ఏపీ పోలీసులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దళిత నాయకుడిని బట్టలు ఊడదీసి సెల్ పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజమండ్రికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ దళిత నాయకుడుని పోలీసులు వేధింపులకు గురి చేశారు. బాధితుడు పులి సాగర్, తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి మాజీ ఎంపీ మార్గాని భరత్ సోమవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం భరత్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ నాయకుడు పులి సాగర్‌ను రాజమండ్రిలో బట్టలు ఊడదీసి సెల్ పెట్టారని మండిపడ్డారు. పులి సాగర్ వేధింపుల విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో కలిసి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీటిపైన స్పందించిన కమీషన్లు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పులి సాగర్‌ను సెల్‌లో పెట్టి ఒక మహిళా కానిస్టేబుల్ సమక్షంలో అమానుషంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించినందుకు పులి సాగర్‌ను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. ఇన్‌స్పెక్టర్ బాలాజీ పోలీసు స్టేషన్‌కు రమ్మంటే వెళ్లానని, సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులను ప్రశ్నిస్తూ బూతులు తిట్టారని పులి సాగర్ చెప్పారు. ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదల సమయాల్లో నీటిని తొలగించామని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పెట్టిన పోస్టును ప్రశ్నిస్తూ, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ తిరిగి తాను సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు తనను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి బట్టలిప్పి బూతులు తిడుతూ కొట్టి సెల్‌లో వేశారని పులి సాగర్ ఆరోపించారు. రాత్రి 9 గంటల సమయంలో తనను బయటకు తీసుకొచ్చి, బలవంతంగా భయబ్రాంతులకు గురి చేస్తూ సంతకం పెట్టించుకొని విడిచిపెట్టారని విమర్శించారు.