ప్రస్తుతం బ్రాంది షాపుల్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తారా? సేల్స్‌మెన్, సూపర్ వైజర్లుగా ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న వారి పరిస్థితి ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం వచ్చేనెల నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ అయింది. దీనిని గవర్నర్ ఆమోదించగానే నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,736 మద్యం షాపులు ఉన్నాయి. ఈ షాపులన్నీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేశాయి. అయితే నూతనంగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనుంది. మద్యం ధరలను కూడా తగ్గించనుంది.
మద్యం షాపుల్లో సేల్స్‌మెన్‌లుగా 7,324 మందిని, సూపర్ వైజర్లుగా 2,934 మందిని గత ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ పద్ధతిపై తీసుకుంది. వీరికి మద్యం అమ్మకాలపై తగిన శిక్షణ కూడా ఇచ్చింది. ఏడాది కాలానికి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా కొనసాగిస్తూ వచ్చింది. మద్యం విధానం మారి ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళుతున్నందున షాపుల్లో వారికి ఇష్టం వచ్చిన వారిని సేల్స్‌మెన్స్‌గా, సూపర్ వైజర్లుగా నియమించుకుంటారు. అదే జరిగితే 10,258 మంది పరిస్థితి ఏమిటనే సందిగ్ధం కొనసాగుతోంది. ఇంత వరకు వీరి గురించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. కేవలం ఔట్ సోర్సింగ్ పద్ధతిపై కొనసాగుతున్నారు కాబట్టి ఏజెన్సీతో ఒప్పందం రద్దు కావడం వల్ల వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించే అవకాశం లేదు. తాము ఐదేళ్లుగా పనిచేస్తన్నాము కాబట్టి తమకు కాంట్రాక్ట్ పద్దతిపై క్వాలిఫికేషన్‌ను బట్టి వేరే సెక్టారుల్లో అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులకు ఈ మేరకు అర్జీలు కూడా ఇచ్చారు.
నూతన మద్యం విధానం ప్రకారం లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుంది. మొత్తం షాపుల్లో 340 కల్లు గీత కులాల వారికి కేటాయించారు. మద్యం పాలసీపై నివేదిక ఇచ్చిన ఉపసంఘం సిఫార్స్‌ల మేరకు అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కల్లు గీత వారికి పోను 3396 షాపులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. లాటరీలో పాల్గొనేందుకు డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. రూ. 50 లక్షల నుంచి డిపాజిట్ ప్రారంభమవుతుంది. ఈ మొత్తం డిపాజిట్ చెల్లించాల్సిన షాపులు 1,310 ఉన్నాయి. రూరల్ ఏరియాలో ఈ షాపులు ఎక్కువగా ఉంటాయి. ఆ తరువాత రెండో కేటగిరీ షాపులకు రూ. 55 లక్షలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి షాపులు 1,032 ఉన్నాయి. రూ. 65 లక్షలు డిపాజిట్ చెల్లించాల్సిన షాపులు 1,119 ఉన్నాయి. రూ. 85 లక్షలు డిపాజిట్ చెల్లించాల్సిన షాపులు 275 వరకు ఉన్నాయి.
ఈ డిపాజిట్స్‌ను మూడు దఫాలుగా చెల్లించే వెసులు బాటు ఉంటుదని అధికారులు తెలిపారు. నోటిఫికేషన్‌లో అన్నీ వివరంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఈ షాపులన్నీ 29 డిపోల పరిధిలో ఉన్నాయి. 340 షాపులకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా షాపులు కేటాయిస్తారు. ఇవి లాటరీ పద్ధతిలో ఉంటాయా? వేరే పద్ధతులేవైనా ప్రభుత్వం అనుసరిస్తుందా? అనే అంశాన్ని ఇంకా స్పష్టం చేయలేదు.
మొత్తం మీద నూతన మద్యం అమ్మకాలు వచ్చేనెల 10 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆబ్కారీ శాఖ అన్ని వివరాలు ప్రభుత్వం ముందు ఉంచింది. ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశిస్తే ఆరోజు నోటిఫికేషన్ అధికారులు ఇస్తారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ శుక్రవారం ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్‌లెట్ల బాధ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిటైల్ అవుట్‌లెట్స్ వద్ద ఆస్తుల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, పీవోఎస్ మెషీన్లు, నగదు భద్రతా బీరువాలు, రిప్రిజిరేటర్లు, ఇతర పరికరాలకు సంబంధించిన జాబితాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే దానిని ప్రత్యేక కేటగిరీలో చేర్చాలని ఆదేశించారు. దీనిని బట్టి పాలసీ రెడీగా ఉందని, నోటిఫికేషన్ వెలువడటమే తరువాయని అర్థం చేసుకోవచ్చు.
Next Story