ఆ భవనం పర్యాటకులకా.. పాలకులకా..
x
ఫోటో సోర్స్: సాక్షి డిజిటల్ మీడియా

ఆ భవనం పర్యాటకులకా.. పాలకులకా..

ఆది నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న రుషికొండ భవనం ప్రారంభం అయినప్పటికీ ఇది పర్యాటకులకా.. పాలకులకా.. అనే సందేహం మాత్రం ఇంకా ప్రజల్లో నెలకొనే ఉంది.


తంగేటి నానాజీ, విశాఖపట్నం

ఋషికొండ .. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తల నోట్లో నానుతున్న పేరు.. న్యాయస్థానాల్లో వివాదాల సుడిగుండాల్లో తిరుగుతున్న పేరు.. దీనికి కారణం ఏంటి.. పర్యాటక ప్రాంతంగా.. విరాజిల్లిన ఈ ఋషికొండ బీచ్ ఎందుకు వివాదాల సుడిగుండంలోకి నెట్టబడింది.
ఋషికొండ బీచ్ ను ఆనుకుని ఉన్న కొండపై పర్యాటక ప్రాజెక్టు హరిత రిసార్ట్స్ ఉండేది.. దేశ, విదేశాల నుంచి విశాఖ అందాలను తిలకించేందుకు విచ్చేసే పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చేది.. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ రిసార్ట్స్ ను కూల్చేసి కొండను తవ్వి భవన సముదాయాలను చేపట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి అక్కడకు పర్యాటకులను గాని, సామాన్య ప్రజానీకాన్ని గాని, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, పొలిటికల్ పార్టీ నేతలను గాని, చివరకు మీడియాని కూడా అనుమతించలేదు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.
రిషికొండ కథా కమామిషు..
విశాఖ సాగర తీరం 134 కిలోమీటర్ల విస్తీర్ణంలో విశాలంగా ఉంటుంది.. తొలిత ఆర్కే బీచ్ ను మాత్రమే గుర్తించిన పర్యాటకశాఖ అనంతర కాలంలో పలు బీచ్ లను అభివృద్ధిపరచింది. అందులో ఒకటి ఈ ఋషికొండ బీచ్.. 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఋషికొండ బీచ్ ప్రాముఖ్యతను గుర్తించి ఋషికొండ బీచ్ అభివృద్ధికి ఎండాడ విలేజ్ రుషికొండ సర్వేనెంబర్ 19/134 లో 69.65 ఎకరాలు కేటాయించింది.
ఇలా కేటాయించిన స్థలంలో బీచ్ ని ఆనుకుని ఉన్న కొండ కూడా భాగమే.. అనంతర కాలంలో 2006లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పర్యాటకశాఖ అక్కడ పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే హరిత రిసార్ట్స్ ను నిర్మించింది. ఇలా పర్యాటక ప్రాంతంగా ఋషికొండ బీచ్ విశాఖ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఋషికొండకు అంతర్జాతీయ గుర్తింపు..
ఆహ్లాదకరమైన సముద్ర తీరం.. తీరాన్ని ఆనుకుని సీ వ్యూతో ఉన్న హరిత రిసార్ట్స్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షించింది. దీంతో దేశ విదేశాల పర్యాటకులు తండోపతండాలుగా ఇక్కడికి తరలి వచ్చేవారు.. అంతేకాదు "బ్లూ ఫ్లాగ్" అంతర్జాతీయ అవార్డుతో ఋషికొండ బీచ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
ఇంతవరకు బాగుంది అసలు వివాదం ఏంటి..
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం కోసం మూడు రాజధానులు అంటూ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. దీంతో విశాఖకు ప్రాధాన్యత పెరిగింది. వైసీపీ ప్రభుత్వ దృష్టి కూడా విశాఖ పై పడింది. అభివృద్ధి పేరుతో పలు ప్రాజెక్టులను విశాఖలో నెలకొల్పారు. ఇందులో భాగంగానే ఋషికొండపై నిర్మాణాలు చేపట్టారు. 9.88 ఎకరాల్లో తొలుత 240 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భవన సముదాయాలను చేపట్టారు.
అప్పటికే ఉన్న హరిత రిసార్ట్స్ ను కూలగొట్టారు. అయితే రాజధాని నేపథ్యంలో ఇక్కడ నిర్మిస్తున్న ఈ భవనం సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ విస్తృత ప్రచారం జరిగింది. ఈ భవనాలను నిర్మించేందుకు కొండను తోలచడంతోపాటు ఋషికొండ పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ జనసేన, టిడిపిలో కోర్టులను ఆశ్రయించగా.. పలువురు పర్యావరణ వేత్తలు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.
ఋషికొండ నిర్మాణాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఓ కమిటీని కూడా నియమించింది. అయితే ఆ కమిటీ ఇప్పటికీ కోర్టులో నివేదిక సమర్పించలేదు. కోర్టులో కేసులు ఉంటుండగానే 450 కోట్ల రూపాయలతో భవన సముదాయాల నిర్మాణాన్ని పూర్తి చేశారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హడావిడిగా పర్యాటక శాఖ మంత్రి రోజా, ఐటీ మంత్రి అమర్నాథ్ తో కలిసి ఈ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ భవన సముదాయం పర్యాటక ప్రాజెక్టు అంటూనే ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తే క్యాంపు కార్యాలయంగా కూడా ఉపయోగిస్తారు అంటూ రెండు విధాలా చెప్పుకొచ్చారు. దీంతో ఇది సీఎం క్యాంపు కార్యాలయమా... పర్యాటకులకు ఆతిథ్యమిచ్చే రిసార్ట్స్ అనే సందేహం ప్రజల్లో మరింత పెరిగింది.


Read More
Next Story