మీ జిల్లాకు కాబోయే ఏకైక మంత్రి
ఎన్నికలు ఇంకా జరగలేదు. కొత్త ప్రభుత్వం రాలేదు. అప్పుడే సీఎం జగన్ మీ మంత్రి పలానా అంటున్నారు. ఏమిటా కథ, కమామిషు..
ప్రకాశం జిల్లాకు కాబోయే ఏకైక మంత్రి మీ బాలినేని, చెవిరెడ్డన్న మీకు ఎంపీ, చంద్రశేఖర్ మీ నియోజకర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వీరందరినీ మీరు గెలిపించాలి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారితో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ లను చూపించి పై వ్యాఖ్యలు చేశారు.
దీంతో రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనా అంటూ అక్కడి వారు ముక్కున వేలేసుకుంటున్నారు. అప్పుడే బాలినేని శ్రీనివాసరెడ్డకి సీఎం జగన్ మంత్రి పదవిని ఖరారు చేశారు. పైగా జిల్లా నుంచి బాలినేని ఒక్కరే మంత్రి అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎస్సీ కోటాలో ఆదిమూలపు సురేశ్ మంత్రిగా ఉన్నారు. బాలినేని, సురేశ్ కు మధ్య ఒకింత గ్యాప్ వచ్చింది. ఉంచితే ఇద్దరినీ మంత్రులుగా ఉంచండి. లేదంటే ఇద్దరినీ తొలగించండని రెండున్నర సంవత్సరాల తరువాత జరిగిన మంత్రి వర్గ మార్పుల్లో బాలినేని సీఎంను కోరారు. అయితే బాలినేనిని తొలగించి సురేశ్ ను సీఎం కొనసాగించారు. అందుకేనేమో సీఎం ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇది ప్రకాశం జిల్లాలో చర్చనియాంశంగా మారింది.