బ్రహ్మోత్సవ వేళ శ్రీవారి చెంత... సీఎం చంద్రబాబు పుట్టిన రోజు@ 21
సీఎం చంద్రబాబు వయసెంత. ఆయనకు 74 ఏళ్ల? 21 సంవత్సరాలా? ఇందులో ఏది కరెక్ట్..! ఆయన పునర్జన్మకు చారిత్రక నేపథ్యం ఉంది. అదేంటో చూద్దామా..
సీఎం చంద్రబాబు వయసు తగ్గింది. ఆయన యవ్వనుడయ్యారు. ఏంటి ఈ మాటలు అనుకుంటున్నారా? వినడానికి చదవడానికి విడ్డూరంగా ఉన్న.. ఇది వాస్తవం.. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఇంకొద్ది సేపట్లో తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబుకు ఈ భాగ్యం దక్కడం వెనుక... బ్రహ్మోత్సవాలకు విడదీయలేని అనుబంధం ఉంది.
తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకరు.1978 లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన 1950 ఏప్రిల్ 20వ తేదీ చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఈ లెక్కన ఆయన వయసెంత అనేది ఇట్టే చెప్పేయవచ్చు. కానీ, ఆయనకు పునర్జన్మ కూడా లభించింది. అది పరిగణలోకి కూడా తీసుకోవలసిన అవసరం ఉంది. దానికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది.
ఈ పరిస్థితుల్లో ఎన్. చంద్రబాబు వయసెంత 74 సంవత్సరాలా? 21 ఏళ్ల ? అనేది పాఠకులే నిర్ణయించాలి. ఎందుకంటే, పల్లెలో జన్మించిన చంద్రబాబు కుటుంబానికి శ్రీవెంకటేశ్వరస్వామి ఇష్టమైన దైవం. ఇదే విషయాన్ని చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్రస్తావించిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు.
నారావారిపల్లిలో జన్మించిన చంద్రబాబుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా పునర్జన్మ ప్రసాదించారు. ఈ విషయాన్ని కూడా చంద్రబాబే స్వయంగా చెప్పారు. అది వాస్తవం కూడా.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన వేళ ఇది సందర్భోచితం.
ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు.. చంద్రబాబుకు పునర్జన్మ లభించడానికి విడదీయలేని అవినాభావ సంబంధం ఉంది. ఆయనకే కాదు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదవలవాడ కృష్ణమూర్తికి కూడా. చంద్రబాబుతో పాటు చదవలవాడ కూడా పునర్జన్మ పొందిన వ్యక్తి కావడం ప్రస్తావనార్హం. వీరితో పాటు అదే వరం పొందిన శ్రీకాళహస్తి సీనియర్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పూర్వ పుత్తూరు మాజీ ఎమ్మెల్యే రెడ్డి వారి రాజశేఖర్ రెడ్డి (వారిద్దరూ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు) పునర్జన్మ పొందిన ఆనాటి రోజులను ఒకసారి స్పందిద్దాం.
అది 2003 అక్టోబర్ 1
యథావిధిగా ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబు సీఎంగా ఎంపికయ్యారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అంకురార్పణ రోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన బయలుదేరారు. తిరుపతిలో మూడు కార్యక్రమాలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు చివరగా, అలిపిరికి సమీపంలోని స్విమ్స్ (శ్రీ వెంకటేశ్వర ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో భవనాలను ప్రారంభించిన ఆయన
తిరుమలకు బయలుదేరారు. అప్పుడు వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన సీఎం చంద్రబాబు కూర్చున్నారు. వెనుక సీట్లు అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదవాలవాడ కృష్ణమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, మంత్రి బొజ్జల గోపాల రెడ్డి, పుత్తూరు ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి కూర్చున్నారు. వారి ముగ్గురికి పాత పరిచయం అనుబంధం ఉన్న కారణంగా ముచ్చట్లు చెప్పుకుంటూ అలిపిరి టోల్గేట్ దాటారు.
ఆ తర్వాత తిరుమల మార్గంలో ఎడమ పక్క ఉన్న ఆంజనేయస్వామి చిన్న ఆలయానికి చంద్రబాబు నమస్కరించుకున్నారు. కొద్ది దూరం వెళ్ళగానే ఎడమ చేతి మలుపు తిరిగే సమయంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి. అంతే, సీఎం చంద్రబాబు పయనిస్తున్న ఎంబాసిడర్ కారు కొన్ని అడుగుల మేరకు గాలిలో లేచి అమాంతం కుడివైపు రాతి కట్టడానికి పడిపోయింది. సీఎం చంద్రబాబు టార్గెట్ గా నక్సలైట్లు (మావోయిస్టులు) అమర్చిన క్లెమోర్ మైన్లు పేలాయి.
ఒకే ఉత్కంఠ..
అప్పటికే రోడ్ ఓపెనింగ్ పార్టీ పోలీస్ వాహనాలు ముందు వెళ్లిపోయాయి. షాడో సెక్యూరిటీ సిబ్బంది వెనుక వాహనాల్లో ఉన్నారు. ఊహించని విధంగా జరిగిన పేలుడు దాటికి మొత్తం కాన్వాయ్ లో ఉన్న అధికార అధికారులందరూ బెంబేలెత్తిపోయారు. వెంటనే తేరురుకున్న సెక్యూరిటీ సిబ్బంది వాహనాన్ని చుట్టుముట్టారు. ఇప్పటికే అర కిలోమీటర్ మేరకు పెద్దపెద్ద రాళ్లతో కూడిన దుమ్ము ఆకాశం నుంచి వర్షంలో కురుస్తూనే ఉంది. గాయాలతో కారులో చిక్కుకున్న సీఎం చంద్రబాబు తో సహా కారులో వెనుక ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను సెక్యూరిటీ సిబ్బంది అతికష్టంపై వెలుపలికి తీశారు.
సీఎం కాన్వాయ్ లోని అంబులెన్స్ లో చంద్రబాబుతో సహా గాయపడిన మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వెంటనే స్విమ్స్ ఆసుపత్రికి చంద్రబాబుతో సహా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా తరలించారు. ఈ విషయం క్షణాల వ్యవధిలో తిరుమలతో పాటు రాష్ట్రమంతా వ్యాపించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏమి జరిగిందో అనే విషయం తెలియక మల్ల గులాలు పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులు తిరుపతి సిమ్స్ ఆస్పత్రిలోనే చికిత్స చేసిన వైద్యులు, ఆ తర్వాత చంద్రబాబును ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు.
చేదు ఘటన
"అది మరిచిపోలేని సంఘటన" అని స్విమ్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివ శంకర్ వ్యాఖ్యానించారు. ఈయన సోదరుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు తోపాటు చంద్రబాబు కూడా సన్నిహితంగా ఉండేవారు.
"విమానంలో కూడా చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా హైదరాబాద్ కు చేర్చడానికి బాగా టెన్షన్ పడ్డాను" శివశంకర్ 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఆసుపత్రిలోనే మూడు రోజులు ఉండి చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడ్డాక, తిరుపతికి తిరిగి వచ్చాను. అది తలుచుకుంటే ఇప్పటికీ శరీరం గగుర్పొడుస్తుంది" అని డాక్టర్ శివశంకర్ తన అనుభవాలను పంచుకున్నారు.
అదృష్టం అన్నీ పేలలేదు..
అప్పటి సీఎం చంద్రబాబు లక్ష్యంగా నక్సలైట్లు ( మావోయిస్టు) లే క్లేమోర్ మైన్స్ అమర్చారు. "సీఎం కాన్వాయ్ ముందు అడ్వాన్స్ పైలెట్ వాహనంలో నేను ఉన్నాను" అని ఆనాటి సీఎం కాన్వాయ్ రోడ్ ఓపెనింగ్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న సీఐ అంజూ యాదవ్ తన భావాలను అనేక సందర్భాల్లో మీడియాతో పంచుకున్నారు.
"పేలుడు శబ్దం వినిపించడం . కాన్వాయ్ ఆగిపోయింది. వెంటనే వాహనం దిగాను. నా దగ్గర వెపన్ ఉంది" సీఎం వాహనం వద్దకు పరిగెత్తే సమయంలో ఆనాడు తనతో ఉన్న మదనపల్లి హెడ్ కానిస్టేబుల్ గోపాల్ నా నుంచి పిస్టల్ కూడా బలవంతంగా లాక్కున్నారు" అని ఆనాటి అనుభవాలను ఓ సందర్భంలో మీడియా ఇంటర్వ్యూ లో అంజూయాదవ్ పంచుకున్నారు. తలుచుకుంటే ఇప్పుడు కూడా చేతిపై రోమాలు నిక్కపొబొచుకుంటాయి" అని అన్నారు. ఆ సంఘటన జరిగిన వెంటనే "ఒక పోలీస్ అధికారిగా నా కర్తవ్యాన్ని నిర్వహించాలని చూశాను. కానీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం గగుర్పాటు వస్తుంది" అని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
హూందా రాజకీయం... వైఎస్ఆర్ ధర్నా..
ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన వ్యక్తి దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి. హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్న ఆయన.. " సీఎం చంద్రబాబు పై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి" అని తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అప్పటి రాజకీయాల్లో హూందాతనానికి ఇది నిదర్శనం. కలుపుగోలుతనం, అంతకంటే ప్రధానంగా చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా వైఎస్సార్ ను కదిలించింది" అనేది రాజకీయ విమర్శకులు సైతం చెప్పిన మాట. ఇదిలావుంటే..
నిలువుదోపిడీ...
నక్సలైట్ అమర్చిన దాడిలో తీవ్రంగా గాయపడిన సీఎం చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడింది. తన భార్య భువనేశ్వరితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం తర్వాత, హుండీలో కానుకలు సమర్పించే సమయంలో నిలువు దోపిడీ ఇచ్చారు. "తమ శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదుతో సహా స్వామి వారికి సమర్పించారు. చివరికి నారా భువనేశ్వరి తన మెడలోని మంగళసూత్రం కూడా హుండీలో కానుకగా సమర్పించారు."
అదే సమయంలో సీఎం చంద్రబాబు మళ్లీ నారా భువనేశ్వరికి మంగళసూత్రధారణ చేశారు.
ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, "శ్రీ వెంకటేశ్వర స్వామి వల్ల నాకు మళ్ళీ పునర్జన్మ లభించింది. ఆయన దయ కృప ఉన్నందువల్లే నేను బతికి బట్ట కట్టాను. వెంకటేశ్వర స్వామి ప్రసాదించిన వరం అని" వ్యాఖ్యానించారు
సీన్ కట్ చేస్తే.
మళ్లీ 21 సంవత్సరాల తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి కొన్ని గంటల్లో (2024 అక్టోబర్ 4) తిరుమల కు రానున్నారు.
2014- 19లో అధికారంలో ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఐదేళ్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
2024: ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి సీఎం చంద్రబాబు తిరుమలలో ఈ సాయంత్రం స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ముక్తాయింపు:
టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో నాలుగోసారి సీఎం హోదాలో ఉన్నారు. ఇప్పటివరకు ఆయనపై అనేక అభియోగాలు నమోదయ్యాయి. కొన్ని విచారణ దశలో వీగిపోగా, ఇంకొన్ని పెండింగ్లో ఉన్నాయి అందులో ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వం నమోదు చేయించిన "స్కిల్ డెవలప్మెంట్" కేసు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా నమోదైన కేసు ఇది. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఈయనపై నమోదైన కేసులు ఏవీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలో లేవు. కానీ,
మత రాజకీయాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమల లడ్డు వ్యవహారం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రపంచానికి చెప్పారు. ఇది వివాదాస్పదం కావడం వల్ల సుప్రీంకోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పులో సీబీఐతో పాటు రాష్ట్ర ఆధీనంలోని అధికారులు కూడా దర్యాప్తు సంస్థలో ఉంటారు. అంటే, ఒకవిధంగ ప్రధాని నరేంద్రమోదీ చేతిలోకి వెళ్లినట్లే. ఎన్డీఏలో కూడా టీడీపీ. జనసేన కీలక భాగస్వామిగా ఉంది. లడ్డు వ్యవహారంలో విచారణ నివేదిక ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఈ కేసులో దర్యాప్తు నివేదిక వ్యతిరేకంగా ఉంటే మాత్రం.. ప్రధాని నరేంద్ర మోడీ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో..
సీఎం చంద్రబాబును అలిపిరి వద్ద 21 ఏళ్ళ కిందట పేలిన క్లేమోర్ పేలుళ్ల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కాపాడారు. లడ్డూ వ్యవహారంలో స్వామివారి కటాక్షం సీఎం చంద్రబాబుపై ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
Next Story