రోడ్లుకు ఇరువైపుల నాటే చెట్లలో మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో నాటిన వాటికి బదులుగా స్వదేశీ జాతులను నాటేందుకు శ్రీకారం చుట్టారు. ఏ చెట్లు వద్దనుకున్నారు. వాటికి బదులు నాటే రకాలేవి?
రోడ్లపై పచ్చదనం, నీడతో పాటు అందంగా కనిపించేందుకు చేపట్టే అవెన్యు ప్లాంటేషన్‌లో ఇది వరకు నాటి పెంచుతున్న చెట్లను కాకుండా స్వదేశీ జాతులకు సంబంధించిన చెట్లను నాటేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నడుం బిగించింది. స్వదేశీ రకాల చెట్లను ప్రోత్సహించడంతో పాటుగా వర్షాలు, తుపానులు, ఈదురు గాలులకు పడిపోకుండా వాటిని తట్టుకొని నిలబడి బతక గలిగే సామర్థ్యం కలిగిన జాతుల చెట్లను నాటి పెంచాలని శ్రీకారం చుట్టినట్లు తూర్పు గోదావరి జిల్లా ఫారెస్టు అధికారి బి నాగరాజు ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’కు తెలిపారు. కేవలం నీడను ఇవ్వడమే కాకుండా నీడతో పాటుగా మల్టీపుల్ ఉపయోగాలు ఉండే చెట్లను రోడ్లకు ఇరువైపుల నాటాలని భావిస్తున్నారు. ఇలాంటి చెట్లను నాటి పెంచడం వల్ల ఆ చెట్లకు కాసే పండ్లు మనుషులు, జంతువులు, పక్షులు తినేందుకు, ఆకులు, కాండం, మానులు వంటి వృక్షంలోని అన్ని భాగాలు ఉపయోగపడే చెట్లను పెంచేందుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
ఇప్పటి వరకు నిద్రగన్నేరు, పచ్చ తురాయి వంటి చెట్లను రోడ్ల పక్కన నాటే వారు. గత కొన్నేళ్ల నుంచి ఇదే పద్దతిని అనుసరిస్తూ వస్తున్నారు. తురాయిని కానీ, నిద్రగన్నేరును కానీ నాటేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రోత్సహించడం లేదు. నిద్రగన్నేరును ఇంగ్లీలో రెయిన్ ట్రీ(RainTree ) అంటారు. దీని శాస్త్రీయ నామం (Samanea Saman ). తురాయి శాస్త్రీయ నామం డెలోనిక్స్ రీజియా (Delonix Regia). ఈ పద్దతి ఒక రకంగా ఇది చాలా మంచిది. ఈ చెట్లు త్వరగా పెరుగుతాయి. ఏపుగాను పెరుగుతాయి. దట్టమైన నీడను అందిస్తాయి. అందంగా కూడా కనిపిస్తాయి. దీంతో ప్రజలు ఆహ్లాదకరంగా ఫీలవుతారు. అయితే వీటికి స్వతహాగా పెళుసుదనం కలిగి ఉంటుంది. దీంతో చిన్న పాటి వర్షాలకు, గాలులకు కూడా కొమ్మలు విరిగి పోతాయి. కొన్ని చెట్లైతే పడిపోతుంటాయి. అలా అని వాటిని తక్కువ చేయడం కాదు.
ప్రతి చెట్టు దాని కంటూ ఒక ప్రత్యేకతను, ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. నిద్రగన్నేరు, పచ్చ తురాయి వంటి చెట్ల వల్ల ప్రజలకు కలిగే ఉపయోగాలు, తుపానులు, వర్షాలు వంటి విపత్తుల సయమంలో సంభవించే ప్రమాదాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇలాంటి ఆలోచనలు చేసినట్లు నాగరాజు చెప్పుకొచ్చారు.
వాటికి బదులుగా చింత, నేరేడు, రావి, మర్రి, కొండ మామిడి, మామిడి, వేప, కానుగ వంటి పలు మొక్కలను వేయాలని ఆలోచనలు చేస్తున్నారు. కానుగను తొలి మూడు, నాలుగేళ్లు కొమ్మల(బ్రాంచెస్)ను తొలగిస్తూ పోతే దాని కాండం పెద్దదిగా మారితుంది. దీని వల్ల చెట్లు ఏపుగా పెరిగి, మానులాగా మారేందుకు వీలుగా ఉంటుంది. అలా చేయకుండా ఉంటే తక్కువ ఎత్తులోనే కొమ్మలతో గుబురుగా పెరిగి పోతుంది. వృక్షంలా మారదు. పెద్ద మానుతో కూడిన వృక్షంలా పెరిగితే దాని వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. స్వదేశీ రకానికి చెందిన ఈ రకాల మొక్కలను అటవీ శాఖ పరధిలోని నర్సరీల్లో పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చినట్లు నాగరాజు తెలిపారు. చింత చెట్టును ఇంగ్లీషులో టేమరిండ్( ) అంటారు. టేమరిండస్ ఇండికా( ) దీని శాస్త్రీ నామం.
నేరేడును ఇంగ్లీషులో జామున్(Jamun) అంటారు. దీని శాస్త్రీయ నామం షైజీయం క్యుమిని(Syzygium cumini). రావిని ఇంగ్లీషులో సేక్రెడ్ ఫిగ్( Sacred Fig) అంటారు. దీని శాస్త్రీయ నామం ఫైకస్ రిలిజియోసా( Ficus religiosa). మర్రిని ఇంగ్లీషులో బన్యాన్ అంటారు. మామిడి చెట్టును ఇంగ్లీషులో మ్యాంగో ట్రీ అంటారు. దీని శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా( Mangifera indica). అజాడి రెక్టా ఇండికా(Azadirachta indica)వేప చెట్టు శాస్త్రీయ నామం.
చిన్న, చిన్న మొక్కలను నాటేందుకు వీలు పడదు. ఒక వేళ వాటిని నాటినా అవి తిరిగి ప్రాణం పోసుకొని బతకడం కష్టంతో కూడుకున్న పని. అందువల్ల కొంత ఎత్తు పెరిగిన తర్వాత నాటుతారు. దాదాపు 1.2 మీటర్ల నుంచి 1.5 మీటర్ల వరకు ఎత్తు పెరిగిన తర్వాత అలాంటి మొక్కలను నాటేందుకు అటవీ శాఖ అధికారులు నర్సరీల్లో పెంచుతుంటారు. అంతవరకు వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. ఆ మాత్రం ఎత్తు వరకు పెరిగేందుకు ఒక్కో మొక్కకు రూ. 45 నుంచి రూ. 60 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు మొక్క రకాన్ని బట్టి ఉంటుంది.
రోడ్డు పక్కన నాటే సమయంలో అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కలను నాటేందుకు రైతులు, ఆ ప్రాంతపు ప్రజలు ఒప్పుకోరు. ఒక వేళ నాటినా ఆ చెట్ల వల్ల వచ్చే నీడ పక్కన పెంచే పంటలకు నష్టం చేకూర్చుతుందని, నీడ పడే ప్రదేశంలో పంట పెరగదని రైతులు భావిస్తారు. రెతులు, ఆర్ అండ్ బి అధికారుల నుంచి ఇలాంటి సమస్యలు ఎక్కువుగా వస్తుంటాయి. ఒక్కో సారి పెద్దగా పెరిగిన చెట్లను కూడా నరికేస్తుంటారు. ఇలాంటి సంఘటనలపై గతంలో అనేక కేసులు కూడా నమోదు చేసినట్లు నాగరాజు తెలిపారు. తాను కడప జిల్లాలో పని చేస్తున్న సమయంలో
పెరిగిన చెట్లను తీసేయాలని, తమ పంట పొలాలు పాడైపోతున్నాయని రైతులు చెబుతుంటే.. వారికి నయాన, భయాన నజ్జ చెప్పి, కొమ్మలను కత్తిరించుకుంటూ చెట్లను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డామని, వేంపల్లె నుంచి పులివెందుల వరకు దాదాపు 30కిలోమీటర్ల మేర ఇలాంటి చర్యలు తీసుకున్నామని రోడ్ల పక్కన చెట్లను కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడినట్లు నాగరాజు తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
మొక్కలను నాటిన తర్వాత వాటి సంరక్షణ బాధ్యతలను ఆయా ప్రాంతాల పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్‌లకు అప్పగిస్తారు. ఆ మొక్కలకు సంరక్షిస్తూ, పెద్ద చేయడం, ఎవ్వరూ వాటిని కొట్టేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి సంరక్షణ చర్యలన్నీ సంబంధిత పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లు తీసుకోవలసి ఉంటుంది.