గత ప్రభుత్వం సామాజిక వన విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్రం ఇచ్చే నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోవడం చేతకాలేదు.


మనిషి మనుగడకు ప్రాణవాయువు ఎంతో అవసరం. ఆ వాయువు కావాలంటే చెట్లు ఉండాలి. మనిషి వదిలే కార్బన్‌ డై ఆక్సైడ్‌ను చెట్లు పీల్చుకుని ఆక్సిజన్‌ను మనుషులు, ఇతర జీవరాసులకు అందిస్తాయి. అటువంటి చెట్లను పెంచే కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. చెట్లు పెంచే కార్యక్రమానికి గతంలో పుల్‌స్టాప్‌ పెట్టింది. దీంతో ఐదేళ్ల కాలంలో చెట్లు నరకడం తప్ప పెంచడం ప్రభుత్వానికి చేతకాలేదు. పైగా అడవుల్లో స్మగ్లర్ల కారణంగా ఎన్నో ఏళ్ల చెట్లు మాయమవుతున్నాయి. నల్లమల అడవుల్లోని టేకుతో పాటు కలపకు పనికొచ్చే చెట్లు ధ్వంసమయ్యాయి. అటవీ సంపదను రక్షించడంలో గత ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్‌ అయిందని చెప్పొచ్చు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న పర్యావరణ సమతుల్యత
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019లో అధికారం చేపట్టగానే మొదటి సారిగా నాటి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తరువాత వనమహోత్సవం అంటే ఎలా ఉంటుందో కూడా ప్రజలు మరిచిపోయేలా చేశారు. విజయవాడ అటవీ డివిజన్‌ డిఎఫ్‌వోను గతంలో ప్రశ్నిస్తే పైసా కూడా మొక్కల పెంపకానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని, ఉపాధి హామీ ద్వారా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడదామన్నా ప్రభుత్వం సహకరించలేదన్నారు. కేంద్రానికి కావాల్సిన వివరాలన్నీ కంప్యూటరీ కరణ ద్వారా అందించాల్సి ఉంటుందని, ఆ సాప్ట్‌వేర్‌ను ఆపరేట్‌ చేసే వారు కరువవడంతో పరిస్థితి ఇలా తయారైందన్నారు. ప్రస్తుతం నర్సరీల్లో గతం నుంచి పనిచేస్తున్న (టెంపరరీ బేస్‌) ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తన పేరు రాయొద్దన్నారు. డిఎఫ్‌వోనే తన పేరు రాయొద్దని చెప్పారంటే ప్రభుత్వం సామాజిక వనాల పెంపకంపై ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆలోచించాల్సి ఉంది.
ప్రతి జిల్లాలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు చేపడుతున్నాయి. సామాజిక అటవీ శాఖ ద్వారా మొక్కలు పెంచి ఆ మొక్కలను స్కూళ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ల వెంట నాటేందుకు ఉచితంగా పంపిణీ చేస్తారు. కానీ ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేకుండా పోయాయంటే చెట్లపెంపకంపై చిత్త శుద్ధి కొరవడింది. ఒక ఎకరం స్థలంలో చెట్లు పెంచితే కనీసం 20 మందికి ఆక్సిజన్‌ అందుతుందని, అడవులు, చెట్లు లేకుంటే జీవ రాసుల పరిస్థితి ఏమిటనేది అటవీ అధికారుల ప్రశ్న. గతంలో వర్షాకాలం వచ్చిందంటే మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు అడవుల్లో హెలికాఫ్టర్‌ల ద్వారా విత్తనాలు చెల్లే కార్యక్రమాలు కూడా విరివిగా నిర్వహించే వారు. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి. ఎందుకు ప్రయారిటీలు మార్చుకున్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన ప్రాణవాయువును అందించే చెట్లను పెంచాలనే ఆలోచన ఎందుకు చేయడం లేదనేది పలువురు పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ విషయమై గ్రీన్‌ క్లైమేట్‌ స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు జెవి రత్నం మాట్లాడుతూ ప్రభుత్వాలకు అధికార దాహం తప్ప ప్రజల ప్రాణాల గురించి పట్టలేదన్నారు. చెట్లు పెంచకపోవడం వల్ల పర్యావరణానికి ముప్పు వస్తోందని, పెద్ద నగరాల్లో ఒక్కోసారి ఆక్సిజన్‌ అందక చిన్న పిల్లలు ఎన్ని అవస్థలు పడుతున్నారో చూస్తున్నామన్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం అందుకు తోడ్పాటు నందించాలని సూచించారు.
ఏపీలో 11 నగర వనాలు
దేశంలోని 122 జిల్లాల్లోని పెద్ద నగరాల్లో పర్యావరణానికి ముప్పు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పర్యావరణ పరిరక్షణకు ముప్పు ఉందని గమనించిన ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. వీటిలో శ్రీకాకుళం జిల్లా వెలగాడ, విజయనగరం జిల్లా నెల్లిమర్ల, కర్నూలులో గార్గేయపురం, కడప, చిత్తూరు డెయిరీ నగరవనం, చిత్తూరు జిల్లా కలిగిరికొండ, శ్రీకాళహస్తిలో కైలాసగిరి, తాడేపల్లిగూడెంలోని ప్రకాశరావుపాలెం నగరవనాలతోపాటు, పెనుగొండలో శ్రీకృష్ణ దేవరాయకోట ఎకోపార్క్, కదిరిలో బత్రేపల్లి వాటర్‌ ఫాల్స్‌ ఎకో పార్క్, పలాసలో కాశీబుగ్గ నగరవనం, విశాఖపట్నంలో ఈస్ట్రర్న్‌ ఘాట్‌ బయోడైవర్సిటీ నగరవనాలను అభివృద్ది చేయనున్నట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు.
అడవుల అభివృద్ధికి పవన్‌ ప్రత్యేక శ్రద్ధ
ప్రకృతి ప్రేమికుడిగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉంది. హైదరాబాద్‌లోని తన ఇంటిని కూడా చెట్లతో నింపేశారు. ఆయన ఫామ్‌ హౌస్‌లో తోటలు పెంచారు. అప్పుడప్పుడు అక్కడ చెట్లకింద కూర్చుని సేద తీరుతుంటారు. ఆయనకు ప్రస్తుత ప్రభుత్వంలో అటవీ పర్యావరణ, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించడంతో మరింత దృష్టి పెట్టారు. కేంద్రంతో ఉన్న సన్నిహితత్వాన్ని కూడా ఉపయోగించుకుని అక్కడి అదికారులో మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో అడవులు, సామాజిక అడవుల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. శుక్రవారం పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలోని కాకానిలో వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హాజరు కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా హెలికాఫ్టర్‌ ప్రయాణం సాధ్యం కాకపోవడంతో వారి కార్యక్రమం రద్దయింది. అయితే వనమహోత్సవాల కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని వారు ప్రకటించారు.
జూలై మొదటి వారంలోనే జరగాలి...
ప్రతి ఏడాది జూలై మొదటి వారంలో వనమహోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. వర్షాలు ఆగస్టులో పడుతున్న కారణంగా ప్రస్తుతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పవన్‌ కళ్యాణ్‌ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఉపాధి హామీ నిధులతో మొక్కలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో అటవీ శాఖ వద్ద మొక్కలే లేకుండా ఉన్న పరిస్థితి నుంచి ప్రస్తుతం మొక్కలు పెంచే కార్యక్రమం మొదలైంది. వర్షాలు పడుతున్నందున ఎన్ని మొక్కలు నాటితే అంత మంచిదని, అవసరమైతే ప్రైవేట్‌ వారు పెంచే మొక్కలు కొనుగోలు చేసి నాటించాలనే ఆలోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కేంద్రం పర్యావరణానికి ముప్పు ఉన్న గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినందున ఆ గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేకంగా మొక్కలు పెంచే కార్యక్రమాలు మొదులు కానున్నాయి.
Next Story