Chittoor Maoist| రక్తమోడిన దండకారణ్యం.. నేలకొరిగిన 'అలిపిరి' సూత్రధారి
మావోయిస్టు ఉద్యమానికి పెద్దదెబ్బ తగిలింది. పీడితుల కోసం తుపాకీ పట్టిన తవణంపల్లెకు చెందిన పాతతరం అగ్రనేత చలపతి ప్రాణాలు కోల్పోయారు.
జనవరి 20వ తేదీ. అది దండకారణ్యం. పిల్లగాలికి కూడా ఆకు కదలితే శబ్దం వస్తోంది. జంగిల్ షూ ధరించిన సాయుధ పోలీసులు చెట్లచాటున పరస్పర సైగలతో అడుగులు వేస్తున్నారు. అన్నల కోసం వేట మొదలైందని అడవితల్లికి ఈ విషయం తెలిసిందేమో. ఆకాశమంత ఎత్తు పెరిగిన చెట్ల కొమ్మలు తలూపుతున్నాయి.
దీనిని పసిగట్టలేని మారుమూల సమావేశమైన నక్సలైట్ల (మావోలు)పైకి సాయుధ దళాలు తూటాల వర్షం కురిపించాయి. అలా రెండు రోజులుగా తుపాకీ తూటాల మోతతో దండకారణ్యం మృత్యుఘోషతో విలవిలలాడుతోంది. శత్రువు దాడి చేశాడని మావోలు గ్రహించే లోపల హాహాకారాలు మిన్నంటాయి. పిట్టల్లా రాలిపోయారు. అలా దట్టమైన అడవుల్లో దాదాపు 20 మంది నక్సలైట్లు ప్రాణాలు వదిలారు. వారి మృతదేహాలను ఓ కర్రకు ఉండలా చుట్టి, జోరుగా పారుతున్న సెలయేటి ఉధృతిలోనే సాయుధ పోలీసులు కష్టంగా దాటడం కనిపించింది. మృతుల సంఖ్య పెరిగినా ఆశ్చర్యం లేదు.
జన్మతా రెడ్ల ఇంట పుట్టినా, పెత్తందారీతనం, నిర్బంధాన్నిచిన్నతనం నుంచి దగ్గరగా చూసిన వ్యక్తి రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతిరెడ్డి కూడా ఒకరు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన చలపతి ఉన్నత చదువు చదివి, పట్టుపరిశ్ర శాఖలో ఉద్యోగిగా ఉన్నా, అభ్యుదయ భావాలతో పెరిగారు. పేదల గొంతుకగా నిలిచారు. తుపాకీ చేతబట్టిన తమ ఊరి వ్యక్తి ఎన్ కౌంటర్ లో మరణించారనే సమాచారంతో చిత్తూరు జిల్లా తవణంపల్లె మత్యం పైపల్లె ఉలిక్కిపడిండి.
అంత ఏమరపాటుగా ఉన్నారా?
అరణ్యంలో వేలాది మంది సాయుధులు చుట్టుముట్టి సాగించిన ఆపరేషన్ లో మావోయిస్టు చలపతి తూటాలకు నెలకు ఒరిగే సమయానికి సాధారణ చొక్కా, నిక్కరు ధరించి ఉన్నారు. అగ్రనేత అంత సులువుగా మట్టుబెట్టడం సాధ్యమా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. పదుల సంఖ్యలో సంఖ్యలో సమావేశమైన అన్నల చుట్టూ రక్షణ వలయం ఏమయింది. సెంట్రీలు లేరా? ఉంటే వారి కనుగప్పడం సాధ్యమా? సాధారణ దుస్తుల్లో అంతఏమరపాటుగా ఉంటారా? అనే సందేహాలకు తెరతీశారు.
సాధారణంగా అగ్రనేతల సారధ్యంలో సమావేశం ఉంటుందనుకుంటే దానికి పగడ్బందీ నెట్ వర్క్ ఉంటుంది. అది ఒకటి, రెండు రోజుల్లో అనుకుని నిర్వహించే సమావేశం కాదనేది గతంలో జరిగిన అనేక సంఘటనల్లో వెలుగు చూసిన విషయాలు స్పష్టం చేస్తాయి. ముందుగానే అనుకున్న సమావేశం విషయం బయటికి పొక్కినా, దీనిని మావోలు పసిగట్టలేకపోవడం వల్ల భారీ నష్టాన్ని మూటగట్టుకన్నట్లే కనిపిస్తోంది. దీనిపై మావోయిస్టు పార్టీ ప్రకటన చేసే వరకు అన్నీ సందేహాలే.
పాతతరం మావోయిస్టు నేత
చిత్తూరు జిల్లా నక్సలైట్ ఉద్యమంలో పాతతరానికి చెందిన వారిలో చలపతి చివరి వ్యక్తి అనడంలో సందేహం లేదు. చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాల కార్యదర్శిగా పనిచేస్తూ, ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో మంగలి కిష్టప్ప, ఆ తరువాత బాధ్యతలు చేపట్టిన కేశవ ముందుతరానికి చెందిన వ్యక్తి చలపతి. ఈయన మరణంతో జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద తగిలింది. అనడం కంటే, మావోయిస్టు ఉద్యమం శకం ముగిసినట్టేనా అనే ప్రశ్న ఎదురైంది.
అలిపిరి ఘటన తరువాత అదృశ్యం
సీఎం ఎన్. చంద్రబాబుపై అలిపిరి వద్ద 2003లో జరిగిన క్లెమోర్ మైన్ దాడిలో చలపతి కీలకపాత్ర పోషించారనేది పోలీసుల సందేహం. ఆ ఘటన తరువాత అదృశ్యమైన చలపతి ఛత్తీస్ ఘడ్ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన తరువాత ఆయన ఆచూకీ బాహ్య ప్రపంచానికి తెలిసింది. భద్రతా విభాగాలు ఈ విషయాన్ని ధృవీకరించే వరకు ఆయన ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారనేది కూడా జిల్లాలోని ఆయన సంబంధీకులకే కాదు. మిత్రులకు కూడా తెలియకుండా పోయిందనే విషయం బయటకు వచ్చింది. మావోయిస్టు చలపతి మరణ వార్తపై జిల్లాలోని మదనపల్లె డివిజన్ లో ఇదే ప్రధాన చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా, యూ ట్యూబ్ లో కూడా కథనాలు వైరల్ అయ్యాయి.
ఎన్నో కేసులు
ఛత్తీస్ ఘడ్ – ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా మెయిన్ పురి పోలీస్ స్టేషన్ పరిధిలో కులారి ఘాట్ అటవీ ప్రాంతంలో సోమవారం నుంచి జరుగుతున్న ఎన్ కౌంటరులో చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పైపల్లెకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మృతి చెందాడు. ఈ ఎన్ కౌంటరులో ఈయనతో పాటు మరో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన చలపతిపై రూ.కోటి రివార్డు ఉంది. ఈయనపై ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో కేసులు ఉన్నాయి.
ఈ ఆపరేషన్ లో జిల్లా రిజర్వు గార్డ్, సెంట్రల్ రిజర్వు పోలీసు, ఛత్తీస్ ఘడ్ కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ బలగాలు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతిలో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడం బాలకృష్ణ, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డూ కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
చలపతి మృతితో
చిత్తూరు జిల్లాలో పీపుల్స్ వార్ శకం ముగిసినట్టేనా అనే మాట తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా నుంచి మావోయిస్టు పార్టీకి ప్రాతినిధ్యం వహించే వారు ప్రస్తుతానికి ఎవరూ లేరని భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత చలపతి స్వగ్రామం చిత్తూరు జిల్లాలో తవణంపల్లె మండలం మత్యం పైపల్లె. వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ గ్రామంలో నివసించడం లేదు. చలపతి ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించారు. మదనపల్లె , తిరుపతిలో చదువు సాగించారు. పీజీ వరకు చదివిన చలపతి మదనపల్లి పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ విశాఖకు బదిలీ అయ్యారు.
జీవితానికి మలుపు
విశాఖ జిల్లాలోని మావోయిస్టులతో ఏర్పడ్డ పరిచయంతో నక్సల్స్ లో చేరి మావోయిస్టులకు అగ్ర నాయకుడుగా ఎదిగారు. చలపతి అమ్మానాన్నలు గతంలోనే మరణించారు. ఇద్దరు సోదరుల్లో ఒకరు ఇప్పటికే మృతి చెందారు రెండవ సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మదనపల్లి లో ఉన్నట్లు సమాచారం. చలపతి 24ఏళ్ల వయసులోనే సుమారు ఆరు దశాబ్దాల కిందటే మత్యం పైపల్లె వీడారు.
ఉద్యోగంలో భాగంగా చలపతి విశాఖ ప్రాంతానికి వెళ్లాడు. అప్పట్లో అక్కడ శ్రీకాకుళం ఉద్యమం ఉధృతంగా ఉండటంతో నేతలతో సంబంధాలు ఏర్పడ్డాయని తెలిసింది. ఆ తరువాత పీడిత ప్రజల విముక్తి కోసం చలపతి అజ్ఞాతవాసానికి వెళ్లాడు.
ఉద్యమంలో ఉండగానే.. మహిళా అరుణ మావోయిస్టును ఈయన వివాహమాడారు. ఛత్తీస్ ఘడ్- ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో బలమైన నేతగా చలపతి ఎదిగాడు. పోలీసు ఎన్ కౌంటర్లలో చాలాసార్లు తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. నాలుగేళ్ల కిందట ఏపీ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో కూడా చలపతి తప్పించుకున్నాడని చెబుతారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో చలపతి పోలీసు తూటాలకు బలయ్యాడనే విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది.
మావోయిస్టు శకం ముగిసినట్లేనా...?
మావోయిస్టు పార్టీ అగ్రనేత రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మృతి చెందడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ శకం ముగిసినట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1960 దశకంలో జరిగిన శ్రీకాకుళ ఉద్యమ ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై కూడా పడింది. ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎంతోమంది సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ చేరి అజ్ఞాత జీవితంలో ఉంటూ ప్రజల కోసం పోరాటం చేశారు.
1975లో పీపుల్స్ వార్ కు అనుబంధంగా తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం కేంద్రంగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్ యూ) ఏర్పడింది. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో నడిచే పీపుల్స్ వార్ కుచాలా మంది ఆకర్షితులయ్యారు. ఉద్యమం కోసం జీవితకాలం పని చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. అలా వచ్చిన వారిలో చిత్తూరు సమీపంలోని మహాసముద్రం గ్రామానికి చెందిన మహదేవన్ ను ఎమర్జెన్సీ సమయంలో మద్రాసు నుంచి వస్తుండగా పోలీసులకు పట్టుబడటంతో, కాల్చి చంపారు.
అనంతపురం జిల్లా చిలమత్తూరుకు చెందిన నాగరాజు కూడా పీపుల్స్ వార్ లో జీవిత కాలపు ఉద్యమకారునిగా పనిచేస్తుండగా... ఎమర్జెన్సీలోనే వడమాలపేట మండలం అమ్మగుంట వద్ద జరిగిన ఎన్ కౌంటరులో మృతి చెందారు. ఎమర్జెన్సీలో చాలా మంది నేతలు జైలు పాలయ్యారు. ఆ తరువాత జనతా పార్టీ అధికారంలోకి రావడంతో వారికి విముక్తి లభించింది.
ఎగసిన ఉద్యమం..
కాస్త ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ లభించడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉద్యమం ఎగిసిపడింది. అందుకు తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్ కాలేజీ, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల, మదనపల్లె బీటీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలతో పాటు అనేక విద్యా సంస్థల్లో ఆర్ఎస్ యూ తో పీపుల్స్ వార్ ఉద్యమానికి కేంద్రాలుగా మారాయి. తిరుపతిలో త్రిపురనేని మధుసూదనరావు వంటి మేధావులు ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. ఆయనతో పాటు కొందరు మేధావులు, విద్యార్థుల ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు.
కొండపల్లి పిలుపుతో..
‘గ్రామాలకు తరలండి’ అంటూ కొండపల్లి సీతారామయ్య ఇచ్చిన పిలుపుతో గ్రామీణ ప్రాంతాలకు ఈ ఉద్యమం విస్తరించింది. రాడికల్ యూత్ లీగ్ (ఆర్ వైఎల్), రైతు-కూలీ సంఘాలు ఊపిరి పోసుకున్నాయి. ఈ సంఘాలు ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. ఈ ఉద్యమాల సమయంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా పీపుల్స్ వార్ కార్యదర్శి మంగలి కృష్ణప్ప అలియాస్ రెడ్డెప్ప, ఆయన భార్య లక్ష్మి, సోదరుడు వెంకటస్వామితో పాటు శ్రీనివాసులు అనే మావోయిస్టులను చిత్తూరు- కడప జిల్లా సరిహద్దు కలకడ సమీపంలో గుట్టపల్లి వద్ద పోలీసులు కాల్చిచంపారు.
దళాన్నే మట్టుబెట్టారు
శ్రీకాళహస్తి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో దళ (కాళంగి దళం) సభ్యులందరూ ప్రాణాలు కోల్పోయారు. దళం రిట్రీట్ అయ్యే సమయంలో ఓ మహిళా నక్సలైట్ దుస్తులు బావి వద్ద శుభ్రం చేసుకుంటుండగా, పోలీసులు చుట్టుముట్టారు. దీంతో కేవీబీపురం మండలం కాళంగి రిజర్వాయరు సమీప అటవీ ప్రాంతంలో మార్కొండయ్య అలియాస్ భూపతి, ఆయన భార్య శోభక్క (ఈమెది పీలేరు సమీపంలోని కొత్తపల్లె), లోకనాథం (శ్రీకాళహస్తి), సుధాకరరెడ్డి (తిమ్మసముద్రం), రాజేష్ (రామాపురం), చెంగయ్య, ఆయన భార్య స్వరూప (కాటూరు) ఎన్ కౌంటర్లో మృతి చెందారు.
అనంతపురం జిల్లా తనకల్లు ప్రాంతానికి చెందిన ఎర్ర శీను (బలిజ సత్యం) పీలేరు సమీపంలోని హెరిటేజ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అలిపిరి బాంబు బ్లాస్ట్ తరువాత ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
టీడీపీ నేతపై యాక్షన్
తంబళ్లపల్లె ప్రాంతంలో రైతు కూలీ సంఘం మాజీ ఎమ్మెల్సీ ఏవీ ఉమాశంకర్ రెడ్డిని 1984 డిసెంబరు 25న ములకలచెరువు మండలం చౌడసముద్రం- చెట్లవారిపల్లె మధ్యలో హత్య చేశారు. ఇదే రైతు సంఘం వారు తంబళ్లపల్లె మండలం బురుజుకు చెందిన రామిరెడ్డిని ఆయన ఇంట్లోనే గొంతుకోసి చంపారు. ఇక ములకలచెరువు మండలం అన్నగారిపల్లెకు చెందిన రైతు- కూలీ సంఘం నేత నాగిరెడ్డిని రైతు సంఘం వారు చౌడసముద్రం ఉన్నత పాఠశాల వద్ద బస్టాప్ లో గొంతుకోసి చంపారు.
2003లో కడప, చిత్తూరు జిల్లాల పీపుల్స్ వార్ కార్యదర్శిగా పనిచేసిన కేశవ్ కాలంలోనే మహల్ టెలిఫోన్ ఎక్సేంజ్ పేల్చన సంఘటన జరిగింది. దీనికి ముందు కరువు దాడుల కోసం పోస్టర్లు వేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన నరసింహులు (వారాధి)ని జిల్లెళ్లమంతకు సమీపంలోని తలకోన అడవుల్లో ఎన్ కౌంటర్ చేశారు. ఆ తరువాత పీలేరులో ఓ మాజీ ఎమ్మెల్యే స్వగ్రామంలో వృద్ధ తల్లిని బయటకు పంపిన నక్సలైట్లు ఇంటిని పేల్చివేయడం ద్వారా పోలీసులకు సవాల్ విసిరారు.
1984 నుంచి వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో చిత్తూరు జిల్లాలో పీపుల్స్ వార్ ఉద్యమానికి దెబ్బతగులుతూనే వస్తోంది. కాళంగి దళం మొత్తాన్ని మట్టుబెట్టడం ద్వారా అన్నల ఆధిపత్యాన్ని దెబ్బతీశారు. అయితే, మదనపల్లె డివిజన్ పరిధిలోని తంబళ్లపల్లె, పీలేరు, వీటికి పొరుగునే ఉన్న కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట లక్కిరెడ్డిపల్లె, అటు అనంతపురం జిల్లా సరిహద్దుల్లోని కదిరి, తనకల్లు ప్రాంతాల్లోని పడమట గ్రామాల్లో పీపుల్స్ వార్ ఉద్యమం బలంగానే వేళ్లూనుకుని ఉండేది. వరుస ఎన్ కౌంటర్లు, లొంగిపోయిన ఘటనల నేపథ్యంలో బలహీనపడినట్టు కనిపించినా, ఉనికి చాటుకుంటూనే వస్తున్నారు. తాజాగా పాతతరానికి చెందిన చలపతి ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా ఉంటే, ఎదురుకాల్పుల్లో మరణించడం మావోయిస్టు ఉద్యమానికి పెద్దదెబ్బగానే భావిస్తున్నారు.
Next Story