ప్రభుత్వం చెబుతూ వస్తున్న స్కిల్ సెన్సెస్‌కు తొలి అడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి కాకుండా తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్య గణన మొదలైంది. ఒక్క సారిగా రాష్ట్రమంతా కాకుండా పైలెట్ ప్రాజెక్టు కింద ఒక ప్రాంతంలో చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంగళగిరి నియోజక వర్గంలో పైలెట్ ప్రాజెక్టు కింద స్కిల్ సెన్సెస్ చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో దీనిని ప్రారంభించారు. మంగళగిరి నియోజక వర్గంతో పాటుగా రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో కూడా పైలెట్ ప్రాజెక్టు కింద స్కిల్ సెన్సెస్ చేపట్టాలని నిర్ణయించారు.
స్కిల్ సెన్సెస్ కోసం మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని 100 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సెన్సెస్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. దాదాపు 25 అంశాలతో కూడిన ఒక ఫార్మేట్‌ను రూపొందించారు. వీటి ఆధారంగా వివరాలను సేకరిస్తారు. దాదాపు 675 మంది ఎన్యుమరేటర్లు ద్వారా సమాచారాన్ని సేకరించనున్నారు. మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి స్కిల్ సెన్సెస్ చేపట్టనున్నారు. వీటిల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో మరో 25,507 ఇళ్లు ఉన్నాయి. స్కిల్ సెన్సెస్ చేపట్టేందుకు అవసరమైన మొబైల్ యాప్‌ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. వివరాలను ఎలా సేకరించాలనే దానిపైన ఎన్యుమరేటర్లకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. క్షేత్ర స్థాయికి వెళ్లి వివరాలు సేకరించే బృందాలకు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, ఒక వేళ సమస్యలు వచ్చినా వాటిని అక్కడిక్కడే పరిష్కరించుకొని అధికమించేందుకు టెక్నికల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.
ఎన్ని కుటుంబాల నుంచి అయితే వివరాలను సేకరించాలని అనుకుంటున్నారో ఆ ఇళ్లకు సంబంధించిన మ్యాపింగ్‌తో పాటు వివరాలను సేకరించే ఎన్యుమరేటర్ల మ్యాపింగ్ కూడా పూర్తి చేశారు. ఎన్యుమరేటర్లతో పాటు గ్రామ సచివాలయాల సిబ్బంది, స్కిల్ డెవలెప్‌మెంట్ అధికారులు, సిబ్బంది, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది కూడా ఈ స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. స్కిల్ సెన్సెస్‌ను ఎప్పటికప్పుడు మోనటరింగ్ చేస్తుంటారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు వచ్చినటై్టతే వాటిని గుర్తించి, పరిష్కరించుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. యువతలో ఏ మేరకు స్కిల్స్ ఉన్నాయనే అంశాలను గర్తించి వాటిని మెరుగు పరచుకునేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం కోసం ఈ స్కిల్ సెన్సెస్ చేయనున్నారు.
Next Story