కాంట్రవర్సీ పద్మవ్యూహాల్లోకి చొరబడగలడు, సునాయాసంగా బయటకు రాగలడు.ఎదిరించగలడు, బెదిరించగలడు, చేధించగలడు, ఇపుడు ఎందుకు ఇలామాట్లాడుతున్నాడు...
గుడివాడ్ యూత్ లో ఆయనకు చాలా క్రేజ్. రాష్ట్రవ్యాపితంగా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సోషల్ అభిమాన సేన పెద్దది. వయసులో కూడా ఆయన ఏమంతా పెద్ద వాడు కాదు. అయితే, తనకు ఇదే చివరి ఎన్నికని ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సారి తనను గెలిపించాలని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేని, అప్పటికి తన వయసు 58 అవుతుందని అన్నట్లు వార్తలు వెలువడ్డాయి
అపుడే కొడాలి నానికి రాజకీయలపై వైరాగ్యం వచ్చిందా?
ఉన్నట్లుండి వేదాంతం ఎందుకు మాట్లాడారు. రాజకీయాల్లో 50 ఏళ్లు దాటాయంటే యుక్తవయసు వచ్చినట్లు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబుకు 74 ఏళ్లు దాటాయి. తెలంగాణలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు 74ఏళ్లు దాటాయి. ఎన్‌డీ తివారీకి 75ఏళ్లు దాటాయి. ఇలా రాజకీయాల్లో వయసు పెరిగే కొద్ది క్రేజ్ పెరిగినట్లుగా భావిస్తారు. అటువంటిది కొడాలి నానీ ఎందుకు ఈ మాటలు అన్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒక మీడియా ప్రతినిధితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తాను 2029 ఎన్నికల్లో పోటీ చేయనని వ్యాఖ్యానించారు.
జిల్లాలో రొమ్ము విరుచుకు తిరిగిన నాయకుడు
కృష్ణా జిల్లాలో రొమ్ము విరుచుకు తిరిగిన నాయకుడు కొడాలి నాని అంటే అతిశయోక్తి కాదేమో. నాని అంటే ఓ క్రేజ్ తీసుకొచ్చారు. యువతను ఉర్రూతలూగించారు. అలాగే కాంట్రవర్సీలో కూడా తానేమీ తీసిపోనని నిరూపించారు. క్యాషినో నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపారు. చంద్రబాబును బూతులు తిట్టి పెద్ద రచ్చకు చర్చకు కారకుడయ్యారు. విమానాలు, రైళ్లలో కంటే కార్లలో ఎంతదూరమైనా ప్రయాణాలు సాగిస్తుంటాడని సన్నిహితులు చెబుతుంటారు. ఉదయం హైదరాబాద్‌లో ఉంటే సాయంత్రం గుడివాడలో ఉంటాడని చెబుతుంటారు.
రాజకీయ ప్రస్తానం..
నాని గుడివాడ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 2004, 2009 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ను ఓడించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఓడించారు. చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాశ్‌పై 18,969 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దేవినేని అవినాశ్ తెలుగుదేశం పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. ఆ తరువాత ఆయన కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పిన్నమనేని వెంకటేశ్వరావు 2014లో టీడీపీలో చేరారు. అయితే పోటీ చేయలేదు. 2009లో రావి వెంకటేశ్వరావు ప్రజారాజ్యం తరపున ఎన్నికల బరిలోకి దిగితే మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరావు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. వీరిద్దరూ టీడీపీలోకి వచ్చినా 2014లో కొడాలి నాని గెలవడం విశేషం.
రాజకీయాల్లోకి రాకముందు..
రాజకీయాల్లోకి రాకముందు గుడివాడలో ప్రైవేట్‌బస్సులు నడిపేవారు. రావి వెంకటేశ్వరావు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని రాజకీయాల్లోకి ప్రవేశించారు. హరికృష్ణ ట్రాన్స్‌పోర్టు మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయన ద్వారా ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబలు నెలకొన్నాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా చేశాడు. రాజకీయాల్లో రావి వెంకటేశ్వరావుకు సపోర్టు చేస్తూ వచ్చారు. 1999లో రావి వెంకటేశ్వరావు సోదరుడు హరిగోపాల్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే చనిపోయారు. ఆయన మృతితో 2000లలో బై ఎలక్షన్ జరిగింది. ఆ ఎన్నికల్లో రావి వెంకటేశ్వరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నాని వెంకటేశ్వరావుకు సపోర్టు చేసి గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రావి వెంకటేశ్వరావుకు కొడాలి నానికి మధ్య స్పర్థలు వచ్చాయి. నాని ప్రత్యేంగా టీడీపీ నుంచి వార్డు మెంబర్లుగా రెబల్ అభ్యర్థులను రగంలోకి దించి ఐదుగ్గురిని గెలిపించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నానికి ఒక క్రేజ్ వచ్చింది. దీంతో ఆయనను రావి వెంకటేశ్వరావు టీడీపీ నుంచి సస్పెండ్ చేయించారు.
తర్వాత హరికృష్ణతో పరిచయం పెంచుకుని పార్టీలో నాయకుడిగా ఎదిగారు. ఎన్టీరామారావు మరణానంతరం హరికృష్ణ పెట్టిన అన్న తెలుగుదేశం పార్టీ ద్వారా హరికృష్ణను గుడివాడ నుంచి పోటీ చేయించాడు. గుడివాడలో హరికృష్ణ ఓటమి తరువాత కూడా వారితో సంబంధాలు కొనసాగించాడు.
కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలే తనకు చివరివి అని స్పష్టం చేశారు. 2029 ఎన్నికలకు తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన వయసు 53 ఏళ్లు అని.. మరో 5 ఏళ్ల తర్వాత 58 ఏళ్లు అవుతాయని.. ఆ వయసులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేనని కొడాలి నాని వెల్లడించారు. ఇక తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. తన కుమార్తెలకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని కొడాలి నాని తెలిపారు. ఆసక్తి ఉంటే తన తమ్ముడి కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అంటే కొడాలి నాని రాజకీయ వారసుడు తమ్ముని కుమారుడేనని ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సంచలనాలకు మారు పేరు..
ఈ ఐదేళ్లలో కొడాలి నానీ ఎక్కడ మాట్లాడినా సంచలనం సృష్టిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేశ్ మిగిలిన నాయకులను చీల్చి చెండాడారు. మరో విధంగా చెప్పాలంటే బూతుల మంత్రిగా కూడా ప్రశిద్ధికెక్కారు. అసెంబ్లీలో ఈయన మాటలు వింటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముసిముసి నవ్వులు నవ్వేవాడు. అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షాలను ఆటాడాడని చెప్పొచ్చు.
సినిమా రంగంలోనూ ప్రవేశం
సాంబ 2004 లో విడుదలైన తెలుగు యాక్షన్ సినిమా. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, భూమికా చావ్లా, జెనెలియా డిసౌజా, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, విజయకుమార్, అలీ, సీతారా, సుకుమారి, సుకన్య, బ్రహ్మజీ సహాయక పాత్రల్లో నటించారు. వివి వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని నిర్మించారు. కె రవీంద్రబాబు ఛాయాగ్రహణం, గౌతం రాజు కూర్పు, మణి శర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం 2004 జూన్ 9 న విడుదలైంది. కన్నడ వంటి మాండ్య పేరుతోటి, బంగ్లాదేశ్‌లో బెంగాలీ భాషలో ఏక్ రోఖా పేరుతో రీమేక్ చేసారు. దీనిని హిందీలో ఇదే పేరుతో అనువదించారు. కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయ పార్టీల్లో ఎక్కడున్నా సినిమా రంగంలోని చాలా మంది పెద్దలతో సంబంధాలు ఉన్నాయి.
మొదట శ్రీరాములయ్య సినిమాను కొనుగోలు చేశాడు. దీంతో పరిటాల రవితో కూడా మంచి సంబంధాలు కలిసాయి. అందులో నష్టం వచ్చినా తానే భరించాడు. అప్పటి నుంచి హరికృష్ణతో పాటు సినిమా రంగంలోని కొందరు ప్రముఖులతో సంబంధాలు కొనసాగాయి. జూనియర్ ఎన్టీర్‌తో మంచి స్నేహం నెలకొంది. అదుర్స్ సినిమాలోనూ వాటా ఉంది.
ఇన్నిరోల్స్ పోషించిన కొడాలి రాజకీయ రోల్ ఇక ముందు మానేస్తాననడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది నిజమా లేక వ్యూహమా తెలియదు. ఏమయినా సరే ఆయన కనిపించక పోతే, గుడివాడ రాజకీయ రక్తికట్టదేమో. ఆయన అభిమానులేమంటారో చూడాలి.
Next Story