రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అంశం ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ నేతల చుట్టూ తిరుగుతోంది. వారిపైన కేసులు నమోదుకు ఉపక్రమించారు.


ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అంశం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా అది మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేత పేర్ని నాని మెడకు చుట్టుకుంది. ఆయన భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేర్ని నాని ఆయన సతీమణి జయసుధ పేరు మీద కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజక వర్గం పరిధిలో ఓ గిడ్డంగిని నిర్మించారు. దానిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం మచిలీపట్నంలోని పేర్ని నాని గోడౌన్‌ను కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇక్కడ బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు 185 టన్నల రేషన్‌ బియ్యం మాయమైనట్లు లెక్కలు తేల్చారు. అయితే దీనిపైన పేర్ని నాని తప్పించుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేబ్రిడ్జి సరిగా పని చేయడం లేదని, అందువల్లే తూకాల్లో తేడాలున్నాయని తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కృష్ణాజిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. గొడౌన్‌లో ఉండాల్సిన రేషన్‌ బియ్యం నిల్వల కంటే తక్కువుగా ఉన్నాయని దాదాపు 185 టన్నుల బియ్యం మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదు చేశారు.

ఈ పరిణామం కృష్ణా జిల్లా, మచిలీపట్నం వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఏమి చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముందుగా ఊహించిన విధంగానే రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు చుట్టుకుంటుందనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
Next Story