అబ్బుర పరిచిన శిల్పి కాటూరి, ఆకట్టుకున్న అమరావతి
x
ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తయారుచేసిన అమరావతి పెడస్టల్

అబ్బుర పరిచిన శిల్పి కాటూరి, ఆకట్టుకున్న "అమరావతి"

రాజకీయంగా మోదీ టూర్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో అంతకుమించి ఆకట్టుకుంటోంది అమరావతిలో ఏర్పాటు చేసిన అమరావతి పెడస్టల్ (pedestal).


అమరావతి.. టాక్ ఆఫ్ ది డే.. మే 2.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభం కోసం వస్తున్న తేదీ.. రాజకీయంగా మోదీ టూర్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో అంతకుమించి ఆకట్టుకుంటోంది అమరావతిలో ఏర్పాటు చేసిన అమరావతి పెడస్టల్ (pedestal). సుమారు 20 అడుగుల పొడవున ఉన్న ఈ 'అమరావతి' అక్షర శిల్ప కళా ప్రదర్శన చూపరులను కళ్లు తిప్పనీయకుండా చేస్తోంది. సుమారు 6 టన్నుల ఐరన్ స్క్రాప్ తో తయారుచేసిన అమరావతి అక్షర మాలను రూపొందించారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్ర, ఆయన సిబ్బంది.

అమరావతి అక్షర మాల కింది 'భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అమరావతి నగర నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు' అని పేర్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఐరన్ స్క్రాప్ తో ఎంతో అద్భుతంగా తయారు చేశారు. చూపరులకు కనువిందు చేసేలా ఈ పెడస్టల్ కు పక్కనే నిలువెత్తు బౌద్ధ విగ్రహం, దాని వెనుక అశోకుని ధర్మచక్రం, మరోపక్క బౌద్ధకాలం నాటి కాలచక్రం ఉన్నాయి. బౌద్ధ విగ్రహం పక్కనే చేయి పైకి ఎత్తి ప్రజలకు అభివాదం చేస్తున్నట్టుండే నిలువెత్తున నరేంద్ర మోదీ ఉక్కు విగ్రహాన్ని ఉంచారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని పెట్టారు. దానికి పక్కనే తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కూడా ఉంచారు. ఈ పెడస్టల్ కు ముందు నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా నమూనాకు తగ్గట్టుగా భారీ సింహం లోగోను ఉంచారు.

ఇప్పుడీ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా ఉంది. మోదీ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పెడస్టల్ ను చూడకుండా వెళ్లడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ విగ్రహాల ముందు సెల్ఫీల సందడి చాలా ఎక్కువగా ఉంది.
ఈ సందర్భంగా ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు 'పెడరల్' ప్రతినిధితో మాట్లాడుతూ.. అమరావతి పెడస్టల్ ఉద్దేశాన్ని వివరించారు. తెనాలిలోని తమ కాటూరి శిల్పశాల, సూర్య శిల్పశాలలో ఇది పురుడు పోసుకుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం తర్వాత నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి వస్తున్నందున ఏదైనా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే స్వచ్ఛందంగా అమరావతి పెడస్టల్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సుమారు 15 టన్నుల ఐరన్ స్క్రాప్ ను ఇందుకు ఉపయోగించామన్నారు. 50 లక్షల రూపాయల వరకు వ్యయం అయిందని వివరించారు. ఈ విగ్రహాల తయారీకి అవసరమైన స్క్రాప్ ను విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ నుంచి సేకరించామన్నారు.
ఎంతో కష్టపడి ఈ అక్షరమాలను తయారు చేయడం ఒక ఎత్తయితే దాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం తలకు మించిన భారమైందన్నారు. 24 గంటల ముందు వరకు కూడా అధికారుల నుంచి అనుమతి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నన్నపునేని రాజకుమారి, సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారులు మల్లికార్జున్, బోడపాటి సత్యవతి లాంటి వాళ్లు సహకరించక పోతే తాము చేసిన పని బూడిదలో పోసిన పన్నీరు అయ్యేదన్నారు. ఇదేదో తమ గుర్తింపు కోసం చేయలేదని, అమరావతి ప్రైడ్ కోసం తయారు చేశామని కాటూరి వెంకటేశ్వరరావు చెప్పారు.

ఈ కళాఖండాన్ని తిలకించిన అమరావతి ప్రాంత రైతు మందపాటి రామకృష్ణ ఈ పెడస్టల్ అద్భుతంగా ఉందని, దీన్ని రాజధాని ప్రాంతంలో శాశ్వతంగా ఉంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ విగ్రహాలను రాజధాని ప్రాంతంలో ప్రతిష్టించేలా కోరతామని చెప్పడం విశేషం. ఏపీ రాజధానికి ఇదో గర్వకారణమని చెప్పారు.
సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఈ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బుద్ధుడు, కాలచక్రం, ఎన్టీఆర్‌, ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాలతో పాటు మేక్‌ ఇన్‌ ఇండియా లోగో ఆకట్టుకుంటున్నాయి.
ఈ శిల్పాలను చూసిన అనేక మంది మంత్రులు సైతం ‘అమరావతి’ అక్షరాల రూప శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ప్రశంసలతో ముంచెత్తారు.
Read More
Next Story