ఎన్నికల శంఖారావం ఉత్తరాంధ్ర వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోగించారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో జరిగిన సభకు భారీ స్థాయిలో జనం వచ్చారు.


స్వరంలో మార్పు వచ్చింది

వాళ్లందరూ ఒక్కటి, నాకు మీరున్నారు
మీరే నాసైన్యం, నా బలం
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ ప్రస్తావన లేకుండానే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించినట్లున్నారు. అందుకే కావొచ్చు భీమిలి నియోజకవర్గం సంగివలసలో జరిగిన సభలో వైఎస్సార్‌ పేరు ప్రస్తావించడం కానీ, ఆయన ఫొటోలు వేదికపై బ్యానర్లలో వేయించడం కానీ జరగలేదు. ఇది దేనికి సంకేతమో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. మేధావులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రతి వేదికపైన ఏదో ఒక సమయంలో ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని మాట్లాడే జగన్‌ స్వరం మారింది.
నాసైన్యం, బలం మీరే..
రానున్న ఎన్నికల్లో మీరే నాబలం, నాసైన్యం అంటూ వైఎస్సార్‌సీపీ నేత సీఎం వైఎస్‌ జగన్‌ జనం మధ్యకు దూసుకుపోతున్నారు. జగన్‌ చెల్లెలు షర్మిల ఒకవైపు నేను మాత్రమే వైఎస్సార్‌కు నిజమైన వారసురాలును అంటూ వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన తరువాత కార్యక్రమాలు చేపడుతున్నారు. అది ఏమైనా మనసులో ఉంచుకున్నారో ఏమో కాని జగన్‌ మాత్రం సంగివలస సభలో వైఎస్‌పేరును ప్రస్తావించలేదు.
ప్రతిపక్షాలన్నీ ఏకం..
జగన్‌ను ఎలాగైనా ఓడించాలనే ఆలోచనతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఎన్నికల శంఖారావం పూరించాయి. ప్రస్తుతానికి ఎవరికి వారు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. అయితే ఉమ్మడి వేదికపై ప్రచార కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించలేదు. వీరిద్దరూ బీజేపీతోనూ పొత్తు పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఇక కాంగ్రెస్‌తో కమ్యూనిస్టులు కలిసి ముందుకు సాగనున్నారు. ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వాములు కావడం వల్ల కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులు ఉంటున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచార విషయం ఇంకా చర్చకు రాలేదు. కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉమ్మడి వేదికపై మాట్లాడే అవకాశం ఉంది.
జగన్‌లో ఈ ఆలోచనలకు కారణం ఎవరు?
వైఎస్‌ఆర్‌ పేరును ప్రస్తావించకుండా ముందుకు సాగటం వెనుక ఏదో అదృశ్య శక్తి పనిచేస్తుందని చెప్పొచ్చు. లేకుంటే ఎప్పుడూ అటువటంటి పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన మొదట్లో ప్రతి పథకంలోనూ వైఎస్‌ఆర్‌ పేరును చొప్పించారు. ఇప్పుడు జగన్‌ పేరు మాత్రమే పెడుతున్నారు. వైఎస్‌ఆర్‌ పేరును మరిచిపోతున్నారు. ప్రతి పథకంలోనూ జగనన్న పేరు తప్పకుండా ఉంటోంది. చివరకు ప్రజలకు అందించే ఏ కాగితంపైనైనా జగనన్న పేరు, ఫొటో ఉండాల్సిందే. పట్టాకాగితాలు ఇచ్చినా వాటిపై కూడా బ్యాగ్రౌండ్‌ వైఎస్‌ఆర్‌సీపీ జెండా, జగన్‌ ఫొటో ఉంటున్నాయి. ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి పని చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా రంగులు మార్చే పద్దతి ఉండటం మంచిది కాదనే భావన అప్పటి నాయకుల్లో ఉండేది. ఇప్పుడు కాలం మారింది, దాంతో పాటే నేతల మనసులు కూడా మారాయి.
సాక్షిపై వైఎస్‌ఆర్‌ బొమ్మ మారనుందా?
వైఎస్‌ఆర్‌ మరణించిన తరువాత ఆయన స్మారకంగా సాక్షి దినపత్రికపై వైఎస్‌ఆర్‌ బొమ్మ వేస్తున్నారు. ఆయన గతంలో చెప్పిన మాటలను బొమ్మ కింద ప్రచురిస్తున్నారు. ఇవి ఎంతో మంచిగా ఉన్నాయని ఇప్పటి వరకు అభినందనలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎన్నేళ్లు ఇలా బొమ్మ ఉంచుతాం తొలగిస్తే బాగుంటుందనే ఆలోచన ఒక వ్యక్తి నుంచి వచ్చినట్లు సమాచారం. ఆ వ్యక్తి జగన్‌ మనసులో మాటను చెప్పగలిగే వ్యక్తి కావడంతో ఎవ్వరూ మాట్లాడలేదు. జగన్‌ మాత్రం ఇప్పుడు వద్దని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
Next Story