ఊపందుకున్న రాజధాని అమరావతి అంశం
x

ఊపందుకున్న రాజధాని అమరావతి అంశం

ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిన రాజధాని అమరావతి అంశం. సెంటుమెంట్‌గా మారిన రాజధాని టాపిక్‌. ఈ అంశం కేంద్రంగానే టీడీపీ ఎన్నికల ప్రచారం.


ఎన్నికల సయమంలో అమరావతి రాజధాని అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రత్యేకించి ఎన్టీఆర్‌ జిల్లాలో ఇది కీలక అంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు ఈ అంశంపై దృష్టి సారించాయి. రాజధాని అమరావతి పధాన అంశంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. విజయవాడ నగరం కానీ, ఎన్టీఆర్‌ జిల్లా కానీ రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న ప్రాతం. దీంతో రాజధాని ప్రభావం ఈ ప్రాంతంపైన చాలా ఎక్కువుగానే ఉంది. దీని వల్ల రాజధాని అమరావతి ఈ ప్రాంతంలో ఒక సెంటుమెంటుగా కూడా మారి పోయింది.

జిల్లా వ్యాప్తంగా రాజధాని అమరాతి ప్రభావం
ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ పార్లమెంట్‌ నియోజక వర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్‌తో పాటుగా మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్, కమ్యునిస్టు కూటమి రంగంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. సంక్షేమ పథకాలు, నవరత్నాలు వంటి అంశాలతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా, సూపర్‌ సిక్స్‌లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి అంశాలతో పాటు రాజధాని అమరావతి అంశాన్ని ప్రధనంగా ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
రాజధాని అమరావతిని జగన్‌ మూడు ముక్కలు చేశారు
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం రాజధాని అమరావతిని సర్వ నాశనం చేశారు. నామ రూపాలు లేకుండా చిందర వందర చేశారు. మూడు ముక్కలు చేశారు. ఎటూ కాకుండా చేశారు. విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లా ప్రజలకు రాజధాని అమరావతిని దక్క కుండా చేశారు. విధ్వంసం చేసి శిధిలావస్థకు తీసుకెళ్లారు. రాజధాని అమరావతిపైన సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కక్ష కట్టి, కావాలనే దూరం చేశారు. దీనిని తిరిగి దక్కించుకోవాలి. మనకు సమీపంలోనే రాజధాని ఉండే విధంగా చూసుకోవాలి. రాజధానిగా అమరావతిని కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత, దీనిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అందుకోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. రాజధాని విజయవాడ, ఎన్టీఆర్‌ ప్రజలకు దక్కాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలి. విజయవాడ పార్లమెంట్‌తో పాటు తక్కిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోను అభ్యర్థులను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ అయితే ఫోన్‌ల ద్వారా సందేశాన్ని పంపుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజధానిగా అమరావతని ఏర్పాటు చేయడానికి, మహానగరంగా తీర్చి దిద్దడానికి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాజధాని అమరాతిని రూపకల్పన చేయడంలో గత తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని, ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్న రాజధాని అమరావతి తిరిగి లైమ్‌లైట్‌లోకి రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే సాధ్యం అవుతుంది. రాజధాని అమరావతి కల నెరవేరాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాకారం అవుతుందని ప్రచారంలో కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో అమరాతి అంశం తిరిగి ఊపందుకుంది. దీంతో స్థానికుల్లో కూడా రాజధాని అమరావతి అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం ఎన్నికల ప్రధాన అజెండాగా కూడా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. గుంటూరు, తెనాలి, విజయవాడ నగరాలు సమీపంగా ఉండటంతో రాజధానిని తుళ్లూరు ఏరియాలో ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల ఉన్న నగరాలు త్వరగా డెవలప్‌ అవుతాయనే ఉద్దేశంతో అమరావతిని ఏర్పాటు చేశారు. దీంతో విజయవాడ నగరం కూడా అభివృద్ధి బాటలో నాడు నడిచిందని, రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా పుంజుకుందని, రహదారుల నిర్మాణాలు కూడా చేపట్టారని, వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఎక్కడిక్కడే ఆగిపోయాయనే చర్చ కూడా స్థానికుల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి కీలక అంశంగా ఈ ఎన్నికల్లో ఓటర్లు ఆలోచనలు చేసే చాన్స్‌ ఉందని కూడా చర్చ సాగుతోంది.
Read More
Next Story