గత మూడు రోజుల నుంచి కురుస్త వర్షాలకు విజయవాడ అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతలు జలమయమయ్యాయి. సన్నద్దత లేక పోవడమే దీనికి ప్రధాన కారణం. మురుగు నీటి పారుదల వ్యవస్థను మెరుగు పరచడంలో వైఫల్యం చెందారు.


ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం విజయవాడ నగర ప్రజలకు శాపంగా మారుతోంది. వర్షాలు వచ్చిన ప్రతి సారి నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. చిన్న పాటి వర్షం పడినా డ్రెయిన్లు ముంచెత్తుతున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడమే వరదలకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మురుగు నీటి పారుదలపై దృష్టి సారించడం లేదు. వరదల నుంచి లో తట్టు ప్రాంతాలను ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేయడం లేదు. డ్రైనేజీల నిర్వహణ సరిగా చేపట్టక పోవడం, పూడికలు తీయక పోవడం, చెత్త చెదారాలను తొలగించక పోవడంతో కొద్ది పాటి వర్షానికే పొంగి పొర్లుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తుండంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగి పోయాయి.

అజిత్‌సింగ్‌ నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, పైపుల రోడ్డు, పాయకాపురం వంటి ప్రాంతాలైతే పూర్తిగా నీట మునిగాయి. నడుముల్లోతులో నీరు పారుతోంది. ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. వస్తువులన్నీ నీటి ముద్దయ్యాయి. కనీసం పాల ప్యాకిట్‌ కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయిందని పాయకాపురానికి చెందిన దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఇంత వరకు ప్రభుత్వం స్పందించ లేదు. సహాయక చర్యలు చేపట్ట లేదు. అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ వచ్చింది లేదు. భరోసా ఇచ్చింది లేదని పైపుల రోడ్డుకు చెందిన ప్రసాద్‌ తెలిపారు.

మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు బుడమేరు కట్ట తెగి పోవడం కారణంగా పాతరాజేశ్వరిపేట, కొత్త రాజేశ్వరి పేట, జక్కంపూడి కాలనీ, దాబాల కొట్టు సెంటర్, పైపుల రోడ్డు, ప్రకాష్‌ నగర్, కండ్రిగ, రాజీవ్‌ నగర్, నున్న వంటి పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీటితో పాటు సింగ్‌నగర్, నందమూరినగర్, ఆంధ్రప్రభ కాలనీ, అంబాపురం, ఎల్‌బిఎస్‌ నగర్, శాంతినగర్, పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లల్లోని వరద నీరు వచ్చి చేరడంతో బయటకు వచ్చేందుకు కూడా వీల్లేకుండా పోయింది. వేసుకునేందుకు బట్టలు కూడా లేకుండా పోయాయి. ఈ ప్రాంతపు ప్రజలకు సత్వరమే ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టి ఆదుకోవాలని సీపీఎం సిటీ సెంట్రల్‌ కమిటీ నాయకుడు కే దుర్గారావు, సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రెసీ విజయవాడ నగర కార్యదర్శి రవిచంద్రలు ప్రభుత్వాన్ని కోరారు.
వర్షపు నీరు వల్ల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 2015లో నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం స్ట్రోమ్‌ వాటర్‌ డ్రైనేజీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. రూ. 462 కోట్లతో 424కిలోమీటర్ల మేరక చిన్న, పెద్ద డ్రైనేజీ కాల్వల పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఇది కూడా పూర్తి కాలేదు. నేటికీ అసంపూర్తిగానే మిగిలి పోయింది. బిల్లుల వ్యవహారంలో పెండింగ్‌ పడటంతో మధ్యలో ఆ సంస్థ చేతులెత్తేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టింది లేదు. దీంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
విజయవాడ నగరంలో చిన్నా, పెద్ద డ్రెయిన్లు కలిపి 1237 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్‌ డ్రైన్లే. 2007లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేశారు. రూ. 175 కోట్లతో పనులు చేపట్టారు. అయితే అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదనే విమర్శలు ఉన్నాయి. దాదాపు 16లక్షలకుపై జనాభా కలిగిన నగరంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో డ్రైనేజీ కనెక్షన్లు లేవు. 1.01 ఇళ్లకు మాత్రమే అండర్‌ డ్రైనేజీ కనెక్షన్లు కలిగిన ఇళ్లు ఉన్నాయి. 1.09 ఇళ్లకు ఇంత వరకు అండర్‌ డ్రైనేజీ కనెక్షన్లు లేవు.చాలా ఇళ్లకు ఓపెన్‌ డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. ఇలా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పోవడం కారణంగా చిన్న పాటి వర్షాలకే ఆయా ప్రాంతాల్లో ఇళ్లల్లోని నీరు వచ్చి చేరుతోందని బెంజి సర్కిల్‌కు చెందిన ఉమామహేశ్వరరావు చెప్పారు.
నగరంలో ఉన్న పెద్ద పెద్ద ఓపెన్‌ డ్రెయిన్లకు కూడా పై కప్పులు వేయడంలోను మునిసిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం వైఫల్యం చెందింది. ప్రజా ప్రతినిధులు కూడా ఆ దిశగా అడుగులు చర్యలు చేపట్టడంలోను ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా వరదల సమయంలో కాల్లల్లో పడి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని ఉమామహేశ్వరరావు చెప్పారు.
విజయవాడ నగరంలో మరో మూడు ప్రధాన కాలువలు ప్రవహిస్తున్నాయి. బందరు కాలువ, ఏలూరు కాలువ, రైవస్‌ కాలువలు ప్రవహిస్తున్నాయి. వీటి మరమ్మతులు చేపట్టక పోడం, పూడికలు తీయక పోవడం, గుర్రపుడెక్క వంటి చెత్త చెదారాలను తొలగించడం, నీరు ప్రవహించేందుకు అనుకూలంగా ఉండే విధంగా మరమ్మతులు చేపట్టడంలోను ప్రభుత్వాలు, మునిసిపల్‌ యంత్రాంగం విఫలమవుతున్నాయి. కనీసం వర్షా కాలానికి ముందు అంటే వేసి కాలంలోనే అటు మూడు కాల్వలను, ప్రధాన డ్రెయిన్లను, డ్రైనేజీ వ్యవస్థను మరమ్మతు చేపట్టి సిద్ధం చేసుకోవడంలో ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు. దీంతో వర్షా కాలంలో వరదలు తప్పడం లేదు. కృష్ణా తీరం వెంబడి రీటైనింగ్‌ వాల్‌ ఉంది కాబట్టి వరద మంపు చాలా వరకు తగ్గింది. లేకుంటే వరద ప్రమాదం పెద్ద ఎత్తున ఉండేది.
ఎన్నడు లేని విధంగా ఈ సారి వరదలకు విజయవాడ అతలాకుతలమైంది. 2005లో విజయవాడకు వరద ప్రమాదం చోటు చేసుకున్నా, ఈ స్థాయిలో మాత్రం ముంపునకు గురి కాలేదని నగర వాసులు చెబుతున్నారు. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌తో పాటు వన్‌టౌన్, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్, శివారు ప్రాంతాలు దాదాపు నీట మునిగాయి. భవానీపురం, ఐదో నంబరు రోడ్డు, పాలీక్లీనిక్‌ రోడ్డు, నిర్మల కాన్వెంట్, బెంజిసర్కిల్‌ వంటి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు నిలచిపోయింది.
Next Story