మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై రేషన్ బియ్యం మాయం కేసు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేత పేర్ని కుటుంబంపై నమోదైన రేషన్ బియ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దీంతో పేర్ని నాని కేసుపై ఎప్పుడు ఏమి జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఆయన కుటుంబంపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు, మచిలీపట్నం అసెంబ్లీ నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి పేర్ని కిట్టూ మీద కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆమెకు కూడా ఆదేశాలు జారీ చేశారు. విచారణ నిమిత్తం ఆదివారం రెండు గంటల లోపు పోలీసు స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. జయసుధపై కూడా నోలీసులు జారీ చేసిన పోలీసులు విచారణకు రావాలని స్పష్టం చేశారు. అయితే పేర్ని నాని కుటుంబ సభ్యులెవ్వరూ పోలీసుల విచారణకు హాజరు కాలేదు.
అంతేకాకుండా పోలీసులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యాజ్యం స్పందించిన హైకోర్టు పిటీషన్‌ను వెనక్కితీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెల 22 విచారణకు హాజరు కావాలని పోలీసులకు నోటీసులు ఇచ్చారని, ఆ గడువు ముగిసినందు వల్ల ఈ పిటీషన్‌పై విచారణ అవసరం లేదని పేర్కొనడంతో పేర్ని నాని తన పిటీషన్‌ను వెనక్కి తీసుకున్నారు. హోం శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది జయంతి తన వాదనలు వినిపించారు. నోటీసు గడువు ముగిసినందు వల్ల పిటీషన్‌పై విచారణను కొనసాగించడానికి వీల్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో దాఖలు చేసిన పిటీషన్ విత్ డ్రా చేసుకుంటామని పేర్ని నాని తరఫున న్యాయవాది పి రఘు కోర్టుకు తెలిపారు. పిటీషన్ వెనక్కి తీసుకునేందుకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎస్‌ఎన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ బియ్యం మాయమయ్యాయనే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మచిలీపట్నం కోర్టులో పేర్ని సతీమణి పిటీషన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ కొనసాగుతోంది. విచారణ చేపట్టిన జస్టిస్ సుజాత తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.