
కల్లి తండా వాసి మరళీనాయక్
Operation Sindoor |యుద్ధవీరుడి కోసం శోకిస్తున్న కల్లి తండా..
కాశ్మీర్ యుద్ధభూమిలో అమరుడైన నాయక్ పార్ధివదేహం శుక్రవారం కల్లి తండాకు చేరనుంది.
"విజయం సాధించి వస్తా" అని వీడియో కాల్ చెబితివి. రెండు రోజుల్లోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోతివి కొడుకో.." ఇలా మురళీనాయక్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు.
అగ్నివీర్ జవాన్ మురళీనాయక్రుడయ్యాడని తెలిసినప్పటి నుంచి కల్లి తండా విషాదంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కొడుకు మురళీనాయక్ చివరి చూపు కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వారి వేదనతో తండా విషాదంలో మునిగిపోయింది. రెండు రోజులుగా నిద్రాహారాలు మానేసి, కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు వదిలిన అగ్నివీర్ ఎం. మురళీనాయక్ పార్ధివదేహం శుక్రవారం సాయంత్రానికి గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ కల్లి నాయక్ తండాకు తీసుకురానున్నారు. పూర్తి అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు చేశారు.
కాశ్మీర్లో సరిహద్దులో పాక్ సైనికులతో హోరాహోరీగా పోరాడుతూ, బుల్లెట్ గాయం తగిలినా ఐదుగురు పాక్ సైనికులను తుదముట్టించిన తరువాతే మరళీ నాయక్ అమరుడయ్యాడని అక్కడి అధికారుల ద్వారా సమాచారం అందింది. తమ ఒక్కగానొక్క కొడుకు మురళీ నాయక్ ఇక లేడని తల్లిదండ్రులు ఎం. జ్యోతిభాయి, శ్రీరాం నాయక్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
"వారంలో వస్తా అన్నాడు. ఇంకెప్పటికి కనిపించనంత దూరం పోయాడు సార్" అని మురళీ నాయక్ తండ్రి శ్రీరాం నాయక్ కన్నీరుమున్నీరు అవుతున్నారు.
"కాశ్మీర్ వెళ్లగానే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినాడు. యుద్ధంలో విజయం సాధించాక వస్తా" అని మురళీ చెప్పిన మాటలు తలుచుకుని గుండెలు పగులేలా మురళీనాయక్ తల్లి జ్యోతి బాయి రోదిస్తున్నారు.
"మూడు రోజుల కిందటే మాట్లాడాడు. గంటల్లోనే మాకు దూరంగా వెళ్లిపోయాడు సార్. మేము ఎవరి కోసం జీవించాలి" అని మురళీనాయక్ తండ్రి శ్రీరాం నాయక్ కన్నీరు మున్నీరు అవుతున్నారు.
"అధికార లాంఛనాలతో మురళీనాయక్ కు శనివారం ఉదయం తుది వీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి" అని అనంతపురం జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ తిమ్మప్ప చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ లో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ కు నివాళులు అర్పించడానికి మంత్రులు, పెనుగొండ ఎమ్మెల్యే, మంత్రి ఎస్. సవితమ్మ సత్యకుమార్ యాదవ్, సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణతో పాటు వివిధ పార్టీల నాయకులు గోరంట్లకు చేరుకున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు కల్లి తండాలో మకాం వేశారు.
సైన్యంలో తండా యువత
గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీలో ఆరుగురు యువకులు సైనికులు పనిచేస్తున్నారు. వారిలో కల్లి తండా నుంచి వెళ్లిన ఇద్దరిలో మురళీనాయక్ వీరమరణం చెందారు. మరో యువకుడు కూడా కదనరంగంలో ఉన్నారు. గడ్డం తండ నుంచి మోహన్ నాయక్, హరి నాయక్ తో పాటు మరో ఇద్దరు కూడా సరిహద్దుల్లోనే ఉన్నారు. "వారంతా వేర్వేరు ప్రాంతాల్లో యుద్ధంలో తమ సాహసాలు చాటుతున్నారు" అని గడ్డం తండా పంచాయతీ సర్పంచ్ వాసుదేవ నాయక్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
గడ్డం తండా పంచాయతీ కల్లి తండా మజరా గ్రామంలో 65 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఇంటి నుంచి విద్యావంతులే. ఒకరా, అర్ధ ఎకరా పొలంలో నీటి ఆధారం ఉంటే సేద్యం చేసే తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
"మురళీనాయక్ కుటుంబానికి కూడా ఎకరా భూమి ఉన్నా, పనులు అంతంత మాత్రమే" అని సర్పంచ్ వాసుదేవ నాయక్ వివరించారు.
యుద్ధభూమిలోకి వెళ్లిన రెండు రోజులకే...
కల్లి తాండాకు చెందిన మురళీనాయక్ సోమందేపల్లిలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుకున్నాడు. అనంతపురం పట్టణంలో డిగ్రీ చదివిన మురళీనాయక్ ఎన్సీసీసీ (NCC ) లో కూడా సమర్థత చాటుకున్నారు. ఆ శిక్షణే మురళీనాయక్ ను సైన్యంలో చేరడానికి అడుగులు వేయించింది.
2022లో అగ్నివీర్ గా మురళీనాయక్భా రత సైన్యంలో చేరారు. నాసిక్ లో శిక్షణ అనంతరం జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహించాడు. మళ్లీ పంజాబ్ కు మురళీనాయక్ ను సైనికాధులు బదిలీ చేశారు.
కాశ్మీర్ లోని పహల్గావ్ లో విహారానికి వెళ్లిన 26 మంది భారత పౌరులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపిన ఘటనతో ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సైన్యాన్ని పంజాబ్ నుంచి కూడా తరలించింది. అందులో మురళీనాయక్ అమరుడు కావడానికి రెండు రోజుల ముందే యుద్ధభూమిలోకి పాదం మోపాడు. అని మురళీనాయక్ సొంత ఊరు కల్లితండాలో ఆయన బంధువుల ద్వారా తెలిసిన సమాచారం.
మా తండా జవాన్ త్యాగం
"దేశ రక్షణలో మా ఊరి జవాన్ మురళీనాయక్ ప్రాణత్యాగం చేశాడు. ఇది మాకు గర్వంగా ఉంది" అని గడ్డం తండా పంచాయతీ సర్పంచ్ వాసుదేవనాయక్ వ్యాఖ్యానించారు.
వీరమరణం చెందిన మురళీ నా తమ్ముడే. మా నాయన, మురళీ తండ్రి శ్రీరాం నాయక్ సోదరులు. మా కుటుంబానికి తీరని శోకం మిగిలింది. కానీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసే భాగ్యం దక్కింది. ఇదే మా ఊరికి చరిత్రలో మరోస్థానం దక్కేలా చేసింది" అని వాసుదేవ నాయక్ గద్గదస్వరంతో అన్నారు.
బెంగళూరు నుంచి కల్లి తాండాకు...
కాశ్మీర్ యుద్ధభూమిలో వెంటాడి, తాను అమరుడు కావడానికి ముందే ఐదుగురు పాక్ సైనికులను తుదిముట్టించడంలో ఎం. మురళీనాయక్ వీరోచిత పోరాటం సాగించిన విషయం ఆయన సహచరుల ద్వారా ఈ సమాచారం అందిందని గడ్డం తండా సర్పంచ్ వాసుదేవనాయక్ చెప్పారు.
బెంగళూరు విమానాశ్రయం నుంచి సాయంత్రం గోరంట్ల మండల కేంద్రానికి చేరుతుంది. అక్కడి నుంచి భారీర్యాలీతో కల్లి తండాకు తీసుకుని వెళ్లడానికి శ్రీసత్యసాయి జిల్లా అధాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శనివారం
మురళీనాయక్ పార్ధివదేహం పేటిక కాశ్మీర్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుతుంది. అక్కడి నుంచి సైనిక వాహనంలో సాయంత్రం 5 గంటలకు గోరంట్ల మండలం గుమ్మవారిపల్లె క్రాస్ కు చేరుతుంది.
అక్కడి నుంచి కల్లి తండా వరకు ప్రత్యేక వాహనంపై ఉంచిన నాయక్ శవపేటికను భారీ ఊరేగింపుగా కల్లి తాండాకు తీసుకుని బయలుదేరుతారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ర్యాలీ జరిగే అవకాశం ఉంటుంది.
సైనిక వందనం సమర్పించే జవాన్లు నాయక్ పార్ధివదేహాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో ఆయన కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. రాత్రికి శవపేటిక వద్దే పోలీసు, మిలిటరీ సిబ్బంది గార్డులుగా కాపలా కాస్తారు.
ఆదివారం
ఉదయం 6 నుంచి 8 గంటల వరకు
అగ్నివీర్ మురళీనాయక్ పార్ధివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు.
8 నుంచి 9 గంటల వరకు నాయక్ కుటుంబ ఆచారాల ప్రకారం లాంఛనాలు నిర్వహిస్తారు.
9 నుంచి 9.30 వరకు సైనికవందనం సమర్పించే కార్యక్రమం జరుగుతుంది.
ఆ తరువాత మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులు, ప్రజలు నివాళులు అర్పించడానికి ఏర్నాట్లు చేశారు.
10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సైనికాధికారులు మురళీనాయక్ పార్ధివదేహం ఉన్న శవపేటికను శ్మశానవాటికను భుజాలపై ప్రదర్శనగా మోసుకుని వెళతారు.
11 గంటలకు మురళీనాయక్ కుటుంబానికి ఉన్న పొలంలో అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు.
11.30 నుంచి 12.00 గంటల మధ్య పోలీస్, మిలిటరీ సిబ్బంది మురళీనాయక్ పార్ధివదేహానికి గౌరవ వందనం సమర్పించడం, గాలిలోకి కాల్పులు జరపడం ద్వారా సెల్యూట్ చేస్తారు.
12.00 నుంచి 12.30 గంటలకు శవపేటికపై ఉన్న జాతీయపతాకాన్ని మురళీనాయక్ తల్లిదండ్రులకు అప్పగించే లాంఛనాలు పూర్తి చేస్తారు.
12.30 నుంచి ఒంటి గంట మధ్య సంప్రదాయబద్ధంగా తుదివీడ్కోలు పలుకుతారు.
జిల్లా ప్రజల నివాళి
కాశ్మీర్లో మురళీనాయక్ అమరుడయ్యాడనే విషయం తెలియడంతో అన్ని వర్గాలు తీవ్రంగా స్పందించాయి. పాకిస్థాన్ పై నినాదాలతో నిప్పులు చెరిగారు. అనంతపురంలో సీపీఐ, ముస్లిం సంఘాలు, అంబేడ్కర్ విగ్రహాల వద్ద మురళీనాయక్ ఫోటోలు ఉంచారు. క్యాండిళ్లు వెలిగించి నివాళులర్పించారు.
Next Story