ఈనెల 27న ఏపీలో జరిగే ఎన్నికలపై నిరుద్యోగుల ప్రభావం ఉంటుందని తెలుగుదేశం, ఇతర పార్టీలు భావిస్తున్నాయి. ఆ ప్రభావం ఏ స్థాయి అనే దానిపై చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు రాసే నిరుద్యోగుల ప్రభావం రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏ మాత్రం ఉంటుందనే చర్చ ప్రస్తుతం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబరులో గ్రూప్-2 పోటీ పరీక్షల నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమినరీ పరీక్ష పూర్తయింది. నేడు మెయిన్స్ పరీక్ష జరుగుతోంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ద్వారా మెయిన్స్ కు 92,250 మంది ఎంపికయ్యారు. వీరంతా మెయిన్స్ రాయాల్సి ఉంది. ఈ దశలో నిరుద్యోగులు లేవనెత్తిన సమస్యలకు సకాలంలో ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. నోటిఫికేషన్ లో రోస్టర్ మార్చిన తరువాతనే పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని కోరింది. సాధ్యం కాదని ఏపీపీఎస్సీ చెప్పింది. ఈ దశలో నేడు పరీక్షలు జరుగుతున్నాయి.
రెండు రోజులు రాష్ట్రంలో నిరుద్యోగుల తీవ్ర ఆందోళన
విశాఖలో సాగర తీరాన, విజయవాడలో కృష్ణా తీరాన నిరుద్యోగులు గ్రూప్ -2 పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన చేశారు. ఆందోళనల ఫలితంగా నిరుద్యోగుల్లో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులు నిరుద్యోగులు గుంపులను చెదరగొట్టారు. ప్రభుత్వం వాయిదా వేయించేందుకు చర్యలు తీసుకుంటోందని కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు వచ్చాయి. దీంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ మధ్య ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీస్ కేసులకు సిఫార్స్ చేశారు. దీంతో కొందరిపై కేసులు నమోదయ్యాయి. నిరుద్యోగులు శనివారం ఉదయం వరకు ఆందోళనలు కొనసాగించారు. అయినా వారి ఆందోళనలు ఫలించలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హెచ్చరికలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ విసిరారు. నదుల వద్ద, సముద్రం వద్ద కొవ్వొత్తులతో రాత్రి పూట నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విధానంపై నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన ఊపందుకోవడంలో ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయించేందుకు శత విధాల ప్రయత్నాలు చేసి విఫలమైంది. చివరి రోజున పరీక్షలు వాయిదా వేయడం కుదరదని, కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏపీలో నోటిఫికేషన్ ఇచ్చినందున కేంద్రం పరిధిలోకి వచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన నేరం కింద మాపై చర్యలు ఉంటాయని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం చేతులెత్తేసింది.
పరీక్షలకు హాజరైన నిరుద్యోగులు
ఆదివారం నిర్వహించే పరీక్షలకు నిరుద్యోగులు హాజరయ్యారు. 84,921 మంది నిరుద్యోగులు తమ హాల్ టికెట్లు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇందులో పరీక్ష రాసేందుకు ఎంత మంది హాజరయ్యారనే విషయం సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. పరీక్షలు 175 కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఉదయం పేపర్ -1, సాయంత్రం పేపర్ -2 పరీక్ష జరుగుతుంది. శనివారం సాయంత్రం వరకు పరీక్ష వాయిదా వేస్తారేమోనని ఎదురు చూసిన నిరుద్యోగులు వాయిదా పడక పోవడంతో పరీక్ష కేంద్రాలకు వెళ్లటానికి కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ప్రభుత్వం జిమ్మిక్కులు
గ్రూప్-2 అభ్యర్థుల రోస్టర్ వ్యవహారంపై ఏమీ తేల్చకుండా ప్రభుత్వం మెతక వైఖరి అవలంబించిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంటే నిరుద్యోగుల్లో ఆందోళన చాలా వరకు తగ్గేదని, చివరి నిమిషం వరకు నాన్చడం, చివర్లో తాము ప్రయత్నం చేశామని చెప్పుకునేందుకు ఇటువంటి జిమ్మిక్కులు చేయడం మంచిది కాదన్నారు. నిరుద్యోగులు తమ జీవితాశయంగా చదువుకుంటుంటారని, వారి ఆశలు ఆవిరయ్యే విధంగా చర్యలు ఉండకూడదన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఆందోళన
నిరుద్యోగులు కూటమి అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే గోదావరి జిల్లాల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. వీరికి ప్రత్యర్థులుగా సీపీఎం తరపున పోటీలో ఉన్నారు. గెలుపు తమదేనని ధీమాలో టీడీపీ అభ్యర్థులు ఉన్నప్పటికీ ఈ పరీక్షల కారణంగా జరిగిన సమస్యల వల్ల మెజారిటీపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.