ఆంధ్రప్రదేశ్ లోని ముప్పాళ్ల గ్రామం సామాజిక న్యాయంలో ముందుంది. అందుకే ఆ గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఈ పురస్కారంతో ముప్పాళ్ల నేడు మురిసిపోతోంది.
అభినందనలు అందుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయాలంటే అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం తోడు ఉండాలి. అవి అందిపుచ్చుకున్నారు ఓ పంచాయతీ కార్యదర్శి. కేవలం కష్టపడి పనిచేస్తేనే అభినందనలు రావు, పురస్కారాలు అసలు రావు. చేసిన పనిని చెప్పుకోవడం కూడా తెలియాలి. అప్పుడే గుర్తింపు లభిస్తుంది. ఈ రోజుల్లో చేసిన పనిని చెప్పుకోవాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరి. అప్పుడే అనుకున్నది సాధించేందుకు వీలు కలుగుతుంది. ప్రతి సంవత్సరం దేశంలో కొన్ని గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. ఈ అవార్డులు ఆ పంచాయతీ చేసిన పనికి గుర్తింపుగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అటువంటి గ్రామ పంచాయతీలు లేవా.. అంటే ఎందుకు లేవు.. చాలా ఉన్నాయి. బాగా అభివృద్ధి చెందిన పంచాయతీలు ఉన్నాయి. అయినా కొన్ని పంచాయతీలకే అవార్డులు వస్తున్నాయి. ఎందుకని? ఒకసారి ప్రశ్నించుకుంటే ప్రతి దాని గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా పంచాయతీలకు కేంద్రం ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది. దేని ద్వారా ఇస్తుంది. అందుకు తామేమి చేయాలనేది పంచాయతీ సర్పంచ్ లు, కార్యదర్శులకు తెలిసి ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించేందుకు వీలు ఉంటుంది.
నేషనల్ పంచాయతీ రాజ్ వెబ్ సైట్ లో నేషనల్ పంచాయత్ అవార్డ్ విభాగం ఉంటుంది. అందులో అవార్డులకు సంబంధించిన విభాగాలు ఉంటాయి. ఏ విభాగాల్లో బాగా పనిచేశామని పంచాయతీ వారు భావిస్తారో ఆ పంచాయతీ ఆ విభాగానికి సంబంధించిన వివరాలు పొందు పరచాలి. ప్రభుత్వం అడిగిన ప్రతి వివరాన్నీ పొందు పరచాల్సి ఉంటుంది. మొత్తం 9 థీమ్ లు ఉంటాయి. ఒక్కో థీమ్ కు సంబంధించి 144 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు పంచాయతీ వారు సమాధానం ఇవ్వాలి. వెబ్ సైట్ లో వారే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పోర్టర్ లో వివరాలు నమోదు చేస్తే అప్పుడు కేంద్రం నుంచి ఒక టీమ్ పంచాయతీలో ఫీల్డ్ విజిట్ కు వస్తుంది. ఈ విజిట్ లో పంచాయతీ వారు వెబ్ సైట్ లో పొందు పరిచిన వన్నీ నిజమేనని వారు సంతృప్తి చెందితే అప్పుడు రెకమెండ్ చేస్తారు. ఈ రెకమెండేషన్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలన జరిగిన సచివాలయానికి వస్తుంది. అక్కడ వారు పరిశీలించి కేంద్ర ఆమోదానికి పంపిస్తారు.
ఈ టెస్ట్ లు అన్నింటిలోనూ ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామం పాసైంది. దీనంతటికీ అక్కడ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి మాదా సాయిరాం కారణం. ఆయనకు ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ తో ముందుకు అడుగులు వేశారు. పంచాయతీలో చేస్తున్న ప్రతి పనినీ బాగా గమనించి ‘సామాజిక న్యాయం సామాజిక భద్రత’ అనే అంశాన్ని తీసుకుని తమ పంచాయతీలో అమలు జరుగుతున్న తీరును వివరించారు. అవన్నీ పరిశీలించిన తరువాత కేంద్ర బృందం కూడా ఆశ్చర్య పోయింది. ప్రతి విషయంలోనూ పంచాయతీ కార్యదర్శి ఎంత శ్రద్ధ తీసుకున్నారో కేంద్ర బృందానికి అర్థమైంది.
బెస్ట్ పంచాయతీ ఎంపిక కూడా స్కోర్ ఆధారంగా జరుగుతుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ముప్పాళ్ల పంచాతీకి సామాజిక న్యాయం, భద్రత విషయంలో మంచి స్కోర్ వచ్చింది. పరిశీలన తరువాత తొమ్మిది గ్రామ పంచాయతీల్లో జాతీయ స్థాయిలో సామాజిక అంశాలపై ప్రథమ స్థానంలో ముప్పాళ్ల నిలిచింది. ఒక్కో థీమ్ లో మూడు పంచాయతీలను ఎంపిక చేస్తారు. అందులో మొదటి స్థానం ముప్పాళ్ల దక్కించుకోగలిగింది. ఉదాహరణకు సామాజిక పెన్షన్ ల అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే పెన్షనర్స్ లో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వ్యాధి గ్రస్తులు ఇలా రకరకాల వారికి ఫెన్షన్ లు ప్రభుత్వం ఇస్తోంది. పెన్షన్ తీసుకుంటున్న వారు దేనికి ఆ డబ్బును వాడుకుంటున్నారు. పెన్షన్ లపై ఎంతవకు ఆధార పడుతున్నారు. ఈ డబ్బును ఎలా వాడుకుంటే మంచిదని పంచాయతీ తరపున చెప్పటంలోనూ సఫలం కావడం వంటి అంశాలు ఉంటాయి. ఇంక అంగన్ వాడీని పరిగణలోకి తీసుకుంటే గర్భిణిలు, బాలింతలు, పిల్లలు, ఎంత మంది ఉన్నారు. వారికి సకాలంలో పౌష్టికాహారం అందుతోందా? అందితే అది ఎటువంటి ఆహారం, ప్రభుత్వం ఇస్తున్న పౌష్టికాహారం సరైన మార్గంలో సెంటర్లకు వచ్చే వారు ఉపయోగించుకుంటున్నారా? అంగన్ వాడీ సెంటర్లోనే తింటున్నారా? ఇంటికి తీసుకెళుతున్నారా? ప్రభుత్వం ఇస్తున్న గుడ్లు, ఇతర నిత్యావసరాలు, మెనూ ప్రకారం అందుతున్నాయా? లేదా? పిల్లలకు, తల్లులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందుతున్నాయా? అందితే ఏ విధంగా అందుతున్నాయి. ఏఎన్ఎం సేవలు ఎలా ఉంటున్నాయి. ఇలా అన్ని కోణాల్లో ప్రభుత్వానికి వివరించాల్సి ఉంటుంది.
ఇక పంచాయతీలో విద్య విధానం ఎలా ఉంది. ఎలా అమలు జరుగుతోంది. స్కూళ్లలో మధ్యహ్నా భోజనం ఎలా ఉంటోంది. అందులో పోషకాలతో కూడిన కాయకూరలు, ఇతర పదార్థాలు ఉంటున్నాయా? అనే వివరాలు కూడా ప్రభుత్వానికి తెలపాలి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్, అగ్రికల్చర్ ఇలా ప్రతి పథకం గ్రామ పంచాయతీ పరిధిలో అమలు జరుగుతున్న తీరు, అందరికీ అందుబాటులో ఉన్న తీరు, సమన్యాయం ఉందా? లేదా? అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎన్ఆర్ఈజీఎస్ లో జాబ్ కార్డులు అర్హులైన అందరికీ ఉన్నాయా? లేవా? లేకుంటే ఎందుకు లేవు. వారికి ఎలా అందించాలి. వెనుకబడిన వారిని అందరితో సమానంగా ఎలా ముందుకు తీసుకు రావాలి. అనే అంశాలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలు కూడా వివరించాలి.
పంచాయతీలో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఎలా ఉంది. రోడ్లు బాగున్నాయా లేవా? నిరుపేదల పరిస్థితి ఏమిటి? వారికి ప్రభుత్వ పథకాలు ఎంత శాతం అందుతున్నాయి. వైద్య సేవలు ఎలా ఉన్నాయి. ప్రభుత్వం తరపున వెంటనే స్పందిస్తున్నారా? మేజర్ ఇష్యూ అయితే వెంటనే పట్టణాల్లోని వైద్య శాలకు రెఫర్ చేస్తున్నారా? ఇలా ప్రతి అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. సామాజిక న్యాయం విషయంలో ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నారని, అందరికీ సమానావకాశాలు ఉన్నాయనే విషయం వివరించడంలో పంచాయతీ కార్యదర్శి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. స్వయం ఉపాధి సంఘాలు కూడా బాగా పనిచేస్తున్నాయి. స్కిల్ వర్కర్లు కూడా ఉన్నారు. రకరకాల బ్యాంకు లోన్స్, కేంద్రం నుంచి ముద్ర లోన్స్ తీసుకుని చెల్లించడం, తద్వారా మంచి లాభాలు ఆర్జించి కుటుంబాన్ని పోషించుకోవడంలో కూడా ఈ గ్రామం ముందంజలో ఉంది. వెలుగు పథకం ద్వారా గొర్రెలు, మేకలు, గేదెలు, కోళ్లు వంటి యూనిట్లు తీసుకుని బాగా స్థిర పడిన వారు ఉన్నారు. ఇలా సుస్థిరాభివృద్ధిని సాధిస్తేనే కాని అవార్డుకు ఎంపికయ్యే అవకాశం లేదు.
పంచాయతీలో ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి. సర్వమత సమ్మేళనం ఉందా? గ్రామంలో ఏ దేవతలకు పూజలు చేస్తారనే విషయాలు కూడా పంచాయతీ తరపున వివరించారు. విజయవాడకు కనక దుర్గమ్మ ఎలాగో ముప్పాళ్లకు ముప్పాళ్లమ్మ తల్లి అలా ఉంటుంది. గ్రామస్తులంతా కనకదుర్గమ్మ మాదిరి ముప్పాళ్లమ్మ తల్లిని ఆరాధిస్తారు. పూజిస్తారు. భక్తితో వారు చేసే పూజలు అక్కడికి వెళ్లే వారిని ఆకట్టుకుంటాయి. పంచాయతీలో సొంత కాళ్లపై నిలబడిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. లారీలు, బస్ లకు సంబంధించి స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి బాడీ తయారు చేసే పరిశ్రమ ఈ గ్రామంలో ఉంది. దీని పేరు AMBA Bus కోచ్. ప్లేవుడ్ తయారీ పరిశ్రమ కూడా ఉంది. తలుపులు కూడా తయారు చేస్తారు.
2024 సంవత్సరానికి ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్’ పురస్కారాల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన జాతీయ పంచాయతీ రాజ్ అవార్డును చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామ పంచాతీ అందుకోనుంది. సామాజిక న్యాయం, సామాజిక భద్రత అనే అంశంపై ఈ అవార్డు పంచాయతీకి దక్కింది. పంచాయతీలో మొత్తం 1687 గృహాలు, 5877 మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడి రైతులకు సాగు నీరు అందదు. ఎక్కువగా వర్షాధారంపైనే ఆధార పడతారు. వ్యవసాయ కూలీలు కూడా ఎక్కువగానే ఉన్నారు. వాణిజ్య, ఉద్యాన పంటలకు ఇక్కడి వారు ప్రాధాన్యత ఇస్తారు. మెట్ట పంటలు కావడంతో ఇక్కడ చాలా ఏళ్ల నుంచి సుబాబుల్ పంట ఎక్కువగా పండిస్తున్నారు.
ముప్పాళ్ల పంచాయతీ తమకు దక్కిన పురస్కారాన్ని ఈనెల 11న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పంచాయతీ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ అందుకుంటారు. దేశంలో మొత్తం 45 గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తుంటే ఆ పంచాయతీల్లో 17 పంచాయతీలకు మహిళలే సర్పంచ్ లుగా ఉన్నారు. పలు కీలక రంగాల్లో సాధించిన విజయాలకు గుర్తుగా ఈ పురస్కారాలను ప్రభుత్వం అందిస్తోంది.