ప్రభుత్వానికి, పోలీసు వర్గాలకు తలవంపులు తెచ్చే సంఘటన అనంతపురం నగరం నడిబొడ్డున చోటు చేసుకుంది.


పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారు. విధి నిర్వహణలో ఉన్నామన్నా విషయాన్ని మరచిపోయి వీధి రౌడీల్లా రెచ్చి పోయారు. పోలీసులే రౌడీల్లా రెచ్చి పోవడంతో వారిని వారించేందుకు భయపడిన చుట్టుపక్కల ప్రజలు, వారి చేష్టలను చూస్తూ ముక్కున వేలేసుకున్నారు. మఫ్టీలో ఉండి చలనా ఎలా వేస్తారని ప్రశ్నించినందుకు ఓ యువకుడిని విచక్షణా రహితంగా బూట్‌ కాళ్లతో తన్ని.. అతనిపైనే రివర్స్‌ కేసు బనాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసుల పరువు పోగొట్టే ఈ ఘటన అనంతపురం నగరం నడిబొడ్డున చోటు చేసుకుంది. ఈ తతంగం అంతా రికారై్డన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

హైకోర్టు ఆదేశా మేరకు అనంతపురం ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్, వాహనాల తనిఖీలను చేపట్టారు. అందులో భాగంగా నగరంలోని టవర్‌ క్లాక్‌ వద్ద బైక్‌పై త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న వారిని ఆపారు. బైక్‌పైన ఉన్న ముగ్గురు యువకులకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. త్రిబుల్‌ రైడింగ్‌తో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బైక్‌ను స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని, రేపు స్టేషన్‌కు వచ్చి బైక్‌ను తీసుకెళ్లాలని పోలీసులు యువకులకు చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. అసలు కథ తర్వాత చోటు చేసుకుంది. ఇంతలో మఫ్టీలో ఉన్న ఓ పోలీసు వారిపైకి వచ్చారు. వస్తూ రావడంతోనే దురుసుగా ప్రవర్తించారు. మఫ్టీలో ఉంటూ తమపై చలానాలు రాయడమేంటని యువకుడు అతన్ని ప్రశ్నించాడు. దీంతో మఫ్టీలో ఉన్న ఆ పోలీసుతో పాటు అక్కడున్న తక్కిన పోలీసులకు కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగి పోయారు. తమనే ప్రశ్నిస్తావా? అంటూ వీధి రౌడీల్లా రెచ్చి పోయారు. ఏకంగా బూటు కాళ్లతో తన్నారు. రాయలేని భాషలో బూతులు తిట్టారు. పోలీసులు వారి కసితీరా యువకులను చితకబాదిన తర్వాత ఇంటికి పంపారు. అంతేకాకుండా విచక్షణా రహితంగా బూట్‌ కాళ్లతో తన్నిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉండి రౌడీల్లా రెచ్చిపోవడం ఏంటని నిలదీస్తున్నారు. మరో వైపు యువకుడిని చితక బాదిన ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు సురుష్, రమేష్, రాజేష్, సరేంద్రకుమార్‌లు బాధిత యువకుడిపైనే రివర్స్‌ కేసు నమోదు చేశారు.
Next Story