మొక్కజొన్న చేలో అన్ని గొర్రెలు ఎందుకు చచ్చిపోయాయి?
x
గొర్రెల మృతదేహాలను పరీక్షిస్తున్న అధికారులు, ప్రజలు

మొక్కజొన్న చేలో అన్ని గొర్రెలు ఎందుకు చచ్చిపోయాయి?

అనంత కరువు గొర్రెలను బలితీసుకుంది. గ్రాసం కోసం అల్లాడుతున్న గొర్రెలు హైడ్రోజన్ సైనైడ్‌తో కూడిన మొలకలు మేసి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాయి.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్,)

తిరుపతి: అనంతపురం జిల్లా పడమటి ప్రాంతంలో కరువు ఉరుముతోంది. మంచినీటికి మనుషులు కటకటలాడుతున్నారు. మూగ జీవాలు గ్రాసం కోసం నకనకలాడుతున్నాయి. పొలాల్లో ఉన్న కాస్త పచ్చిక హైడ్రోజన్ సైనేడ్‌గా మారింది. విషంతో సమానమైన ఈ గ్రాసం మంగళవారం పదుల సంఖ్యలో గొర్రెలను బలితీసుకుంది. ఈ సంఘటనతో.. పశు సంపద ఆధారంగా జీవనం సాగించే పెంపకందారులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అనంతపురం జిల్లా పడమటి ప్రాంతాలైన కదిరి కళ్యాణ్ దుర్గం ఉరవకొండ రాయదుర్గం గొర్రెల సంతానోత్పత్తి, వాటి నుంచి వచ్చే ఉన్నితో కంబళ్లు తయారు చేయడం ద్వారా వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో తాజాగా 49 గొర్రెల మృతి వెనక కరాళ నృత్యం చేస్తున్న కరువు పంజా ఉన్నట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. మేత కోసం తీసుకువెళ్లిన గొర్రెలు పచ్చికమేస్తూ ప్రాణాలు విడిచాయి.

గడ్డి కోసం ఊరు దాటాం సార్..

జొన్న ఇగురు తిని 49 గొర్రెల మృతి చెందిన సంఘటన గొర్రెల పెంపకందారులను ఆందోళనకు గురిచేసింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలం పి వెంకటం పల్లి తండాకు చెందిన బాధిత రైతు లాల్య నాయక్ తన కన్నీటి గాధను ఇలా చెబుతున్నారు.. "మా ఊరికి చుట్టుపక్కల గడ్డి లేదు. పశువుల పెంపకమే మాకు జీవనాధారం. నాకున్న 80 గొర్రెలను కర్ణాటక రాష్ట్రం బళ్ళారి సమీపంలోకి తోలుకొని పోయిన. మళ్లీ పశువులను తోలుకొని మా ఊరికి తిరిగి వస్తుంటే.. పొద్దు పోవడం వల్ల బెలుగుప్ప మండలం గంగవరం గ్రామ సమీపంలో పొలాల్లో విడిది చేశాం. పంట దిగుబడి రాకపోవడంతో, దున్నేసిన జొన్న పంటలో వచ్చిన ఇగురు మేసిన గొర్రెలు కొంతసేపటికి అక్కడిక్కడే కిందపడి గిలగలడుతూ ప్రాణాలు వదిలాయి’’ అని కన్నీటితో చెప్పారాయన.


బాధిత రైతు లాల్య నాయక్ కథనం ప్రకారం.. 80 గొర్రెలు చనిపోయాయి అంటున్నారు. కానీ అక్కడ కేవలం 49 గొర్రెల మృతదేహాలు మాత్రమే ఉన్నాయి. మిగతా వాటిని స్థానిక గ్రామాల ప్రజలు ఎత్తుకెళ్లిపోయారు అనేది ఆయన ఆవేదన. గొర్రెలు చనిపోవడం వల్ల తాను రూ.10.50 లక్షలు నష్టపోయానని రైతు లాల్య నాయక్ కన్నీరుమున్నీరయ్యారు.

మొలకల్లో హైడ్రోజన్ సైనేడ్..

పొలాల్లో గొర్రెలు మేత మేస్తూ చనిపోయానే విషయం తెలియగానే బుధవారం ఉదయం ఘటన స్థలానికి వెళ్లినట్లు బెడుగుప్ప పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ రమేష్.. ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే.. "మంచినీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ జొన్న పంట మొలకల్లో హైడ్రోజన్ సైనేడ్ ఉంటుంది. ఈ గ్రాసం మేసిన పశువులకు వైద్యం చేసేందుకు కూడా ఆస్కారం ఉండదు. నిమిషాల వ్యవధిలోనే చనిపోతాయి’’ అని డాక్టర్ రమేష్ వివరించారు.

ఇప్పుడు కూడా దున్నేసిన పంటలో కొద్దిపాటి ఎక్కువగా వచ్చిన మొలకలు మేసిన గొర్రెల మృతికి కూడా.. హైడ్రోజన్ సైనేడ్ అనే పదార్థమే కారణమని ఆయన వివరించారు. "చనిపోయిన గొర్రెలు పోస్టుమార్టం చేసిన అనంతరం నిర్ధారించుకున్న వెంటనే, మా పరిధిలోని గ్రామాల్లో పశువుల పెంపకందారులను అప్రమత్తం చేస్తూ.. దండోరా వేయించాం" అని డాక్టర్ రమేష్ చెప్పారు.

సమాచారం అందిన వెంటనే

కళ్యాణదుర్గం ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ గుప్తా కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. గొర్రెల మృతి పై నివేదిక ఇవ్వాలని మండల పరిషత్ వైద్యశాఖ అధికారిని ఆయన ఆదేశించారు. చనిపోయిన గొర్రెలకు బీమా చేయించలేదని బాధిత రైతు లాలీ నాయక్‌తో పాటు మండల పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ రమేష్ ధ్రువీకరించారు.


ఆర్‌బీకేలు ఎందుకు

ప్రతి గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి ఇంటి గడప దగ్గరకే ప్రభుత్వ సేవలను తీసుకొస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక వస్తువులు, యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచామని ప్రభుత్వం ఒక పక్క చెబుతోంది. అది వాస్తవమే కావచ్చు గాక, అనంతపురం జిల్లా పశ్చిమ ప్రాంతంలో పశువుల పెంపకం ఆధారంగా జీవించే కాపరులు, పెంపకందారులు నిర్లక్ష్యానికి గురవుతున్నారనే విషయం గొర్రెల మృతితో నిర్ధారణ అయింది.

విపత్తులు వచ్చినప్పుడు జరిగే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిహారంతో ఉపశమనం కలిగిస్తుంది. బాధితులకు లక్షల రూపాయలు పరిహారం మంచినీళ్ల ప్రాయంలా అందిస్తుంది. "లాల్యా నాయక్‌తో పాటు గతంలో గోడ కూలి 100 గొర్రెలు మృతి చెందిన బాధితునికి, వరదల్లో పుట్టపర్తి వద్ద వెయ్యి గొర్రెలు కొట్టుకుపోవడంతో నష్టపోయిన పెంపకందారులకు పరిహారం చెల్లించాలని" గొర్రెల పెంపకం దారుల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కురుబ శివబాల డిమాండ్ చేశారు. పశువుల సంరక్షణ కోసం ప్రభుత్వ భూముల్లో గడ్డి పెంచడంతోపాటు, నీటి కుంటలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివబాల కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో పశు సంరక్షణ కేంద్రాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.



Read More
Next Story