రాష్ట్ర మంత్రి ఇస్త్రీ పెట్టె పట్టుకుని ఇస్త్రీ చేస్తే, ఎంపీ అభ్యర్థి టీకొట్టాడు. ఈ వేషాలకు ఓట్లు రాలుతాయా?


ఎన్నికల ప్రచారం షురూ అందుకుంది. అభ్యర్థులు ఎన్నికల్లో ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తున్నారు. ఒకటా రెండా లెక్కలేనన్ని వేషాలు వేస్తున్నారు. ఈ వేషాలకు ఓట్లు రాలతాయా? రాలొచ్చేమో.. ఎందుకంటే ఆ వేషాలు నలుగురినీ ఆకట్టుకుంటాయి. అంతేకానీ ఆ వేషం ఏ రాజకీయ నాయకుడైనా గెలిచిన తరువాత వేస్తున్నాడా? ఒక్కసారి ఓటర్లు గమనించాలి. ప్రతి సారీ ఎన్నికల్లో ఇవి కామన్ గా మారాయి. అసలు ముఖం తెలియని వాడు అభ్యర్థి అవుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఈ వేషాలు ఏమిటి? ఒకటా రెండా.. ఇస్త్రీ బండ్ల వద్ద ఇస్త్రీ పెట్టలు పట్టుకుని ఇస్త్రీలు చేయడం, టీకొట్ల వద్ద టీ తిరగగొట్టి అందించడం, సరదాగా ఇండ్ల వద్ద సాంప్రదాయ డ్యాన్స్ లు వేసుకునే వారి కార్యక్రమాలకు హాజరై వారితో పాటు కాసేపు వెర్రి చేష్టలు చేయడం. సంబరాల రాంబాలు అంటూ పేరు తెచ్చుకోవడం. కొద్దిసేపు దోశలు పోయడం, ఒకటేమిటి బజ్జీ బండ్లపై బజ్జీలు వేయడం వంటివి జరుగుతున్నాయి. ఏమిటిది? అసలు ఏమనుకుంటున్నారు పాలకులు. ప్రతిపక్షంలో వున్న వారూ ఉన్నారు. అధికారంలో ఉన్న మంత్రైనా, ఎమ్మెల్యే అయినా ఇవే వేషాలు వేస్తుండటం విశేషం.



మీకో చిన్న కథ చెప్పాలి. పూర్వం దట్టమైన అటవీ దారిలో రెండు కాళ్లు లేని వ్యక్తి ఒక చెట్టుకింద కంబళి కప్పుకుని కూర్చుని ఉంటాడు. దారిన వచ్చీపోయే వారిని బెదిరిస్తాడు. అతని కళ్లు నిప్పు కనికల్లా కనిపిస్తాయి. బుర్ర మీసాలు. లేస్తే ఎవరినైనా చంపేస్తాడనే భయం ఎదిటి వానిలో కలుగుతుంది. ఈ భయంతోనే దారిన పోయే వారు వారి వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, ఉంగరాలు అతని వద్ద పెట్టి వెళుతుంటారు. ఇతనిని సాయంత్రం కాగానే ఇంటికి తీసుకుపోయే వారు ఎవరో ఉంటారు. కొంతకాలంగా జరుగుతున్న ఈ తంతును ఓ వ్యక్తి గమనించాడు. అతను కూడా చాలా సార్లు తన చేతి ఉంగరాలు, గడియారాల వంటివి అక్కడ పెట్టి వెళ్లాడు. ఎంతో కాలంగా చెట్టుకింద నుంచి పైకి లెయ్యడం లేదు. ఇంతకాలం ఇతను ఇక్కడే ఎందుకు కూర్చొంటున్నాడు. పైగా ఒక్కసారి కూడా లేచి రావడం లేదు. బెదిరిస్తున్నాడు. ఎలాగైనా ఇతని గురించి తెలుసుకోవాలనుకున్నాడు ఆ వ్యక్తి. ఒకరోజు ఉదయాన్నే పొద్దు పొడవక ముందు వచ్చి ఆ చెట్టుకు సమీపంలో ఎవ్వరికీ కనిపించకుండా ఒక చెట్టు చాటున కూర్చొన్నాడు. కొద్ది సేపటికి ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చునే ఆ వ్యక్తిని ఎత్తుకుని వచ్చాడు. చెట్టుకింద కూర్చోబెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత చెట్టు చాటున దాక్కుని జరిగిన తంతు చూస్తున్న వ్యక్తి రోడ్డుపైకి వచ్చాడు. అతనితో పాటు మరికొందరు రోడ్డున వెళుతున్నారు. వారిపైకి ఉరిమి చూస్తూ రేయ్.. నేను లేస్తే మీరు బతకరు. ఆ డబ్బులు, బంగారు సొమ్ములు తెచ్చి ఇక్కడబెట్టి వెళ్లండండని ఆదేశించాడు. అప్పటికే జరిగిన తంతు గమనించిన వ్యక్తి ఆ దారిన పోయే వారితో పాటు నడచొస్తున్నాడు. ఎప్పుడైతే దారిన పోయే వారిని ఆ బుర్ర మీసాల వాడు కూర్చుని బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో అప్పటి వరకు జరిగిన తంతును గమనించిన మరో బాటసారి ఒక్కసారిగా కూర్చొన్న వ్యక్తిపైకి దూకి తన్నటం మొదలు పెట్టాడు. రెండు కాళ్లు లేని వాడు కావడంతో వెళ్లికిలా పడ్డాడు. పైన కప్పుకున్న దుప్పటి కింద పడిపోయింది. గిలగిలా కొట్టకుంటున్నాడు. దారిన పోతూ రోజూ భయపడే వారు అవాక్కయ్యారు. ఇన్నేళ్లుగా వారి వద్ద నుంచి దోపిడీ చేసిన డబ్బు, నగలు వాడి నుంచి రాబట్టారు. ఇదీ కథ.

పాలితులుగా మనం పాలకుల నుంచి ఒక్క పైసా కూడా రాబట్టలేమేమో కాని భయపెట్టి పబ్బం గడుపుకునే వాడిని, వింత వేషాలు వేసి మోసం చేసే వారిని ఎప్పటికైనా ఎగిచ్చి తన్నొచ్చని ఈ కథ నేర్పించింది. అదెలా ఉన్నా... పాలకుల తీరు మారాలి. ఏదో ఒకటి చెప్పి మోసం చేసే విధానాలకు స్వస్తి చెప్పాలి. పూర్వం ఎలాగైతే నమ్మకంతో పాలకులు పనిచేశారో ఆ విధానం రావాలి. అప్పుడు కాని ఇప్పుడు ఉన్న వారు తమ ఆలోచనలు మార్చుకుంటారు. లేదంటే ఇలాగే వుంటుంది.

మంత్రి ఇస్త్రీ చేస్తే.. ఎంపీ అభ్యర్థి టీ కాచాడు..

బుధవారం సింగరాయకొండలో చోటు చేసుకున్న నాయకుల వేషాలు చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది. ఒకింత కోపం కూడా వస్తుంది. ఒకరు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి, కొండపి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేశ్, మరొకరు తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీరిరువురూ సింగరాయకొండలో ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగే కార్యక్రమాని శ్రీకారం చుట్టారు. ఒకచోట ఇస్త్రీ బండి కనిపించింది. మరో చోట టీకొట్టు కనిపించింది. ఇస్త్రీ బండ్లో బట్టలు ఇస్త్రీ చెయ్యటం మంత్రి సురేశ్ చేపట్టారు. టీకొట్లో టీ కలిపి ఇవ్వడం ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదలు పెట్టారు. ఒక్కరోజు జస్ట్ అలా వేషం వేసి కనిపించకుండా పోతారు. ఇస్త్రీ బండి వాడు మాత్రం అయ్యగారు నా బండి వద్దకు వచ్చి నేను ఇస్త్రీ చేసే పెట్టె పట్టుకుని ఇస్త్రీ చేశాడని సాను భూతి చూపుతాడు. టీకొట్టువాడూ అంతే అనుకుంటాడు. కానీ వీటన్నింటినీ గమనిస్తున్న మేధావి వర్గం మాత్రం ఆలోచిస్తారు. వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నారని వాళ్లు వెళ్లిన తరువాత చెప్పి వాళ్లను ఎడ్యుకేట్ చేస్తారు. అలాంటప్పుడు ఎవరు ఎవరినీ మోసం చేయలేరని తేలిపోతుంది.

ఈ వ్యవస్థలో ఎక్కువగా మోసపోయే వాళ్లే ఉంటారు. ఉచితంగా డబ్బులు ఇచ్చే పథకాలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఎంతకాలం ఈ ఉచితాలు, చచ్చే వరకు ఇస్తారా? అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇన్ కం జనరేషన్ ఫ్రోగ్రామ్స్ కు ఎందుకు శ్రీకారం చుట్టడం లేదనేది ప్రశ్న.


Next Story