
TIRUMALA | ఏడుకొండలు దిగిన లక్ష్మీకాసులహారం
తిరుమల శ్రీవారి పాదాల వద్ద శ్రీలక్ష్మీ కాసులహారానికి పూజలు చేశారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి ఈ రోజు రాత్రి నిర్వహించే వాహనసేవలో అలంకరించనున్నారు.
శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి లక్ష్మీకాసులహారం కానుకగా అందింది. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల నుంచి ఏడాదికి ఒకసారి లక్ష్మీకాసుల హారాన్ని తీసుకుని వచ్చి అలంకరిస్తారు.
అందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి పాదాల వద్ద పూజలు నిర్వహించిన తీరువాత ఈ కాసులహారాన్ని తిరుమల మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్యచౌదరి నిర్వహించారు.
ఈ హారం తిరుచానూరుకు సమీపంలోని అర్బన్ హాట్ వద్ద పసుపుమండపం వద్దకు రాగానే పూజల అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. మంగళవాయిద్యాలు, కోలాటాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇవన్నీ ఎందుకంటే...
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు. అమ్మవారిని దర్శింంచుకోవడానికి స్థానికులే కాకుండా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు భారీగా వస్తున్నారు. అమ్మవారి వాహన సేవల ముందు కళాకారుల ప్రదర్శనలతో నీరాజనం సమర్పిస్తున్నారు. ఇదిలావుంటే..
తిరుమల శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఈ రోజు (సోమవారం రాత్రి) రాత్రి నిర్వహించే వాహనసేవలో కాసులహారంతో కనువిందు చేయనున్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ గరుడవాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. అలాగే పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా గజవాహనసేవకు అంత ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం అత్యంత విలువైన లక్ష్మీకాసులహారాన్నిఅమ్మవారి ఉత్సవమూర్తికి అలంకరిస్తారు. దీనికోసం..
తిరుమలలో పూజలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి పద్మావతి అమ్మవారు పట్టపురాణి. శ్రీవారు తిరుమలో కొలువైతే.. పద్మావతి అమ్మవారు తిరుచానూరులో భక్తులను కటాక్షిస్తున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాల వేళ అమ్మవారికి అలంకరించే కాసులహారాన్ని ప్రధాన అర్చకులు, పండితులు, జీయర్ స్వాములు సోమవారం తిరుమల శ్రీవారి మూలమూర్తి పాదాలవద్ద ఉంచి పూజలు చేశారు. ఆ తరువాత ఈ హారాన్ని తిరుపతికి తీసుకుని వచ్చారు.
తిరుమల నుంచి తీసుకుని వచ్చిన శ్రీలక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరుకు సమీపంలోని పసుపు మండపం వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. కాసులహారం ఊరేగింపు ఈ కార్యక్రమాలను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి పర్యవేక్షించారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
"తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని గరుడ సేవ మాదిరిగానే, తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఐదో రోజు సాయంత్రం గజ వాహన సేవ అత్యంత ప్రాముఖ్యమైంది" అని అన్నారు.
తిరుమల ఆలయంలోని లక్ష్మీ కాసుల హారాన్ని మాడ వీధుల్లో ఊరేగించి తిరుచానూరు ఆలయానికి తీసుకెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సోమవారం సాయంత్రం నిర్వహించనున్న గజ వాహన సేవలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, టీటీడీ అధికారులు, విజలెన్స్ అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుండగా,
ఓ భక్తుడి కానుక
గతంలో సీఎం ఎన్. చంద్రబాబునాయుడు సమక్షంలో విజయవాడకు చెందిన మంతెన రామలింగరాజు అనే భక్తుడు శనివారం ఐదు పేటల బంగారు సహస్రనామ కాసులహారాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించారు. దీనిబరులు 28.645 కిలోలు. ఈ ఆభరణం విలువ రూ.8.39 కోట్లు. ఈ హారంలో 1008 కాసులున్నాయి. ఒక్కో కాసుపై సహస్రనామావళిని ముద్రించారు.
Next Story