"బాబూ.. టోపీ"కే పీచే.. క్యా హై..!?
అప్పట్లో ఎన్టీరామారావు అనేక కొత్త గెటప్‌లతో ప్రత్యేకంగా కనిపించారు. ఆ బాటలో ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు టోపీతో ఆకట్టుకుంటున్నారు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: రాష్ట్రంలో ఎన్. చంద్రబాబునాయుడు తెలియని వ్యక్తి ఉండకపోవచ్చు. 82 సంవత్సరాల వయసులో కూడా రేసుగుర్రంలా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ధరిస్తున్న తెల్లటి ఉలన్ టోపీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ టోపీ కథ ఏంటి అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం కడప అసెంబ్లీ స్థానం, రాయచోటిలో కూడా ఆయన.. బిజెపి రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి రాయచోటి అభ్యర్థి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా ఆయన టోపీ ధరించే ఉన్నారు. ఈ గెటప్‌లో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కనిపించారు.
ఎన్టీఆర్‌వి ఎన్ని అవతారాలో..
టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు మొదట రాజకీయ ప్రచారం ప్రారంభించినప్పుడు ఖాకీ చొక్కా, ప్యాంటుతో జనంలోకి వచ్చారు. ఆ తర్వాత వివేకానందుని గెటప్లో తలకు కాషాయ వస్త్రాలతో గంభీరంగా కనిపించారు. మళ్లీ శేష వస్త్రాల్లోకి మారిన ఆయన తెల్లటి పంచ, సుబ్బాలాంటి చొక్కాతో పెద్దరికంతో ప్రత్యేకంగా కనిపించారు. ఆ కోవలో ప్రస్తుత టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు టోపీతో కనిపిస్తున్నారు.
ముమ్మరంగా ప్రచారం
రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం ఇంకో పది రోజుల్లో పూర్తికానున్నది. ఇప్పటివరకు కూటమి పార్టీలు, అధికారపక్షం అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచార రంగంలో ముమ్మరంగా ఉన్నారు. గడువు సమీపించే కొద్దీ ప్రచారం వాడి వేడి కూడా పెరిగింది. ఆ కోవలోనే చంద్రబాబు నాయుడు రోజు రెండు నుంచి మూడు వచ్చి జిల్లాలో నియోజకవర్గాలను చుట్టుముట్టేస్తున్నారు. మీద పడిన వయసును కూడా ఏమాత్రం లెక్కచేయకుండా ఆయన తిరుగుతున్న, మాట్లాడుతున్న విధానంతో యువకులను కూడా ఔరా అనిపిస్తున్నారు. కారణం ఏంటంటే ఎండలు మండిపోతున్నాయి. 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 తర్వాత బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. సాయంత్రం నాలుగు తర్వాత కానీ ఇంటి నుంచి బయటికి రావడానికి తటపటాయిస్తున్నారు. అయినప్పటికీ..
తగ్గని ఉత్సాహం..
ఎన్నికల ప్రచారం గడువు తక్కువగా ఉండడంతో మిగతా పార్టీ నాయకులతో పాటు ఎన్ చంద్రబాబు నాయుడు కూడా విపరీతంగా పర్యటిస్తున్నారు. అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాలను కవర్ చేసేస్తున్నారు. అందులో భాగంగానే గురువారం కడప జిల్లా పరిధిలోని రాయచోటి శాసనసభ స్థానంలో కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. ప్రచార రథంపై నుంచి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన నెత్తిన తెల్లటి టోపీ ప్రత్యేకంగా కనిపించింది. గతంలో ఎప్పుడూ లేనిది ఈ గెటప్ ఏమిటో అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మండుతున్న ఎండల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ధరిస్తున్న ఆ టోపీ మూడు రోజుల క్రితం బ్రిటన్ నుంచి తెప్పించినట్లు టిడిపి వర్గాల ద్వారా తెలిసింది.
ఆ టోపీ ధర సుమారు పదివేల వరకు ఉండచ్చని భావిస్తున్నారు. ఉలెన్‌తో ప్రత్యేక విధానంతో తయారుచేసిన ఆ టోపీ ధరిస్తే ఎండ వేడిమి సోకుండా అత్యంత చల్లగా ఉంటూ ఉపశమనం లభిస్తుందని తెలిసింది. కాగా, గత ఏడాది నుంచి చంద్రబాబు నాయుడు తన ఎడమ చేతి చూపుడు వెలికి ఓ ఉంగరం ధరిస్తున్న విషయం తెలిసిందే. అందులో అమర్చిన మైక్రోచిప్ సరైన వేలకు ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకునే సమయాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా వేలికి ఉన్న ఉంగరంలోని మైక్రోచిప్ ద్వారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిలను అంటే బిపి, షుగర్ ఇతరత్రా సమస్యలను డాక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వివరాలను ఏడాది కిందట చంద్రబాబునాయుడు స్వయంగా వెల్లడించారు. ఈ ఉంగరం ధరించాలన్న నిర్ణయం తన భార్య నారా భువనేశ్వరిదని గతంలో చంద్రబాబు వివరించడం గమనార్హం. మొత్తానికి టోపీ గెటప్‌లో చంద్రబాబు కొత్తగా కనిపిస్తున్నారనేది అందరి నోటా వినిపించే మాటలు.