కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీ కొన్న ఘటనలో కేసు నమోదు చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ఇప్పటికే పలు కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా మరో కేసును నమోదు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శర వేగంగా అడుగులు వేస్తోంది. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు చెందినవని, కావాలనే ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీ కొట్టించి, వరద ప్రమాదాన్ని పెంచేందుకు కుట్రలు పన్నారనే కారణంతో వారి మీద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
వరదల నేపథ్యంలో కృష్ణా బ్యారేజీకి ఫ్లడ్ పోటెత్తింది. ఈ సమయంలో బ్యారేజీ ఎగువ భాగం నుంచి వరదలో కొట్టుకొచ్చిన ఐదు బోట్లు బ్యారేజీ గేట్లను ఢీ కొట్టాయి. ఈ ప్రమాదం సెప్టెంబరు 1వ తేదీ తెల్లవారు జామున చోటు చేసుకుంది. బ్యారేజీ 67, 68, 69 గేట్లకు బోట్లు అడ్డుపడటంతో గేట్ల నుంచి దిగువకు వెళ్లాల్సిన వదర ప్రవాహానికి తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. అంతేకాకుండా బ్యారేజీ 69వ గేటు వద్ద పడవలు ఢీ కొనడంతో గేటుతో పాటు గోడ కూడా దెబ్బతిన్నాయి. కౌంటర్ వెయిట్‌ను ఢీ కొనడంతో విరిగి పోయింది. సెప్టెంబరు 1వ తేదీ తెల్లవారు జామున ఐదు భారీ బోట్లు కృష్ణా బ్యారేజీ గేట్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో, డ్యాం సేఫ్లీ, ఇంజనీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలోమరమ్మతులు చేపట్టారు. పనులు శర వేగంగా సాగుతున్నాయి. విరిగిపోయిన దాదాపు 17 టన్నుల బరువు ఉన్న కౌంటర్ వెయిటన్‌ను క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. గేట్లకు అడ్డంగా ఉన్న ఆ బోట్లను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా వెళ్లి ఈ పనులను పరిశీలించారు.
అయితే ఈ సంఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని వెనుక కుట్ర కోణం దాగుందనే అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిని నిగ్గు తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢీ కొన్న బోట్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. మొత్తం నాలుగు బోట్లు ఢీ కొన్నాయని, ఈ ఘటనలో రెండు గేట్లు స్వల్పంగా ధ్వంసం అయ్యాయని, నాలుగు బోట్లు ఒకే సారి ఎలా వచ్చాయి, ఎందుకొచ్చాయి, దీని వెనుక ఏమైనా కుట్ర కోణం దాగుందా వంటి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, వాటిని సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. గత రెండు రోజులుగా పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు.
ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తును చేపట్టిన పోలీసు అధికారులు ఎలా చోటు చేసుకుంది, ఎందుకు వచ్చాయి, ఆ బోట్లు ఎవరివి వంటి అంశాలపై ఒక నివేదికను తయారు చేసి దానిని సోమవారం ఉదయం సీఎం చంద్రబాబుకు సమర్పించారు. ప్రస్తుతం నిందితుల కాల్ డేటాను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని పోలీసుల దర్యాప్తు బందం నివేదికలో పేర్కొన్నారు. నంబర్లు ఆధారంగా ఢీ కొన్న బోట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలవని నిర్థారించారు. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు ఈ బోట్లను ఉపయోగించే వారు. బోట్లకు ఉన్న నంబర్లు, రంగులు ఆధారంగా ఇవి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించారు. ఉషాద్రి, కర్రి నరసింహ స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీలకు చెందిన బోట్లుగా తేల్చారు. మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉంది. ఈ మూడు ఉషాద్రికి చందినవి. ఇనుప గొలుసులతో లంగరు వేయకుండా కావాలనే ప్లాస్టిక్ తాళ్లతో కట్టారు. గత సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో మొత్తం ఐదు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీ కొన్నాయి. గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్‌లకు కాకుండా బ్యారేజీ పిల్లర్లను ఢీ కొట్టి ఉండి ఉంటే ప్రమాదపు తీవ్రత ఇంకా ఎక్కువుగా ఉండేదని పోలీసులు సీఎం చంద్రబాబుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
కావాలనే బోట్లతో బ్యారేజీని ఢీ కొట్టించారనే కేసుతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు జరిపారనే దానిపైనా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్, బోట్ల యజమానులైన ఉషాద్రి, కర్రి నరసింహ స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీతో పాటు మరి కొందరి అనుచరులపై కేసులు నమోదుచేయనున్నారు. త్వరలో వీరిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Next Story