వైద్యం వ్యాపారమైంది. దానికి కులం తోడైంది. ఈ రెండూ కలిసి ఒక గొప్ప వైద్యుడి కుటుంబాన్ని బలి తీసుకున్నాయి.


అతను ఒక సాధారణ సుగాలి కుంబం నుంచి వచ్చారు. కష్ట నష్టాలను ఓర్చి వైద్య విద్యను అభ్యశించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఆర్థోఫెడిక్‌ డాక్టర్‌గా మంచి పేరు సంపాదించారు. తానే స్వయంగా ఒక ఆసుపత్రి పెట్టి వైద్యం చేయాలనుకున్నారు. అది ఆయన కుటంబానికి ఉరి తాడైంది. కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది.

ఎవరినైతే నమ్మి.. వారి సలహాలు.. సూచనలు తీసుకున్నారో, వారే తాను కట్టించిన ఆసుపత్రిపై షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టినట్టు ఏకంగా 80 శాతం భాగస్వామ్యం రాయించుకొని తన ఆసుపత్రిలో తననే జీతానికి పని చేయాలనే స్థితికి ఆ వైద్యుడిని తీసుకొచ్చారు. దీనిని తట్టుకోలేక మనసు వికలమైన ఆ వైద్యుడు తల్లి, భార్య, పిల్లల కుతిక నరాలు కట్‌ చేసి చంపి తాను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆంధ్రరాష్ట్రంలో సంచలనమైంది.
పక్కా కమర్షియల్‌గానే స్కెచ్‌..
విజయవాడ నగరంలో ఆసుపత్రులు పక్కా వ్యాపారానికి కేంద్రాలుగా మారాయి. ఎవరైనా ఎంతో కొంత మనసు పెట్టి వైద్యం చేయాలని భావిస్తే వారిని వెంటనే వ్యాపార వేత్తలు మార్చేస్తారు. అవసరమైతే వారి ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కూడా ఇవ్వరు. వైద్యమంటే తెలియని వారు ఆసుపత్రులను పెట్టి జీతాలకు డాక్టర్లను పెట్టుకొని వైద్య రంగాన్ని పక్కా కమర్షియల్‌ రంగంగా మార్చారంటే ఏ విధమైన వైద్య సేవలు విజయవాడలో అందుతున్నాయో అర్థమవుతుంది.
ఆసుపత్రిని కొట్టేయడానికి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేలా చేశారు
ఎవరినైతే నమ్మి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారో ఆ ఆసుపత్రుల వారే ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్‌ ధరావత్‌ శ్రీనివాస్‌ను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేలా చేశారు. నిదానంగా వారు అనుకున్న ప్లాన్‌ ప్రకారం బ్యాంకులోన్‌ విషయంలో నెలకు రూ. 10 లక్షలు బ్యాంకుకు వాయిదా చెల్లించాల్సి ఉంటే ప్రతి నెల రూ. 30లక్షలు చెల్లించాలని బ్యాంకు నుంచి ఒత్తిడి పెంచేలా చేశారు. బ్యాంకు రుణం వాయిదా పోను, రూ. 10 లక్షలు ఉద్యోగులకు జీతాలివ్వడం ద్వారా ఆసుపత్రి మెయింటెనెన్స్‌ చేస్తున్నారు. ఏడు మాసాల క్రితం విజయవాడలో సొంతంగా ప్రారంభించిన శ్రీజ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి మెల్లగా పలువురి మన్నన్నలు పొందుతూ వచ్చింది. ప్రారంభం నుంచే శ్రీనివాస్‌ ఆసుపత్రిపై కన్నేసి, ఆయనకు మిత్రులుగా నటిస్తున్న కొందరు శ్రీనివాస్‌ పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయినట్లు బ్రమ కల్పించి ఆసుపత్రిని మెయింటెనెన్స్‌ చేయలేను అనే మానసిక స్థితికి శ్రీనివాస్‌ను తీసుకెళ్లారు. తర్వాత షేర్లకు వెల్దామని వాళ్లే సూచించి ఆ షేర్లల్లో 80 శాతం వారే దక్కించుకున్నారు. తీరా విషయం తెలుసుకుంటే నన్ను ఆదరిస్తున్న వారే మోసం చేశారని తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టమంతా జరిగి పోయింది. దీంతో శ్రీనివాస్‌ కుంగి పోయారు.
బ్యాంకు నుంచి తీసుకున్నది రెండున్నర కోట్లే..
ఆసుపత్రి నిర్మాణ సమయంలో బ్యాంకు నుంచి అప్పుగా తీసుకున్నది సుమారు రూ. 2.50కోట్లు. అయితే బ్యాంకు స్టేట్‌మెంట్‌ను పోలీసులు తీసుకోవలసి ఉంది. ఇది పెద్ద రుణం అని చెప్ప లేము. ఎందుకంటే ఆసుపత్రి నిర్మాణానికే చాలా ఖర్చు పెట్టారు. పైగా ఆసుపత్రిలో పరికరాలు, ఇతర సదుపాల కోసం అధిక మొత్తంలోనే వెచ్చించారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి తన వద్ద ఉండే ఆస్తులను తనకా పెట్టారు. ఒక వేళ రుణం తీర్చక పోతే తాకట్టులో ఉన్న ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకోవచ్చు. తాను గురునానక్‌ కాలనీలో నిర్మించిన ఇల్లు కనీసం ఐదు కోట్లు చేస్తుందని బంధువులు చెబుతున్నారు. అలాంటప్పుడు బ్యాంకు నుంచి తీసుకున్నది పెద్ద రుణం ఎలా అవుతంది.
ఇది బ్యాంకు రుణంతో వచ్చిన సమస్య కాదు. ఆర్థిక భారం, అప్పులు అంత కంటే కాదు. అందరూ అనుకుంటున్నట్లు అప్పుల బాధే కుటుంబం అంతా విగత జీవులవడానికి కాణం కాదనేది కుటుంబ సభ్యుల మాట. నమ్మిన వారు నిలువు దోపిడీ చేస్తారని ఊహించని శ్రీనివాస్‌ తనకు జరిగిన అవమానంతో కూడిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు తనకంటూ ఎవ్వరూ లేరనే బాధ తన జీవితాన్ని ముగించేందుకు కారణమైంది.
విజయవాడలోనే వైద్య కన్సల్‌టెంట్‌గా వృత్తిని ప్రారంభించాడు..
వైద్యుడిగా వృత్తిని మొదలు పెట్టినప్పుడు ఎంజే నాయుడు ఆసుప్రతి, విజయా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోను చాలా కాలం కన్సల్టెంట్‌గా పని చేశారు. అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో సొంతంగా ఆసుపత్రి ఉంటే బాగుంటుందని భావించారు. ఆర్థోపెడిక్‌ డాక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నందు వల్ల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని పెట్టాల్సిన అవసరం లేదు. ఆర్థో ఆసుపత్రిగానే కొనసాగితే ఆయనకు ఇంకా మంచి పేరు రావడంతో పాటు గొప్ప వైద్యుడిగా పలువురు మనసుల్లో నిలచిపోయే వారు. కానీ స్నేహితలు స్వార్థపూరిత కుట్రలతో చేసిన చట్రంలో ఇరుక్కున్న డాక్టర్‌ శ్రీనివాస్‌ దాని నుంచి బయటకు రాలేక పోయారు. నేను నిర్మించిన ఆసుపత్రిలో ఉద్యోగం చేయడం కంటే ప్రాణం తీసుకోవడమే తప్ప వేరే మార్గం లేదని భావించారు. కొంత కాలంగా మానసిక ఒత్తిడికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
కుటుంబం అంటే ఎంతో ప్రేమ
శ్రీనివాస్‌కు భార్య ఉష, తొమ్మిదేళ్ల కుమార్తె శైలజ, ఐదేళ్ల కుమారుడు శ్రీహన్, 60 ఏళ్ల తల్లి రమణమ్మ ఉన్నారు. తండ్రి జమలయ్య నాయక్‌ పోలీస్‌ శాఖలో పని చేస్తూ పదేళ్ల కింద మరణించారు. సోదరుడు దుర్గాప్రసాద్‌ హైదరాబాద్‌లో న్యాయవాది. చెల్లెలు లక్ష్మికి వివాహం అయింది. వీరి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు. తాను చనిపోవడానికి ముందు.. తన కుటుంబం అంటే ఎంతో ప్రేమని, తాను చనిపోయిన తర్వాత వారిని చూసుకునే వారు ఎవరూ ఉండరని, అందుకే వారిని చంపేసి తాను చనిపోతున్నానని సెల్‌ ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేశారు.
గుర్తించేలోపే నష్టం జరిగింది..
విజయవాడ నగరంలోని సొర, బెస్ట్‌ ఆసుపత్రుల్లో ఉన్న తన స్నేహితులు తనను మోసం చేశారని గుర్తించారు. అప్పటికే కొందరు స్నేహితుల వద్ద విషయం చెప్పి బాధపడ్డారు కూడా. కులాధిపత్యంలో ఒక ఎస్టీగా నిలబడ లేక పోయారు. ఈ ఆసుపత్రిని స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు పన్నిన వారికి ఉన్న బలగం ముందు ఈయన బలం సరిపోలేదు. ఈ కుట్రలో భాగ స్వాములైన ఒకరిపై గతంలో పోలీసు కేసులు కూడా ఉన్నాయని సమాచారం. పైగా ఒక్కోక్కరికి రూ. 3 లక్షల చొప్పున జీతం ఇచ్చి పెట్టుకున్న నలుగురు వైద్యులు కుట్రదారుల మాటలు విని మానేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కావడంతో పేరున్న వైద్యులు లేకుంటే పేషంట్లు రారు. ఇలా అన్ని సమస్యలు ఒక్క సారిగా శ్రీనివాస్‌ను చుట్టు ముట్టడంతో దిక్కు తోచని స్థితిలోకి వెళ్లారు. ఆవేదనతో నేను లేకుంటే నా కుటుంబం ఏమవుతుందనే భయంతో తల్లి, భార్య, పిల్లలను చంపి తాను ఉరేసుకొని చనిపోవడం విజయవాడ వైద్య కుటుంబాల్లో ఇది మొదటి ఘటన.
Next Story