కోళ్ల పరిశ్రమ అతలాకుతలం

ఆంధ్రప్రదేశ్‌లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతున్నాయి.


కోళ్ల పరిశ్రమ అతలాకుతలం
x
బ్రాయిలర్‌ కోళ్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కోళ్ల పెంపకం అతలాకుతలం అవుతోంది. బర్డ్‌ఫ్లూ రాష్ట్రమంతా వ్యాప్తి చెందుతోంది. నెల్లూరు జిల్లాలో వ్యాపించిన బర్డ్‌ఫ్లూ చిత్తూరు జిల్లాను కూడా వణికిస్తున్నది. నెల్లూరు జిల్లాకు చెందిన కోళ్ల పెంపకం దారులు చిత్తూరు జిల్లా నుంచి బాయిలర్‌ కోళ్లు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అంటే నెల్లూరు జిల్లాలో వ్యాపించడం కంటే ముందుగానే చిత్తూరు జిల్లాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో కోళ్లు ఎక్కువగా పెంచుతున్న జిల్లాల్లో పశు సంవర్థక శాఖ అధికారులు ప్రత్యేంగా ముందస్తు చర్యలు చేపట్టారు.

భయంకరమైన అంటువ్యాధి
బర్డ్‌ఫ్లూ భయంకరమైన అంటువ్యాధి. పక్షుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. గాలిద్వారా వ్యాధి వస్తుందని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ రా్రçష్టంల్లో ఈ వ్యాధి సోకి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి.
దేశంలో 2019లో వచ్చిన కరోనా వ్యాధికి దీనికి పెద్ద తేడా ఉండదని, పశువుల్లో వచ్చే కరోనా వ్యాధిగా భావించాలని పశువైద్యులు చెబుతున్నారు.
రాష్ట్రమంతా వ్యాపిస్తున్న బర్డ్‌ఫ్లూ
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తేటగొట్ల, కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామాల్లో బ్రాయిలర్‌ కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందింది. ఇక్కడి కోళ్లఫారాల్లో వేలకొద్ది కోళ్లు చనిపోతున్నాయి. ముందుగా అధికారులు గుర్తించిన ఫారాలను మూసి వేశారు. అక్కడ చనిపోయిన కోళ్లను పాతిపెట్టారు.
విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (విబిఆర్‌ఐ)కు కోళ్ల రక్తనమూనాలు అన్ని జిల్లాల నుంచి అధికారులు పంపిస్తున్నారు. అనుమానం వచ్చిన నమూనాలను రీసెర్చ్‌ ల్యాబ్‌ అధికారులు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఎడి) భోపాల్‌కు పంపిస్తున్నారు. కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో ఈ వ్యాధి వ్యాపించినట్లు అధికారులు ధృవీకరించారు.
విదేశీ పక్షుల ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు
సాధారణంగా విదేశీ పక్షుల ద్వారా బర్డ్‌ఫ్లూ వస్తుందని అంటుంటారు. అయితే నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నేలపట్టు ప్రాంతానికి ఫ్లెమింగో పక్షలు వస్తుంటాయి. నైజీరియా నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి గుడ్లుపెట్టి పిల్లలు లేపిన తరువాత పిల్లలతో కలిసి తిరిగి వెళుతుంటాయి. వైల్డ్‌లైఫ్‌ వారు ఇక్కడి పక్షుల సంరక్షణార్థం ఫ్లెమింగో ఫెస్టివల్‌ కూడా నిర్వహిస్తారు. అయితే నేలపట్టు ప్రాంతంలో వ్యాధి సోకలేదు.
అదే విధంగా కొల్లేరు ప్రాంతంలో కూడా విదేశీ పక్షులు ఉంటాయి. ఈ ప్రాతంలోనూ అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల వ్యాధి భారి నుంచి పక్షులను రక్షించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.
విదేశీ పక్షులు వచ్చే సరస్సులు ఉన్న జిల్లాలను అలర్ట్‌ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో విదేశీ పక్షులు వస్తుంటాయి. అక్కడి పక్షుల నుంచి శాంపుల్స్‌ కలెక్ట్‌ చేసి టెస్ట్‌కు పంపించారు.
బార్డర్‌ జిల్లాల్లో అలర్ట్‌
నెల్లూరుకు బార్డర్‌ జిల్లాలైన ప్రకాశం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలను అలర్ట్‌ చేశారు. ఒక చదరపు కిలో మీటరు పరిధిలో వెయ్యి కోళ్లు ఉంటే ఆ జిల్లాలను ‘ఎ’ కేటగిరీ జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఏపీలో అటువంటి జిల్లాలు మూడు ఉన్నాయి. అవి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లో ఇప్పటికే అధికారులు పర్యటించారు. ఫారాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
చెక్‌పోస్టులు ఏర్పాటు
నెల్లూరు, చిత్తూరు, కడప సరిహద్దు జిల్లాల నుంచి కోళ్లను వేరే జిల్లాలకు రవాణా జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆపివేశారు. అయినా కొన్ని చోట్ల నుంచి రవాణా జరుగుతున్నట్లు సమాచారం.
చిత్తూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు,7 లక్షల పెరటి కోళ్లు పెంపకం జరుగుతోంది. ఏటా రూ. 800 కోట్ల మేర పౌల్ట్రీ బిజినెస్‌ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఏడాదికి 37,089 మెట్రిక్‌ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడి గుడ్లను హేచరీస్‌ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా రూ. 5 కోట్ల వ్యాపారం జరుగుతోంది. తాజాగా బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఫౌల్ట్రీ వాహనాలను చెక్‌పోస్టుల దగ్గర అధికారులు ఆపివేస్తున్నారు. దీంతో తమ ఫౌల్ట్రీ వ్యాపారం ఇబ్బందుల పాలవుతోందని రైతులు వాపోతున్నారు.
ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లు
చిత్తూరు జిల్లాలో 31 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేశారు. జిల్లాలో పిపిఈ కిట్లు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచింది. దాదాపు జిల్లాలో 8 వేల మంది రైతులు పౌల్ట్రీ రంగంపై ఆధారపడినట్లు చెబుతున్న అధికార యంత్రాంగం చెబుతోంది. నెల్లూరు జిల్లా నుంచి కోళ్ల ఎగుమతులను నిషేధించింది. చికిత్స, టీకా లేని బర్డ్‌ ఫ్లూను కేవలం నివారించడం ఒక్కటే మార్గం అంటోంది. పశువైద్య సిబ్బంది ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజల్లో బర్డ్‌ ఫ్లూపై అవగాహన కల్పిస్తోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అలెర్ట్‌ గా ఉన్నామంటున్నారు చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ లేదని జిల్లా ప్రజలు భయపడాల్సిన పని లేదంటున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని కోడి మాంసం, కోడిగుడ్లు వినియోగించాలంటున్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఎన్‌టీఆర్‌ జిల్లాలో 17 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఈ టీముల్లో ఒక వెటర్నరీ డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది, మరో ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్స్‌ ఉంటారు. ఎక్కడ అకస్మికంగా కోళ్లు మృత్యువాత పడ్డా వెంటనే అక్కడికి వెళ్లి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ వ్యాధి నిర్థారణ జరుగుతుంది. రైతులను చైతన్యవంతం చేసే కార్యక్రమం చేపట్టారు. ఫామ్‌లోకి కొత్తగా వచ్చే కోళ్ల విషయంలో అప్రమత్తత అవసరమని చెబుతారు. కోళ్ల ఫారంలోకి ఇతరులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.
Next Story