూమికి బదులుగా, ఇతరుల ప్రాంతాలలో (డెవలప్‌మెంట్ జోన్‌లలో) FSI (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) ఆధారంగా అనుమతించిన దానికంటే ఎక్కువ అంతస్తులు లేదా స్పేస్ నిర్మించుకోవచ్చు.
అలాంటి బాండ్ల వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Next Story