వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన తప్పులు వెతికే పనిలో టీడీపీ ప్రభుత్వం ఉంది. అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ పనిపైనే ఎక్కువ దృష్టిపెట్టింది.


ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కక్షలు, కార్పణ్యాల వైపు వెళుతున్నాయి. గత ప్రభుత్వ తప్పులు ఏమున్నాయో వెతికి కేసులు పెట్టే పనిలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే పలు అంశాలపై కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులు సాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని, ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారనే కేసులు ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారంటూ కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం వారిని ఇబ్బందులు పాలు చేస్తోంది.

అధికారం చేపట్టగానే మైన్స్‌లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏసీబి విచారణకు ఆదేశించింది. మైన్స్‌ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డిని ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. ఆయన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొందరు టీడీపీ నేతలపై నేరుగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని భావించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ శాఖలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫైబర్‌నెట్‌లో కూడా అవినీతి ఎక్కువగా జరిగిందని, ఇష్టానుసారం ఉద్యోగులను నియమించారని, కాంట్రాక్టులు కూడా ఇష్టానుసారం ఇచ్చి దోచుకున్నారని ఆరోపిస్తూ ఏకంగా కొద్ది రోజులు కార్యాలయానికి సీలు వేసింది. ఆ తరువాత ఇటీవల సీలు తొలగించి ఏసీబి అధికారులు, ఉన్నతాధికారులతో విచారణ మొదలు పెట్టారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రభుత్వ భూములు పార్టీ నాయకులు కాజేశారని, 22ఎ కింద ఉన్న భూములకు రిజిస్ట్రేషన్‌లు చేసి స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చాయి. మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ కాల్చివేతపై పలువురు అధికారులను సస్పెండ్‌ చేశారు. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించిన ప్రభుత్వం రెవెన్యూ పోలీస్‌ అధికారులతో విచారణ మొదలు పెట్టింది.
విశాఖపట్నంలోని రుషికొండ, చుట్టుపక్కల ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్‌ భూములను కూడా వైఎస్సార్‌సీపీ నాయకులు స్వాహా చేశారని ఆరోపిస్తూ పోలీస్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా దర్యప్తుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రుషికొండపై సొంత భవనాలు కొందరు నిర్మించారని, ఆ భూములు వారికి ఎలా వచ్చాయనే కోణంలోనూ విచారణ సాగుతోంది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా విశాఖలో ఆరోఫలు వచ్చిన భూముల వ్యవహారంపై పలు చోట్ల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడారు. మదనపల్లిలోనూ ఇదే విధంగా అర్జీలు తీసుకోవడంతో అక్కడ చాలా మంది భూములు కోల్పోయిన వారు అర్జీలు ఇచ్చారు. వాటిపై కూడా విచారణ జరుగుతోంది.
మరొక అంశం వైఎస్సార్‌సీపీ కార్యాలయాలు కూల్చివేత. అనుమతులు లేకుండా వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఈ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చి కూల్చి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో నిర్మాణాలు జరుగుతున్న ప్రతి కార్యాలయం జిల్లా అధ్యక్షనికి ఆయా మునిసిపల్‌ కమిషనర్లు నోటీసులు ఇచ్చారు. తాడేపల్లిలోని రాష్ట్ర కార్యాలయంతో పాటు పలు జిల్లాల్లో కూల్చి వేశారు. కోర్టుకు వెళ్లడంతో స్టేటస్‌ కో కోర్టు ఇచ్చింది. దీంతో అవి అలాగే ఆపేశారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు పలు జిల్లా కార్యాలయాలపైన దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసిన కేసుల్లో దర్యాప్తు వేగవంతమైంది. అప్పటిలో కొందరు నిందితులుగా ఉండి కేసులో లేకుండా ఉన్నారంటూ వారిపై కూడా కేసులు నమోదు చేశారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్, నర్సరావుపేట, సత్తెనపల్లి వంటి పట్టణాల్లోనూ టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగిన అంశంపై అక్కడి వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. కొందరు అరెస్ట్‌ కాగా కొందరు బెయిల్‌పై ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ముంబైకి చెందిన సినీ హీరోయిన్‌ కాదంబరీ జత్వానిపై కుక్కల విద్యాసాగర్‌ అనే వ్యక్తి ద్వారా కేసు పెట్టించి అరెస్ట్‌ చేసి విజయవాడలో పోలీసులు కష్టడీకి తీసుకున్న కేసు ఇప్పుడు తెరపైకి వచ్చింది. రెండు రోజుల క్రితం ఈ కేసును పునర్విచారించి నిందులపై కేసులు నమోదు చేసి మహిళకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు పోలీసులను కలిసేందుకు శుక్రవారం ఆమె విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను కలిసింది. తనను విద్యాసాగర్‌ మోసగించారని కేసు పెట్టింది. దీనిపై విచారణ జరుగుతోంది. ఆమె ఆరోపణలు నిజమైతే జగన్‌ కూడా ఈకేసులో నిందితుడయ్యే అవకాశం ఉంది.
ఇక మద్యం, మైన్స్‌ కుంభకోణాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్పడ్డారంటూ ఈ రెండు ప్రభుత్వ శాఖల్లో చోటు చేసుకున్న లోపాలపై ఏసీబీ, సిఐడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎక్సైజ్‌ అండ్‌ ఫ్రొహిబిషన్‌ శాఖ కమిషనరుగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఇండ్లపై ఏసీబీ వారు దాడులు చేసి కొన్ని కేసులు నమోదు చేశారు. మైన్స్‌ ఎండీగా ఉన్న వెంకటరెడ్డిపై కూడా ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించి దోపిడీకి పాల్పడ్డారని, ఇసుకను ఇష్టాను సారం అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని, కొన్ని మైన్స్‌ క్వారీల లీజుల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనూ పోలీసుల విచారణ జరుగుతోంది. ఇలా చాలా అంశాలపై విచారణలు జరుగుతూనే ఉన్నాయి.తప్పులు వెతికే పనిలో ప్రభుత్వం
Next Story