దిట్టంగా  లడ్డు.. ఘనమైన చరిత్ర సొంతం
x

"దిట్టం"గా లడ్డు.. ఘనమైన చరిత్ర సొంతం

తిరుమల శ్రీవారి లడ్డు రుచి ఎక్కడా దొరకదు. ఈ ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాలే ఈ ప్రత్యేకతకు ప్రధాన కారణం.


( ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ప్రధానమైనది లడ్డు. తిరుమల లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే.. అతిశయోక్తి కాదు. ఈ లడ్డు రుచి, సువాసన ప్రపంచంలో ఏ పదార్థానికి ఉండదు. అందుకే దేనికి భౌగోళిక ఉత్పత్తి అనుమతి (జీఐ) , పేటెంట్ రైట్స్ కూడా లభించింది. భక్తులు అత్యంత ప్రీతిగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డు ప్రథమ స్థానం.. అంతేకాదు భారత ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా పోస్ట్ స్టాంప్‌ను విడుదల చేసింది.

చరిత్రలో లడ్డు ప్రసాదం

తిరుమల ఆలయంలో ఈ లడ్డు ప్రసాదం 15 నుంచి 20 శతాబ్ది తొలినాళ్ల వరకు.. ఇప్పుడు లడ్డుకు ఉన్న స్థానం వరకు మాత్రమే ఉండేది. అప్పట్లో శ్రీవారికి "సంధి నివేదనలు" ( నైవేద్య వేళలు) ఖరారు చేశారు. ఆ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు ఆలయంలో పంచేవారు. ఎందుకంటే అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలిని తీర్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ పర్యవేక్షించే రోజుల్లో .. అంటే 19వ శతాబ్ది మధ్యకాలంలో తీపి బూందీని ప్రవేశపెట్టారు. 1940 నాటికి అదే లడ్డుగా మారింది. కాలక్రమంలో వడ స్థానాన్ని లడ్డు ఆక్రమించింది. ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే...

ప్రపంచంలో పేరు...

తిరుమల శ్రీవారి ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలను టీటీడీ తయారు చేస్తుంది. టీటీడీ తయారు చేస్తున్న లడ్డు ప్రసాదానికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కూడా లభించింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదాలకు ఉన్న ఖ్యాతి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఎందుకు అంటే.. టీటీడీ తయారు చేసే అన్ని రకాల ప్రసాదాల్లో ఒక క్రమ పద్ధతిలో వాడే పదార్థాలు అంత మాధుర్యంగా ఉంటాయి.

రాజుల కాలం నుంచి..

స్వామివారి ప్రసాదం కోసం రాజుల కాలంలోనే ఎన్నో దానాలు అందించారు. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగం అనేవారు. తర్వాత శాలివాహనుల శకం 1455లో సుఖీయం, అప్పం, 1460లో వడ, అత్తిరసం, 1468లో మనోహర పడి, 1547లో శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను ప్రవేశపెట్టినట్లు చరిత్ర చెబుతోంది. అయితే, వడ మినహా మిగతా ప్రసాదాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశాలు లేకపోవడాన్ని గమనించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం శ్రీవారి ఆలయంలో తొలిసారిగా

1803లో ప్రసాదాల విక్రయాన్నిప్రారంభించింది. లడ్డు తయారీకి అవసరమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. ఇలా అనేక రకాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల విక్రయం చివరకు 1940 నుంచి తిరుపతి లడ్డుగా స్థిరపడింది. దీని కాస్త వెనక్కి వెళితే తాళ్లపాక పెద్ద తిరుమల ఆచార్యులు శాలివాహన సేవలలో 1936లో తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి కల్యాణోత్సవం ప్రవేశపెట్టించారనేది ఇతిహాసం చెబుతున్న మాట. ఆ ఆచార వ్యవహారం కొనసాగుతూ ఆధునిక కాలంలో కూడా స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. పెళ్లిళ్లలో బూందీ లడ్డు ఇవ్వడం తెలుగింటి సంస్కృతి. స్వామి వారికి నిత్య కళ్యాణం సమయంలో కళ్యాణోత్సవం చేయించే గృహస్తులకు బూందీ లడ్డు ఉచితంగా ఇవ్వడం ఆచారంగా మారింది.

"దిట్టం" ప్రకారం తయారీ

లడ్డు తయారీకి " పడితర దిట్టం" అంటే లడ్డు తయారీకి కావాల్సిన ముడి సరుకుల మోతాదును టీటీడీ సిద్ధం చేసింది. పడి అంటే 51 వస్తువులు పనికి కావలసిన వస్తువుల దిట్టం అని అర్థం. దీనిని టిటిడి పాలకమండలి మొదటిసారి 1950 సంవత్సరంలో నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో భక్తుల సంఖ్య కూడా పెరిగింది. వీటన్నిటిని పరిశీలించిన టిటిడి యంత్రాంగం 2001లో సవరించిన దిట్టంతో లడ్డు ప్రసాదాలు తయారు చేస్తున్నారు. 5100 లడ్డూల తయారీకి వివిధ రకాలైన 83 కేజీల సరుకులు వినియోగిస్తారు.

ఆ దిట్టం ప్రకారం 5, 100 లడ్డూల తయారీకి 280 కిలోల ఆవు నెయ్యి, 200 కిలోల సెనగపిండి, 400 కిలోల చక్కెర, 35 కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండు ద్రాక్ష, 10 కిలోల కలకండ, ఐదు కిలోల యాలకులు అవసరం. ప్రస్తుతం "పోటు" ( వంటశాల)లో లక్ష వరకు లడ్డూలను తయారు చేసే సామర్థ్యానికి పెంచారు. కొన్ని సంవత్సరాల కిందట బూందీని పోటులో తయారు చేసి, వెలుపలకు తీసుకొచ్చిన అనంతరం నిత్యం మూడు నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూల తయారీ పెరిగింది.

లడ్డు తయారీ..

తిరుమల శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూల్లో అనేక రకాలను తయారు చేస్తున్నారు. కళ్యాణం తర్వాత టికెట్టు కొనుగోలు చేసిన వారికి 750 గ్రాముల లడ్డు ప్రసాదంగా అందిస్తారు. సాధారణ లడ్డు 140 నుంచి 170 గ్రాములు ఉంటుంది. విడిగా కొనుగోలు చేయాలంటే కళ్యాణం లడ్డు 200, సాధారణ లడ్డు రు. 50 వంతున టిటిడి విక్రయిస్తుంది. ఈ లడ్డు తయారీకి వాడుతున్న పట్టిక ఆధారంగా టీటీడీ లడ్డు ప్రసాదానికి 2008 జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) లభించింది. 2009లో జిఐ చట్టం 1999 ప్రకారం టిటిడి తయారు చేసే లడ్డుపై పేటెంట్ హక్కులను పొందింది. దీనివల్ల ఇతరులు అదే పేరుతో ఈ తరహా లడ్డు తయారు చేయకుండా నిరోధించడానికి ఈ హక్కుల వల్ల చట్టబద్ధత లభించింది.

లడ్డూలు.. మూడు రకాలు

తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక క్షేత్రం లడ్డూలు కూడా వివిధ రకాలలో ఉన్నాయి. వాటిలో మొదటిది ఆస్థానం లడ్డు: ఈ లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే అందిస్తారు. ఈ లడ్డు బరువు 750 గ్రాములు ఉంటుంది. ఈ లడ్డూ తయారీలో రూపొందించిన " దిట్టం" పరిమాణాని కంటే ఎక్కువ పదార్థాలు వాడతారు. అందులో ప్రధానంగా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు అదనంగా వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు.

కళ్యాణోత్సవ లడ్డు:

శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్థులకు ఈ లడ్డు అందిస్తారు. ఈ లడ్డు కౌంటర్లలో అదనంగా కూడా కొనుగోలు చేసే వెసులుబాటును టిటిడి అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రోక్తం లడ్డు:

పేరు విభిన్నంగా కనిపించినప్పటికీ .. తిరుమల శ్రీవారి పోటులో ఈ లడ్డును తయారు చేస్తారు. సాధారణ భక్తులకు కూడా ఈ లడ్డు రు. 50కి అందుబాటులో ఉంటుంది. ఎన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదాలకు అత్యంత ఆదరణ ఉంది. భక్తుల మనసెరిగిన టీటీడీ ప్రసాదాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వడమే కాదు. సామాన్య భక్తులకు కూడా ప్రసాదాలను అందుబాటులో ఉంచింది.

Read More
Next Story