కరవును కమ్మేసిన రాజకీయం!!  ఎటు చూసినా వాడుతున్న పంటలే!!
x
Distressed Farmer

కరవును కమ్మేసిన రాజకీయం!! ఎటు చూసినా వాడుతున్న పంటలే!!

ఏపీలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొని ఉన్నా ఏ రాజకీయ నాయకుడు ఎందుకు మాట్లాడడం లేదు. సాగుదారుల హాహాకారాలు ఎందుకు వినిపించడం లేదు. కరవును రాజకీయాలు కమ్మేశాయా?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మండలాలు 685.. వీటిలో మూడో వంతు మండలాలలో ఓమోస్తరు నుంచి తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. రబీ సాగు విస్తీర్ణంలో సగానికి పైగా బీడు పడిందా? అంటే వ్యవసాయ శాఖ వారం వారం విడుదల చేసే లెక్కలు సైతం దాదాపు అదే సూచిస్తున్నాయి. చాలా జిల్లాలలో అటు ఖరీఫ్ గాని ఇటు రబీ పంటలు గాని సాగు కాలేదు. మరి ఇంత కరవు పరిస్థితులు నెలకొన్నా రాష్ట్ర ప్రజలు కిమ్మనకుండా ఎందుకుండిపోయారు? గతంలో కరవు అంటే వలసలు ఉండేవి. ఇప్పుడెందుకు కనిపించడం లేదు? ఎవ్వరూ తిండికి ఎందుకు కటకటలాడడం లేదన్నది ప్రశ్న.

“ రాష్ట్రంలో 440 మండలాలలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఐదారు ఉమ్మడి జిల్లాల్లో మెట్ట పంటలు కూడా సాగు కాలేదు. పరిస్థితి ఇంత తీవ్రంగా అటు ప్రభుత్వం గాని ఇటు వ్యవసాయ శాఖ గాని స్పందించలేదు. ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రకటించలేదు. కేంద్ర బృందాలు రాలేదు. కనీస పరిశీలన చేయలేదు” అన్నారు ఏపీ వ్యవసాయ, రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. జమలయ్య.

2023-2024 రబీలో 57.5 లక్షల ఎకరాలకు గాను 37.6 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం.. సీజన్ ముగింపు దశకు వచ్చినా ఇప్పటికి సాగయిన ప్రాంతం 37.6 లక్షల హెక్టార్లు. అంటే మూడో వంతు విస్తీర్ణంలో అసలు పంటలే పడలేదు.

మరి ఈ లెక్కల పరమార్థం ఏమిటీ?

‘మరి ఈ లెక్కేమిటని అనుమానం రావొచ్చు. వర్షాలు పడతాయని, కాలువలకు నీళ్లు వస్తాయన్న ఆశతో రైతులు విత్తనాలు వేశారు. నీళ్లు లేకపోవడంతో ఇప్పుడా పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ శాఖ అంచనాల్లో విత్తిన విస్తీర్ణమే ఉంటుంది తప్ప ఎండిపోయిన విస్తీర్ణం లెక్కలు ఉండవు‘ అన్నారు ఏపీ రైతు సంఘం నాయకుడు కేవీవీ ప్రసాద్. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందన్నారు ప్రసాద్. ‘ఓ వైపు కరువు, మరోవైపు తుఫాన్‌తో గతేడాది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావంతో దాదాపు 46 లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయి. వేసిన పంటలూ చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఆ తర్వాత తుఫాన్‌ దెబ్బకు మరింత నష్టం జరిగింది. ఖరీఫ్‌లో అన్ని పంటల దిగుబడులు తగ్గగా.. రబీలోనూ ఏ మేరకు దిగుబడి వస్తాయో తెలియని పరిస్థితి. రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్నా.. రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకూ నయా పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు‘ అని చెప్పారు సీపీఎం అనుబంధ రైతు సంఘం నాయకుడు వై. కేశవరావు.

అనుకూలించని ప్రకృతి...

ప్రకృతి అనుకూలించకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్లు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లు కూడా ఎండిపోయాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల్లో కురవాల్సిన వర్షం కురవలేదు. నైరుతీలో 16 శాతం లోటు కనిపించింది. ఈశాన్య రుతుపవనాల్లో 21 శాతం లోటు ఉంది. వర్షాలు లేని లోటు వ్యవసాయంపై పడింది. సాగు విస్తీర్ణం తగ్గింది. 440 మండలాల్లో వర్షం లేని లోటు కనిపించింది. అయితే ప్రభుత్వం మాత్రం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. లక్షల టన్నుల్లో ఉత్పత్తి తగ్గనుంది.

రాష్ట్రంలో 2023-24లో తీవ్ర వర్షాభావం కారణంగా వ్యవసాయం నిరాశాజనకంగా మారింది. పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ‘ఖరీఫ్‌, రబీ సీజన్లలో 46 లక్షల ఎకరాల్లో రైతులు పంటలే వేయలేకపోయారు. ఖరీఫ్ లో 89.37 లక్షల ఎకరాలకు 62.45 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. దాదాపు 27 లక్షల ఎకరాల్లో విత్తనమే పడలేదు. రబీలో 57.5 లక్షల ఎకరాలకు గాను 37.6 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. దాదాపు 20 లక్షల ఎకరాలు బీడుగా మిగిలిపోయాయి. రెండు సీజన్లలో వ్యవసాయ శాఖ 146.87 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా నిర్ణయించగా, కోటి ఎకరాల్లోనే సాగయ్యాయి. 2023 ఖరీఫ్ లో రాష్ట్రవ్యాప్తంగా 440 మండలాల్లో వానలోటుతో చాలామంది రైతులు విత్తనమే వేయలేదు. మరికొందరు వేసిన పంటలకు నీటి తడులు అందించలేక అవస్థలు పడ్డారు. అయినా ప్రభుత్వం కరువు మండలాలు కేవలం 103 అనే ప్రకటించింది.

అటు కరువు.. ఇటు తుఫాన్‌

రాష్ట్రంలో ఓవైపు వర్షాభావంతో నష్టపోగా, మరోవైపు తుఫాన్‌తో పంటలు దెబ్బతిన్నాయి. సార్వా వరి కోతల ప్రారంభంలోనే మిచౌంగ్‌ తుఫాన్‌తో ధాన్యం రైతులు నష్టపోయారు. పత్తి, మిర్చి, పొగాకు, శనగ, ఉద్యాన రైతులూ నష్టాలు చవిచూశారు. రబీ సాగు మొదలైన సమయంలోనే తుఫాన్‌ రావడంతో అప్పటివరకు వేసిన విత్తనం దెబ్బతిని, మళ్లీ పంట వేసుకోవాల్సి వచ్చింది. నిరుడు కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయని కారణంగా సార్వా వరి సాగు ఆలస్యమైంది. దాంతో వరి కోతలు ఆలస్యం కావడంతో దాళ్వా పంటకు వాతావరణం అనుకూలించక రైతులు వరి సాగు తగ్గించారు. దీంతో 2023-24లో దాదాపు 15లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గింది. ఏపీలో ఇంత భారీగా వరి సాగు తగ్గడం గతంలో ఎప్పుడూలేదు. రాయలసీమలో వర్షాభావం వల్ల చిరుధాన్యాలు 3.50 లక్షల ఎకరాలు, అపరాలు 10 లక్షల ఎకరాలు, వేరుశనగ 11 లక్షల ఎకరాలు పైన తగ్గాయి. నూనెగింజలు, పత్తి, పొగాకు, చెరకు పంటలు కూడా తగ్గాయి.

నివేదికలు సరే నిధులేవీ..

కరువు, తుఫాన్‌తో పంట నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర బృందాలు పరిశీలించి నివేదికలు అందించినా, రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసినా.. రైతులకు నయాపైసా నష్టపరిహారం అందలేదు. మిచౌంగ్‌ సమయంలో రాష్ట్రానికి దాదాపు 493 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కరువు, తుఫాన్‌తో పంటనష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంత వరకు సాయం చేయలేదు. కనీసం పంట రుణాలు రీషెడ్యూల్‌ చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

రాజకీయాల్లో కొట్టుకుపోయిందా?

రాష్ట్రంలో ఇంత తీవ్ర స్థాయిలో అనావృష్టి పరిస్థితులు నెలకొని ఉంటే ప్రజలు ఎలా బతుకుతున్నారు, ఎందుకు స్పందించడం లేదు? “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక కారణం కావొచ్చు. ప్రతి ఇంటికీ ఎంతో కొంత లబ్ధి చేకూరుతోంది. కేంద్రం, రాష్ట్రం రైతు భరోసా కింద ప్రతి ఏటా కొంత నగదు వస్తోంది. రైస్ అందుతున్నాయి. దీనికి తోడు ఏదో విధంగా డబ్బు చేతిలో ఆడుతోంది. ఫలితంగా కరవు ప్రభావం కనిపించడం లేదు’ అని రైతు సంఘం నాయకుడు కేవీవీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. మరోపక్క, వ్యవసాయంపై శ్రద్ధా తగ్గింది. సాగు చేయాలంటే జనం భయపడే పరిస్థితి. ఫలితంగా చాలా కాలం నుంచే వ్యవసాయదారులు సాగుకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ‘ఆరుగాలం కష్టపడినా వచ్చేది అంతంత మాత్రమే. పైగా రాజకీయాలు, పైరవీలు ఇప్పుడు పెద్ద వ్యాపారం. కరవును కూడా రాజకీయాలు కమ్మేస్తున్న కాలం ఇది. అందువల్ల పెద్ద పెద్ద సమస్యలేవీ పైకి రావడం లేదు. రాజకీయ పక్షాలు అసలు విషయాన్ని మరుగుపరిచేలా అనవసరపు విషయాలను తెరపైకి తెచ్చి జనాన్ని దారిమళ్లిస్తుంటాయి. ఇప్పుడదే జరుగుతోంది’ అన్నారు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు. ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నా కరవు మాత్రం కళ్లకు కనిపిస్తోంది.

Read More
Next Story