’మహాలక్ష్మి‘ ప్రయాణం రాష్ట్రానికి సమాజానికి ఎంత మేలంటే...
x

’మహాలక్ష్మి‘ ప్రయాణం రాష్ట్రానికి సమాజానికి ఎంత మేలంటే...

ఉచిత బస్సు ప్రయాణం అనేది వాహన సౌకర్యం మాత్రమే కాదు. ఇది మహిళల ఆత్మగౌరవ చిహ్నం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికలకు ముందు ప్రకటించిన "సూపర్ సిక్స్" హామీలలో ఈ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్‌జెండర్లు APSRTC నిర్వహించే కొన్ని బస్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు .
ఈ పథకం కింద మహిళలు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, వారి స్వతంత్రతను పెంపొందించడంలో సహాయపడుతుంది.
మహిళల మొబిలిటీని పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారీ భారమే పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో బస్సులు పెంపు మొదలు అదనపు సిబ్బంది నియామకం వరకు పలు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి APSRTC దాదాపు 2,000 కొత్త బస్సులు కొనాల్సి ఉంది. 11,500 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం APSRTC బస్సుల ఆక్యుపెన్సీ రేటు 69%గా ఉంది. ఈ పథకం అమలుతో అది 95%కి పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.18.2 కోట్లు కేటాయించింది. ఈ నిధులు డ్రైవర్ల శిక్షణ, ఇతర అవసరాలకు ఉపయోగిస్తోంది.
మహిళలకు ఉచిత బస్సు పథకం ఇంప్లిమెంట్ కావాలంటే అదనపు సిబ్బంది అనివార్యం. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. అటువంటి ఆర్టీసీపై ఉచిత బస్సు ప్రయాణికుల పథకం వల్ల ప్రతినెలా 265 కోట్ల రూపాయల భారం పడుతుంది. అంటే ఏడాదికి 3, 152 కోట్ల రూపాయలు అదనపు భారం పడే అవకాశం ఉంది.
ప్రస్తుత అంచనా ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించనున్నారు. ఈ స్కీం కింద రాష్ట్ర ప్రభుత్వం 7930 బస్సులను కేటాయించే అవకాశం ఉంది. వాస్తవానికి మరో 2045 అదనపు బస్సులు కూడా కావాలి. అలాగే 5,016 మంది డ్రైవర్లు 5,016 మంది కండక్టర్లు, 1,447 మంది మెయింటినెన్స్ స్టాప్ మొత్తం 11,479 మంది అదనపు సిబ్బంది కావాలి.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజు 16.11 లక్షల నుంచి 26. 95 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. 10 లక్షల 84 వేలమంది ప్రయాణికులు పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే దాన్ని ప్రస్తుతం మదింపు చేస్తున్నారు.

ఉచిత బస్సు ప్రయాణాన్ని అన్ని సర్వీసులకు కాకుండా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులలో మాత్రమే అనుమతించేటట్లయితే ఏపీఎస్ఆర్టీసీ పై ప్రతినెలా 177 కోట్ల రూపాయలు అంటే ఏడాదికి రూ.2,112 కోట్ల అదనపు భారం పడుతుంది.
ఈ ప్రతిపాదనకే అధికారులు మొగ్గు చూపినట్లయితే 6,136 బస్సులు తిప్పాల్సి ఉంటుంది. అప్పుడైనా కొత్తగా 1684 అదనపు సర్వీసుల్ని నడపాల్సిందే. అప్పుడు కూడ 4,129 మంది డ్రైవర్లు 4,129 మంది కండక్టర్లు, 1191 మంది నిర్వహణా సిబ్బంది కావాలి. ఆ పరిస్థితుల్లో ప్రయాణీకుల సంఖ్య ఎంత పెరుగుతుందనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సర్వీసుల్లో ప్రస్తుతం మహిళా ప్రయాణికుల సంఖ్య 14.30 లక్షలుగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఈ సంఖ్య 23.28 లక్షలకు చేరవచ్చు. అంటే అదనంగా 8.89 లక్షల మంది పెరుగుతారు.
ఉచిత ప్రయాణాన్ని ఏయే సర్వీసుల్లో అనుమతించాలన్నది ఇంకా నిర్ణయం కాలేదు. రకరకాల ప్రతిపాదనలను అధికారులు, రవాణా శాఖ మంత్రి పరిశీలిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ నాయకత్వంలో పలువురు మంత్రులు వివిధ రాష్ట్రాల్లోని మహిళల ఉచిత బస్సు పథకాలను పరిశీలించి వచ్చారు. గ్రామాల నుంచి పుణ్యక్షేత్రాలకు, తిరుమల వంటి యాత్రాస్థలాలకు బస్సు సర్వీసులను నడపాలన్న డిమాండ్ ఎక్కువగా ఉందని మంత్రి చెప్తున్నారు.
మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగేటట్లయితే కనీస సదుపాయాలు కూడా కల్పించాల్సి. బస్టాండ్ లలో మహిళలకు టాయిలెట్లు, షెల్టర్లు, మంచినీటి సౌకర్యం వంటివి ఏర్పాటు చేయాలి.
తెలంగాణలో మహాలక్ష్మీ పథకం పేరిట అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్ ప్రయాణంతో ప్రయాణికుల శాతం 40 నుంచి 63 శాతానికి అంటే 23 శాతం పెరిగింది . కర్ణాటకలో శక్తి స్కీం కింద అమలు చేస్తున్న ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని55 శాతం మంది మహిళలు వినియోగించుకుంటున్నారు. కర్నాటకలో ప్రస్తుతం ఉన్న 40 నుంచి మహిళా ప్రయాణీకుల సంఖ్య 55 శాతానికి పెరిగింది. ఇక తమిళనాడులో విడియాల్ పయనం అనే స్కీం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడున్న 37 నుంచి 60 శాతానికి మహిళా ప్రయాణీకులు పెరిగారు.
సామాజిక ప్రయోజనాలు
ఈ పథకం మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని పెంపొందించడంలో, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో, సామాజిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు వంటి అవసరాలకు సులభంగా చేరుకోగలుగుతారు .
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరించాలంటే బస్సులతో పాటు సౌకర్యాలూ పెరగాలి. మహిళలకు సురక్షిత, సులువైన ప్రయాణాన్ని అందించడానికి సహాయపడుతుంది.
ఈ పథకం ద్వారా మహిళలు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకోగలుగుతారు. వారి ఆర్థిక స్వాతంత్ర్యం పెరుగుతుంది. ఇది మహిళల సాధికారతను పెంపొందించడంలో, సమాజంలో వారి పాత్రను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పల్లె ప్రాంతాల మహిళలకు నగరాల్లో అవకాశాలను సులభతరం చేస్తుంది.
"సామాజిక సాధికారత" అంటే ఏమిటి?
సాధికారత అనేది కేవలం ఆర్థికంగా స్వయం పోషణకే పరిమితం కాదు. ఇది మానవ హక్కులు, ఆత్మవిశ్వాసం, న్యాయమైన అవకాశాలు, భద్రత, అన్నింటినీ కలిపిన భావన. "సామాజిక సాధికారత" అంటే ఒక వ్యక్తి తన లింగం, కులం, వర్గం, ప్రాంతం వంటి కారకాలు లేకుండా సమాజంలో స్వేచ్ఛగా, గౌరవంగా జీవించడానికి, తన నిర్ణయాలు తానే తీసుకునేందుకు, సమాన అవకాశాలను పొందేందుకు ఉన్న సామర్థ్యం.
ఆర్థిక స్వాతంత్ర్యం కోసం సాగే పోరాటంలో ఇది కొంతమేర తోడ్పడుతుంది. మహిళలు రోజూ ప్రయాణించాల్సిన ఖర్చులు కుటుంబ ఆదాయంలో పెద్ద భాగం తీసుకుంటాయి. ఉచిత ప్రయాణం వల్ల దైనందిన ప్రయాణ భారం తొలగుతుంది. వారు స్వేచ్ఛగా బయటకు వెళ్లే ధైర్యం పొందుతారు. ఒక సాధారణ మధ్యతరగతి మహిళకు ఈ పథకం వల్ల నెలకు రూ. 600–1000 వరకు రవాణా చార్జీలు తగ్గినట్టే.
విద్యకు, ఉపాధికి చేరువ
గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోదలచిన అమ్మాయిలకు బస్సు ఛార్జీలు పెద్ద అడ్డంకి. ఉచిత ప్రయాణం ద్వారా హై స్కూల్, కాలేజ్, కోచింగ్ సెంటర్లు, టెక్నికల్ ట్రైనింగ్ వంటి అవకాశాలు ఎక్కువ మందికి చేరతాయి. మహిళలు చిన్న ఉద్యోగాలు, కౌన్సెలింగ్, కోర్టు, ప్రభుత్వ కార్యాలయాలకు సులభంగా వెళ్లగలుగుతారు.
ఆత్మవిశ్వాసం, మానసిక భద్రత
మహిళలు తమ కుటుంబం లేదా భర్తపై మాత్రమే ఆధారపడకుండా, స్వయంగా బయటికెళ్లి తిరిగి వచ్చే స్వేచ్ఛ పొందుతారు. ఇది వారిలో సామాజిక సాన్నిహిత్యం, పరస్పర మద్దతు, అనేక సంస్థలతో అనుసంధానం వంటి సామర్థ్యాలను పెంపొందిస్తుంది.
పబ్లిక్ స్పేస్‌లో హక్కును గుర్తించడం
ఉచిత ప్రయాణం మహిళలకు పబ్లిక్ స్పేస్ (బహిరంగ ప్రదేశాల్లో) తాము సమానమనే గుర్తింపు ఇస్తుంది. ఇది లింగ సమానత్వానికి (Gender equality) దోహదం చేస్తుంది.
ఒక మహిళ బస్సులో ఉచితంగా ప్రయాణించేటప్పుడు ఇతరుల సహానుభూతిని కోరాల్సిన అవసరం ఉండదు. ఇది ఆత్మగౌరవాన్ని (Self Respect) నిలబెట్టే అంశం. ఇది ప్రభుత్వం తన మహిళ పౌరులను ఆదరిస్తున్న సంకేతం. ఇది నేరుగా సాధికారతకు మద్దతు.
ఉచిత బస్సు ప్రయాణం అనేది వాహన సౌకర్యం మాత్రమే కాదు. ఇది మహిళా గమ్యాన్ని- స్వేచ్ఛగా, స్వయం నిర్ణయంతో, గౌరవంతో — కొనసాగించేందుకు వేసే పెద్ద ముందడుగు. ఇది ఆర్ధికంగా, మానసికంగా, సామాజికంగా సాధికారతను పెంచే మార్గం. ప్రభుత్వాలు ఇలాంటి చర్యల ద్వారా సమానతకు, న్యాయానికి కొత్త నిర్వచనాలను ఏర్పరుస్తున్నాయి.
Read More
Next Story