ఏపీలోని కొందరు ఎమ్మెల్యేల డ్రస్ కోడ్ వెరైటీగా ఉంటుంది. అది వారి స్టైల్. ఈ స్టైల్ కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. కానీ వారు మాత్రం మారరు. ఎవరా ఎమ్మెల్యేలు?


ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. ఒకరు తల గుడ్డలో దిట్ట. మరొకరు పంచె కట్టులో దిట్ట. ఇంకొకరు లాల్చీఫైజామా వేసేకోవడంలో దిట్ట. అలాగే కొందరు గడ్డం ఒకే సైజులో పెంచుతారు. ఒకరు ఒకే రంగు చొక్కాలు వేసుకుని రికార్డు సృష్టిస్తారు. ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఆరుగ్గురు ఎమ్మెల్యేల స్టైల్‌పై ఈ వారం ఫోకస్‌. ఈ ఆరుగ్గురి స్టైల్‌పై కామెంట్‌ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ స్తైలు వేరుగా ఉంటుంది. ఎప్పుడూ గడ్డం, తల వెంట్రుకలు పెరిగి ఉంటాయి. తల స్నానం చేసి అలాగే వదిలేస్తాడు. దువ్వెన పెట్టకపోవడంతో ఇరబోసుకున్నట్లు వెంట్రుకలు కనిపిస్తాయి. మంచి మాటకారి ఆయన డ్రెస్సింగ్‌ స్టైల్‌ వెరైటీగా ఉంటుంది. ఎక్కువగా తెల్లని వస్త్రాలు ధరిస్తాడు. మెడలో పచ్చకండువా ఎప్పుడూ ఉంటుంది. ఒక్కోసారి ఆ కండువాను చేతులతో తిప్పుతూ కనిపిస్తాడు. మెడలో కండువా ఆయన ప్రత్యేక స్టైల్‌. పచ్చ చొక్కాలు కూడా ఎక్కువగానే ధరిస్తాడు. రంగు చొక్కాలూ వేసి అప్పుడప్పుడూ ఆశ్చర్య పరుస్తుంటాడు.

చింతమనేని ప్రభాకర్‌ 1968 జనవరి 3న జన్మించారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు. తెలుగుదేశం పార్టీలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుండి 2019 వరకు ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ విప్‌గా పనిచేశాడు. ప్రభాకర్‌ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. తండ్రి కేశవరావు. రైతు కుటుంబం. 1986లో సర్‌ కట్టమంచి రామలింగారెడ్డి కళాశాల, ఏలూరులో తన ఇంటర్మీడియట్‌ చదివి తరువాత డిగ్రీ పూర్తి చేశారు.
గొట్టిపాటి రవి కుమార్‌ ప్రస్తుతం విద్యుత్‌ శాఖ మంత్రి. ఈయన కూడా ఎక్కువగా గడ్డంతో కనిపిస్తాడు. మొదట రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గడ్డం తీసి సాధారణంగా కనిపించే వారు. రానురాను గడ్డంతో కనిపించడం మొదలు పెట్టాడు. ఒకే సైజులో ట్రిమ్‌ చేసి ఉంచడంతో అదో స్టైల్‌ అయిపోయింది. చూసే వారికి ఎందుకు మాసిన గడ్డంతో కనిపిస్తాడని అనుకుంటారు. కానీ ఇది ఆయన స్టైల్‌. తెల్లని బట్టలు ఎక్కువగా వేసుకుంటారు. అప్పుడప్పుడూ రంగుల షర్టులు కూడా ధరిస్తాడు. అధికారికంగా పర్యటనల్లో తెల్లని దుస్తులు ధరిస్తాడు.
అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, మార్టూరు నుంచి ఒక సారి గెలిచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మార్టూరును రద్దు చేసి ప్రకాశం జిల్లా పర్చూరులో విలీనం చేశారు. రవికుమార్‌ను బుజ్జి అని కూడా అంటారు. రవికుమార్‌ 1976లో శేషగిరిరావుకు జన్మించాడు. గుంటూరులోని విద్వాన్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివారు. 1993లో కర్నాటకలోని దావంగెరెలోని బిఐఈటీ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ చేసాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి స్వతహాగా వ్యాపారాలు చేస్తున్నాడు.
రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్టైల్‌ పలువురిని ఆకట్టుకుంటుంది. పక్కాగా రైతులు స్వంత వారితో ఎలా మాట్లాడుతారో రామానాయుడు స్థానికులు కానీ, బయటి వారితో కానీ అలాగే మాట్లాడతారు. ఎప్పుడూ పచ్చ షర్టు ధరిస్తాడు. మెడలో కండువా ఉంటుంది. కండువా ఉన్నా లేకున్నా పచ్చ షర్టు మాత్రం మానడు. తెల్ల ప్యాంటు వేస్తారు. బైకులు నడపడం, సైకిళ్లు తొక్కడం ఆయనకు సరదా. చూడగానే తెలుగుదేశం పార్టీ నాయకుడంటే ఇలా ఉండాల్రా అనిపిస్తాడు. ఉన్నత చదువులు చదివినా మంచి విజ్ఞానవంతుడనే స్టైల్‌లో ఆయన ఎప్పుడూ కనిపించడు. అంటే మెడలో టైకట్టుకుని ఎప్పుడైనా కనిపిస్తాడేమోనంటే అది కుదిరేపని కాదనిపిస్తాడు. విదేశాల్లోనూ ఇదే స్టైల్‌లో ఉంటాడు.
1969 మే 6న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని అగర్తిపాలెంలో జన్మించారు. 1992లో ఎంఎ చదివారు. 1995 ఎంఫిల్‌ చేసాడు. 2005లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి చేసాడు. పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో రెండవ సారి గెలుపొందాడు. మూడో సారి గెలిచి ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా చేస్తున్నారు. రాష్ట్రంలో రామానాయుడు ఒక రైతు. రైతుల చట్టపరమైన పోరాటాలకు మద్దతు ఇస్తూ రాజకీయంగా ఎదిగారు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్టైల్‌ వేరుగా ఉంటుంది. నిత్యం తలకు ఆకుపచ్చ కండువా చుట్టి ఇంటి నుంచి బయటకొస్తాడు. తల పాగా కూడా వెరైటీగా ఉంటుంది. తల చుట్టూ టోపీలా బిగించి చుట్టి ఉంటుంది. అధికారిక కార్యక్రమాల్లోనూ ఈ తలగుడ్డ అలాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అమరావతిలో ఉద్యమాలు చేస్తూ వచ్చారు. అమరావతి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకునిగా రైతుల పక్షాన పోరాటాలు చేశాడు. ఆయన పోరాటాల ఫలితమే తిరువూరు ఎమ్మెల్యే టిక్కెట్‌ రావడం. పచ్చ కొక్కా ఎక్కువగా ధరిస్తాడు. అప్పుడప్పుడు వేరే రంగుల చొక్కాలు కూడా వేస్తాడు. తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో చంద్రబాబు ఆయనకు అక్కడ సీటు ఇచ్చారు. ఉండవల్లి నుంచి తిరువూరుకు వెళ్లాడు. డ్రస్‌ కోడ్‌కు పెద్దగా ప్రయారిటీ ఇచ్చినట్లు కనిపించడు. అయితే తలపాగాతో ఫిట్‌ షర్టు, ప్యాంట్‌తో వెరైటీగా కనిపిస్తాడు.
జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణ లాల్చీ ఫైజామాతోనే ఉంటాడు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే డ్రెస్‌ కోడ్‌ మెయింటెయిన్‌ చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఇదే రకమైన డ్రెస్‌లు వేసే వారని చెబుతారు. ఎక్కువగా తెల్ల దుస్తులు వాడతారు. వేరే రంగులు వాడినా లైట్‌ కలర్స్‌పై ఎక్కువ దృష్టి ఉంటుంది. అప్పుడప్పుడు మెడలో జరీ కండువా వేస్తారు. మెడ నుంచి ముందుకు రెండు వైపుల కిందకు దగవేసి కండువాను వదిలేస్తారు.
కాంగ్రెస్‌ పార్టీలో 1980లో చేరాడు. 1989లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పి అప్పలనరసింహంపై 9 ఓట్ల మెజారిటీతో గెలిచి 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. తిరిగి 1991లో పదవ లోక్‌సభకు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1990, 1992 సంవత్సరాలలో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతిలో 50వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. 1999లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీతరఫున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2004లో దాడి వీరభద్రరావుపై 17వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో శాసనసభకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, తెలుగు దేశం అభ్యర్థి దాడి వీరభద్ర రావు, తనకు మధ్య జరిగిన త్రిముఖ పోరులో స్వల్ప ఓట్లు తేడాతో గంటా శ్రీనివాసరావు గెలిచారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా చేశారు. రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన రామకృష్ణ ఆయన మరణానంతరం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అండగా నిలిచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఈయన తమ్ముడు కొణతాల రఘునాథ్‌ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. విశాఖ ఎంపీగా పోటీకి దిగిన వైఎస్‌ విజయమ్మ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించాడు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. తన కులం మీద మాత్రమే కాకుండా ఇతర కులాల్లో కూడా ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు 2024 జనవరి 25న జనసేన పార్టీలో చేరారు.
కొణతాల రామకృష్ణ 1957, జనవరి 4న అనకాపల్లి పట్టణంలో జన్మించారు. ఇతని తండ్రి పేరు కొణతాల సుబ్రహ్మణ్యం. ఆయన విద్యాభ్యాసం అనకాపల్లిలోని అనకాపల్లి మర్చంట్స్‌ అసోసియేషన్‌ లింగమూర్తి కాలేజిలో జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంకాం పట్టా పొందారు. వ్యవసాయదారుడిగా, వ్యాపారిగా, పారిశ్రామిక వేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా పేరు సంపాదించారు. ఈయన గవర కమ్యూనిటీకి చెందినవారు. గవర అనకాపల్లి ప్రాంతంలో బలమైన వ్యాపార కులం.
బిజేపీ కామినేని శ్రీనివాసరావు రైతు కుటుంబం నుంచి వచ్చారు. భారీ విగ్రహం కావడం, పంచకట్టులో ఎక్కువగా కనిపిస్తుండటంతో అందరినీ ఆకర్షిస్తుంటాడు. ఎప్పుడన్నా ఒక్కసారి ప్యాంట్‌లో కనిపించినా నియోజకవర్గంలో ఎక్కువగా పంచకట్టులోనే కనిపిస్తారు. అడ్డ పంచ, సాధారణ రైతులు ధరించే పంచకట్టులో ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా తెల్ల, రంగు వస్త్రాలు ధరిస్తారు. మెడలో అప్పుడప్పుడు కండువాను కిందకు రెండు వైపుల వదిలేసి వేసుకుంటారు. కామినేని శ్రీనివాసరావు మే 7, 1947న జన్మించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శాసనసభ్యునిగా ఎన్నికై నారా చంద్రబాబునాయుడు మంత్రిమండలిలో ఆరోగ్య, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ శాఖల మంత్రిగా పని చేశారు. 1980లో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కామినేని తదనంతరం పార్టీకి దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత చిరంజీవితో పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు బిజెపిలో చేరి కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఈయన స్వగ్రామం కైకలూరు మండలం వరహాపట్నం. ఈయన ఎంబిబియస్‌ చదివారు. కామినేనికి కుమారులు ఉన్నారు. వారు విదేశాల్లో చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
Next Story